2016లో జరిగిన జర్మన్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించాడు భారత పారా స్విమ్మర్ సుయాశ్ జాదవ్. ఆ తర్వాత 2018లో జరిగిన ఆసియన్ పారాగేమ్స్‌లో ఏకంగా పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. జీవితంలో తనకు ఎదురైన విషాదాన్ని గుర్తు చేసుకోవడం సహా పారా స్విమ్మింగ్‌లో అరుదైన ఘనతలు అధిరోహించిన క్షణాలను 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా గుర్తు చేసుకున్నాడు.
ఆసియన్ గేమ్స్‌లో తొలిసారి బంగారు పతకం సాధించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
నా కెరీర్లో అదే తొలి అంతర్జాతీయ బంగారు పతకం. ఆసియన్ పారాగేమ్స్ చరిత్రలో భారత్‌కు అదే మొదటి పసిడి పతకం. నాకు, అదే విధంగా మన దేశానికి ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారతీయుడిగా మరింత గర్వపడటమే కాకుండా మంచి అనుభూతినిచ్చింది.
ప్రమాదంలో మీ చేతులను ఎలా కోల్పోయారు? ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడ్డారు?
2004లో నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు ఓ పెళ్లి వేడుకకు మా కుటుంబంతో కలిసి వెళ్లా. ఇంట్లో పెళ్లి జరుగుతుంటే నేను ఇంటిపైకి వెళ్లి ఆడుకుంటున్నా. అంతలోనే నా రెండు చేతులు అక్కడున్న విద్యుత్ తీగకు తగిలాయి. చేతులు రెండూ శాశ్వతంగా స్వర్శను కోల్పోయాయి. వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్తే.. మోచేతుల కింద భాగాన్ని తీసివేయాలని సూచించారు.
అంత చిన్న వయస్సులో నాకు అలాంటి ప్రమాదం జరుగుతుందని ఊహించలేదు. నేనేమో కానీ నా తల్లిదండ్రులు మాత్రం మరింత బాధకు లోనయ్యారు. నా రెండు చేతులు కోల్పోయినందుకు బాధగా అనిపించినా.. దాన్ని నా ముఖంలో చూపించలేదు. ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి నేను ఎలాంటి మందులు వాడలేదు. మెల్లమెల్లగా పరిస్థితులను అధిగమిస్తూ.. నా పనులు నేను చేసుకోవడం మొదలుపెట్టా. కానీ, ఏదో ఒకరోజు కచ్చితంగా ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తా.
స్విమ్మింగ్ కెరీర్లో మీ తండ్రి ప్రధాన పాత్ర పోషించడం సహా మీకు స్విమ్మింగ్‌లో మొదటి కోచ్‌గా సహకరించారని చెప్పారు. జాతీయ స్థాయి స్విమ్మరైన మీ తండ్రి గురించి చెప్పండి?
1978లో మా నాన్న జాతీయ ఈత పోటీలకు ఎంపికయ్యారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది రద్దైంది. దేశానికి పతకం తీసుకురావాలన్న ఆయన ఆశయం నా రూపంలో పూర్తయింది. అదే కాక ఆయనే స్విమ్మింగ్‌లో నా మొదటి గురువు.
కరోనా లాక్డౌన్ సమయంలో ఫిట్‌గా ఉండటానికి మీరు ఏం చేశారు?
కరోనా కారణంగా స్విమ్మింగ్ పూల్స్ అన్నీ మూతపడ్డాయి. దీనివల్ల ఈతగాళ్లందరిపై తీవ్ర ప్రభావం పడింది. కానీ, నా శిక్షణను ఆపలేదు. ఇంట్లోనే కొన్ని కసరత్తులు చేస్తూ ఉన్నా. లాక్డౌన్ సమయంలో స్విమ్మింగ్‌కు బదులుగా రన్నింగ్ ప్రాక్టీస్ చేశా. అది నాకెంతో ఉపయోగపడింది.
టోక్యో ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడ్డాయి? మీ శిక్షణపై ఇది ఎంత ప్రభావం చూపింది?
ఒలింపిక్స్ వాయిదా పడటం నాకే కాకుండా టోర్నీ కోసం అహర్నిశలు ప్రాక్టీసు చేస్తున్న క్రీడాకారులందరిపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ, దొరికిన సమయంలో ఫిట్నెస్ను పెంచుకోవాలని భావించా. బంగారు పతకాన్ని సాధించడానికి అత్యుత్తమ ప్రయత్నం చేస్తున్నా.
మీరు అనుసరించే క్రీడా ప్రముఖులు ఎవరు?
స్విమ్మింగ్‌లో అయితే మైఖెల్ ఫెల్ప్స్. మొత్తంగా ఉసేన్ బోల్ట్‌ను ఇష్టపడతా. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫాలో అవుతా. క్రమశిక్షణ, నిలకడలో సచిన్‌ను అనుసరిస్తా.
స్మిమ్మింగ్‌లో రాణించాలనుకుంటున్న యువ స్మిమ్మర్లందరికీ మీరు స్ఫూర్తి. వారికి ఏం సలహా ఇస్తారు?
నేను నా జీవింతలో ఒకే సిద్ధాంతాన్ని నమ్మా. "మీకు ఉన్నదాని గురించి ఆలోచించండి. లేని దాని గురించి చింతించొద్దు. మీ అభిరుచిని అనుసరించండి. మీకు విజయం దక్కుతుంది. కష్టం మాత్రమే మిమ్మల్లి టాప్‌లో ఉంచుతుంది."