Indonesia Open 2023 : ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000లో భాగంగా గురువారం జరిగిన ఈవెంట్లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఓటమిని చవి చూసింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో తైపీకి చెందిన తాయ్ ట్జు యింగ్ చేతిలో 21-18 21-16 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. సింధు..గత రెండు ఈవెంట్‌ల నుంచి కూడా ఓపెనింగ్ రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఇటీవలే జరిగిన 2023 సుదీర్‌మాన్ కప్‌లోనూ సింధు- తాయ్ ట్జు పోటీపడ్డారు. ఆ మ్యాచ్‌లోనూ సింధుపై 21-14 18-21 21-17 తేడాతో తాయ్ గెలుపొందింది. ఇక ఇదే ఈవెంట్లో జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్.. భారత్‌కే చెందిన యువ సంచలనం లక్ష్యసేన్‌పై 21-17 22-20 తేడాతో విజయం సాధించాడు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో శ్రీకాంత్.. 21-17 22-20 తేడాతో సేన్‌ను ఓడించాడు.
శ్రీకాంత్ కంటే ముందు ఈ గేమ్‌లో లక్ష్య సేన్ దూసుకెళ్లాడు. నువ్వా-నేనా అంటూ ఆడుతూ శ్రీ కాంత్‌పై 4-0 ఆధిక్యాన్ని సాధించాడు. అలా 17 పాయింట్ల వరకు తన ఆధిక్యాన్ని కొనసాగించాడు. ఇక ఆట వేగం పుంజుకుంటుదన్న తరుణంలో సీనియర్ ప్లేయర్ శ్రీ కాంత్ విజృంభించి గేమ్‌ను ఇంకా ఆసక్తికరంగా మార్చాడు. వరుసగా నాలుగు పాయింట్లు తన ఖాతాలో వేసుకుని అందరి చేత ఔరా అనిపించుకున్నాడు.
ఇక రెండో రౌండ్ కూడా ఇంచుమించు మొదటి గేమ్ లాగే సాగింది. అప్పటి వరకు 14 పాయింట్లతో ఇద్దరూ ఒకే జోరులో ఉన్న తరుణంలో ఆరు స్ట్రెయిట్ పాయింట్లు స్కోర్ చేసిన శ్రీ కాంత్.. 20-14 తేడాతో సేన్‌పై ఆధిక్యాన్ని చూపించాడు. కానీ సేన్ కూడా వెనువెంటనే 20 పాయింట్లు సాధించడం వల్ల ఇద్దరి వద్ద సమమైన పాయింట్స్ ఉన్నాయి. ఇక విజయం ఎవరిది అన్న ఉత్కంఠతో జరిగిన రౌండ్లో శ్రీ కాంత్.. మరో రెండు పాయింట్లు సాధించి లక్ష్య సేన్‌ను వెనెక్కి నెట్టి టోర్నీలో ముందుకు సాగాడు.