భారత హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 8న మొహాలిలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరిన ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఈరోజు ఉదయం 6.30కు తుదిశ్వాస విడిచారు.
అధిక జ్వరంతో శ్వాసనాళ న్యుమోనియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యబృందం తెలిపింది. కొన్ని రోజుల వైద్యం తర్వాత మే 18న బల్బీర్ సెమీ కోమాటోజ్ స్థితిలోకి చేరుకోగా.. ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన మనవడు కబీర్ ప్రస్తావిస్తూ.. "నానాజీ ఈ ఉదయం కన్నుమూశారు" అని ఒక సందేశాన్ని పంపారు.
రెండేళ్లుగా ఆస్వస్థతకు గురవుతున్న బల్బీర్.. నాలుగు సార్లు ఇన్టెన్సివ్ కేర్‌లో ఉన్నారు. గతేడాది జనవరిలో బల్బీర్.. శ్వాసనాళ సంబంధిత వ్యాధి కారణంగా మూడు నెలలకు పైగా ఆసుపత్రిలో గడిపారు.
రికార్డులే రికార్డులు...
బల్బీర్ సింగ్‌కు నలుగురు సంతానం. కుమార్తె సుష్బీర్.. కుమారులు కన్వాల్బీర్, కరణ్బీర్, గుర్బీర్ ఉన్నారు. మూడుసార్లు ఒలింపిక్ బంగారు పతకాలను సాధించిన ఆటగాడిగా బల్బీర్ గుర్తింపు పొందారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎంపిక చేసిన 16 మంది భారత దిగ్గజ క్రీడాకారుల్లో బల్బీర్ ఒకరు.
- ఒలింపిక్స్ పురుషుల హాకీ ఫైనల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సాధించిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. హెల్సింకి ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్‌పై జరిగిన తుదిపోరులో ఐదు గోల్స్ నమోదు చేశారు.
- 1957లో పద్మశ్రీ పురస్కారంతో బల్బీర్‌ను భారత ప్రభుత్వం సత్కరించింది.
- లండన్(1948), హెల్సింకి(1952) భారత హాకీ జట్టు వైస్ కెప్టెన్‌గా, మెల్బోర్న్(1956)లో హకీ జట్టు కెప్టెన్‌గా మూడు ఒలింపిక్స్‌లో బంగారు పతకాలను సాధించారు.
- 1975లో జరిగిన హాకీ ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు.