త్వరలో పాకిస్థాన్‌లో నిర్వహించనున్న ఐసీసీ టోర్నమెంట్ల నుంచి టీమ్‌ఇండియా వైదొలుగుతుందని తాను అనుకోవడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా (Ramiz Raja News) అన్నాడు. ఇరు దేశాల మధ్య రాజకీయ అనిశ్చితి ఉన్నంత కాలం.. భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు (India vs Pakistan) నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నాడు.
"అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్లు నిర్వహిస్తున్నంత కాలం భారత జట్టు.. పాకిస్థాన్‌లో నిర్వహించే సిరీస్‌ల నుంచి వైదొలగలేదు. ఒక వేళ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తే ఇతర జట్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురుకోవాల్సి వస్తుంది. అందుకే, భారత్ అలా చేస్తుందనుకోవడం లేదు. అలాగే, టీమ్‌ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించడం చాలా కష్టం. కానీ, త్రైపాక్షిక సిరీస్‌లు నిర్వహిస్తే ఇరు జట్లు తలపడే అవకాశం ఉంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అతడితో మాట్లాడి క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం. అయితే, ఇరుదేశాల మధ్య రాజకీయ అనిశ్చితి ఉన్నంత కాలం అదేమంత సులభం కాదు"
-రమీజ్ రాజా, పీసీబీ ఛైర్మన్
2023 ఆసియా కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలకు (2025 Champions Trophy) పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో భారత క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం. హోం మంత్రిత్వ శాఖ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటాం. భద్రతా కారణాల దృష్ట్యా చాలా దేశాలు పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నాయి. మేం కూడా భద్రతను సమీక్షించిన తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తాం" అని అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. 2005-06 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు.. పాకిస్థాన్‌లో పర్యటించలేదు. అలాగే, 2012-13 నుంచి భారత్, పాక్ జట్ల మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరుగకలేదు.
చివరిసారిగా ఇరు జట్లు టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) తలపడ్డాయి. అందులో భారత్‌పై ఘన విజయం సాధించింది పాక్. ఈ క్రమంలోనే సెమీస్ చేరిన ఆ జట్టు.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి కప్పు ఆశలను జారవిడుచుకుంది.
బోర్డుల్లో చేతుల్లో లేదు!
ఇక ఇరు దేశాల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ (India vs Pakistan Series) కోసం లక్షలాది అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు (Sourav Ganguly News) బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. "భారత్- పాక్(Ind Pak Match) మధ్య ద్వైపాక్షిక క్రికెట్.. పాక్ బోర్టు లేదా బీసీసీఐ చేతిలో లేదు. ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు తలపడుతున్నా.. రెండింటి మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు కొన్నేళ్లుగా జరగటం లేదు. దీనిపై ఇరు దేశాల ప్రభుత్వాలు స్పందించి నిర్ణయం తీసుకోవాలి. ఇది నా చేతుల్లో గానీ, రమీజ్ చేతుల్లో గానీ లేదు." అని గంగూలీ అన్నాడు.
ఇదీ చూడండి: హెచ్‌సీఏలో వివాదాలు- అయినా సెమీస్‌లో హైదరాబాద్