Kohli Test Captaincy: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం.. సారథిగా తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు ఓ లేఖ రాశాడు.
"ఏడేళ్లు ఎంతో కష్టపడి జట్టును సరైన దిశలో నడిపించా. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు విరామం తీసుకోక తప్పదు. ఏడేళ్ల నా కెప్టెన్సీలో నిజాయితీగా బాధ్యతలు నిర్వహించా. బీసీసీఐ, రవిశాస్త్రి, ధోనికి నా కృతజ్ఞతలు" అని కోహ్లీ లేఖలో పేర్కొన్నాడు.
అయితే.. తొలుత టీ20 ప్రపంచకప్ అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్. కొద్ది రోజుల తర్వాత బీసీసీఐ.. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో సిరీస్ ఓడిన నేపథ్యంలో విరాట్ టెస్టు సారథిగా తప్పుకోవడం గమనార్హం.
బీసీసీఐ అభినందనలు..
విరాట్ కోహ్లీకి అభినందనలు తెలిపింది బీసీసీఐ. 'కోహ్లీ గొప్ప నాయకత్వ పటిమ చూపాడు. భారత టెస్టు జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాడు. అత్యంత విజయవంతమైన కెప్టెన్గా రాణించాడు. 68 మ్యాచ్లకు నాయకత్వం వహించి 40 విజయాలు అందించాడు' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
టెస్టు సారథిగా కోహ్లీ ఘనత..
విరాట్ సారథ్యంలో 68 టెస్టులాడిన టీమ్ఇండియా 40 విజయాలు సాధించింది. 17 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కోహ్లీ విజయ శాతం 58.82గా ఉంది.
టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. గ్రీమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48) విజయాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.