టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో చేదు అనుభవం ఎదురైంది. కోహ్లీ లేని సమయంలో అతడి హోటల్ గదిలోకి వెళ్లిన కొందరు అక్కడి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై భారత బ్యాట్స్‌మెన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇది చాలా భయానకమని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనంటూ ఇన్‌స్టా వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.
కింగ్ కోహ్లీ హోటల్ రూం అని ఆ వీడియోలో ఉంది. ఓ వ్యక్తి బ్యాటర్ గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న దుస్తులు, కోహ్లీ ఉపయోగించే ఇతర వస్తువులను రికార్డ్ చేశాడు. ఆ సమయంలో కోహ్లీ అక్కడ లేనట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో మాజీ సారథి షాక్ అయ్యాడు. దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. "అభిమానులు తమకు ఇష్టమైన ఆటగాళ్లను చూసినప్పుడు ఎంతో ఆనందపడతారని, వాళ్లను కలిసేందుకు ఉత్సాహంగా ఉంటారని నేను అర్థం చేసుకోగలను. అలాంటి అభిమానాన్ని నేను అభినందిస్తాను కూడా. కానీ, ఈ వీడియో భయానకం. నా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఈ వీడియో చూసి షాక్ అయ్యాను. నా హోటల్ గదిలోనే నాకు ప్రైవసీ లేకపోతే.. ఇంకెక్కడ నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని ఆశించగలను. ఇలాంటి మూర్ఖమైన అభిమానాన్ని నేనెప్పుడూ అంగీకరించలేను. ఇది కచ్చితంగా గోప్యతా ఉల్లంఘనే. దయచేసి ప్రతి ఒక్కరి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. ఎవరినీ వినోద వస్తువుగా చూడొద్దు" అని కోహ్లీ రాసుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా టీమ్‌ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉంది. అక్కడే కోహ్లీ హోటల్ రూంను వీడియో తీసినట్లు తెలుస్తోంది. కోహ్లీ పోస్ట్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. 'ఇది పిచ్చితనం.. ఇలాంటివి ఆమోదయోగ్యం కాదు' అని కామెంట్ చేశాడు. ఆదివారం పెర్త్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆగ్రహించిన అనుష్క శర్మ..
కోహ్లీ రూమ్ వీడియో లీక్‌పై అనుష్క శర్మ కూడా తీవ్రంగా స్పందించింది. ఇలా కోహ్లీ బెడ్రూమ్కు సంబంధించిన వీడియో లీక్ కావడం వల్ల గోప్యతకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో తను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని తెలిపింది. సెలెబ్రెటీల రూమ్ వీడియో ఇలా లీక్ చేయడం వల్ల వాళ్లకు ప్రైవసీ ఉండదు అని చెప్పింది.
"ఇది కచ్చితంగా మనుషులను ఉల్లంఘించడమే. దీన్ని చూసి 'సెలెబ్రిటీలే కదా ఇవన్నీ చూసుకోవాలి(సెలబ్రిటీ హో! తో డీల్ కర్నా పడేగా)' అని ఎవరైనా అంటే.. మీరు కూడా సమస్యలో భాగమే అని తెలుసుకోవాలి. ఇలాంటి విషయాల్లో స్వయం నియంత్రణ ఉండటం అందరికీ మంచింది. ఇలాంటిది మీ బెడ్రూమ్లో జరిగితే.. ఇక హద్దు ఎక్కడ ఉంది" అంటూ ఇన్‌స్టా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి : పాక్‌లో విరాట్ కోహ్లీ సైకత శిల్పం.. కింగ్ ఎక్కడైనా కింగే కదా!
'రక్షిస్తారనుకుంటే ఇలా చేశారేంటి?'.. టీమ్ఇండియా ఆటపై షోయబ్ అక్తర్