భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఫామ్ కోల్పోయి ఇబ్బందుల్లో పడుతున్నాడా..? బంగ్లాతో టెస్టులకు ముందు వరకు అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్‌లో మాత్రం విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 1, 19 పరుగులు మాత్రమే చేసిన విరాట్... ఇక రెండో టెస్టులోనూ విఫలమ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేయగా.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. బంగ్లా బౌలర్ మెహదీ హసన్ వేసిన ఫ్లైటెడ్ డెలివరీని ఆడే క్రమంలో మోమినల్ అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్‌లో విరాట్ బ్యాటింగ్ సగటు 50కి కిందికి పడిపోయింది.
ప్రస్తుతం 104 టెస్టుల్లో 27 శతకాలు, 28 అర్ధశతకాలతో 8,119 పరుగులను విరాట్ కోహ్లీ సాధించాడు. తన 52వ టెస్టులో యావరేజ్ 50కిపైకి చేరింది. ఇప్పుడు సరిగ్గా 104వ టెస్టు మ్యాచ్ సందర్భంగా మరోసారి 50 కంటే కిందికి పడిపోయింది. ప్రస్తుతం 48.91 సగటుతో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్డేల్లో 57.47, అంతర్జాతీయ టీ20ల్లో 52.74 సగటుతో ఉన్నాడు.
మరోసారి చెత్త రికార్డు..
ఇప్పటికే పరుగుల సగటును తగ్గించుకొన్న విరాట్ కోహ్లీ.. మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. గత పది టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధశతకం నమోదు చేయలేకపోయాడు. 2014లోనూ ఇలాగే ఇంగ్లాండ్‌తో పది ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పుడు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 39 కావడం గమనార్హం. బంగ్లాతో రెండో టెస్టులో భారత్ 100 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. 145 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా.. మూడో రోజు ఆట ముగిసేసమయానికి కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయి కేవలం 45 పరుగులను మాత్రమే చేసింది.