Umran Malik bowling 154km speed: ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. దాదాపు 150కిలోమీటర్ల వేగంతో బంతులను సంధిస్తూ బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. అయితే ఇప్పుడతడు మరో రికార్డును అధిగమించాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు బంతులను ఏకంగా 154 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ వేగంగా బంతిని వేసిన తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. గుజరాత్ టైటాన్స్ పేసర్ ఫెర్గూసన్(153 కి.మీ వేగం) పేరిట ఉన్న రికార్డును మాలిక్ బద్దలు కొట్టాడు. కాగా, ఈ ఏడాది టాప్ 5 ఫాస్టెస్ట్ డెలివరీల్లో నాలుగు ఉమ్రాన్ పేరిటే ఉండటం విశేషం. ఇక ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన ఉమ్రాన్ 7 మ్యాచుల్లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై సీఎస్కే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Ruturaj gaikwad Sachin record: సన్‌రైజర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌తో మాళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. 57 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 99 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ రికార్డును సమం చేశాడు. మాస్టర్ 31 ఇన్నింగ్స్‌లలో వెయ్యి రన్స్ మార్క్‌ను చేరుకోగా.. రుతురాజ్ కూడా 31 ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగులు చేశాడు. కాగా, గత సీజన్లో 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న అతడు ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి 237 రన్స్ మాత్రమే చేశాడు.
ఇదీ చూడండి: జడ్డూకు దాని గురించి ముందే తెలుసు.. అయినా..: ధోనీ