Rohit Sharma about his teammates : "జట్టు 90-95 శాతం కుదురుకుంది. కొన్ని మార్పులు మాత్రమే జరుగుతాయి. ఆసియా కప్‌లో మేం కొన్ని ప్రయోగాలు చేయాలనుకున్నాం. ఈ టోర్నీకి ముందు నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడాం. రెండో స్పిన్నర్ ఆల్‌రౌండర్. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉంటే.. మూడో స్పిన్నర్ ఆల్‌రౌండర్ అయితే ఎలా ఉంటుందో చూడాలనుకున్నా. మేమిప్పటికీ సమాధానాల కోసం చూస్తున్నాం" అని శ్రీలంకతో మ్యాచ్ అనంతరం రోహిత్ చెప్పాడు. మూడో సీమర్‌గా హార్దిక్ సరిపోతాడా లేదా అన్నదానిపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపాడు.
ఆసియాకప్‌లో పరాజయాలు తమకు చాలా పాఠాలు నేర్పాయని రోహిత్ అన్నాడు. ఆల్‌రౌండర్ దీపక్ హుడాను ఏడో స్థానంలో పంపడం, అసలు బౌలింగే ఇవ్వకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "మాకు ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం ఉన్న మాట నిజమే. అయిదుగురినే వాడుకుంటే ఏం జరుగుతుందో, ఏం జరగదో చూడాలనుకున్నాం. ఈ రోజు హుడా ఉన్నాడు. కానీ లంక ఓపెనర్లు బాగా నిలదొక్కుకున్నారు. ఎటాకింగ్ స్పిన్నర్లు అశ్విన్, చాహల్ ద్వారా వికెట్లు సాధించాలనుకున్నాం. అందుకే హుడాకి బంతిని ఇవ్వాలనుకోలేదు" అని చెప్పాడు.
డీకేను ఎందుకు తీసుకోలేదంటే.. : దినేశ్ కార్తీక్‌ను కాదని చోటు దక్కించుకున్న పంత్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే వ్యూహాత్మక కారణాల వల్లే కార్తీక్‌ను జట్టులోకి తీసుకోలేకపోయామని రోహిత్ తెలిపాడు. "మిడిల్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కావాలనుకున్నాం. అందుకే దినేశ్ కార్తీక్ జట్టులో లేడు. అంతే గానీ.. ఫామ్ వల్లో, ఇతర కారణాల వల్లో కాదు. ఒత్తిడిని తగ్గించడానికి మిడిల్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండాలనుకున్నాం. కానీ మేమనుకున్నది జరగలేదు. ఫామ్ కారణంగా డీకేను తప్పించలేదు" అని చెప్పాడు.
ఇదీ చదవండి: గల్ఫ్ మోసానికి చెక్.. ఒమన్‌లో చిక్కుకున్న నిరుపేద యువతిని కాపాడిన భజ్జీ