2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ను చూసే అవకాశం స్వదేశంలో క్రికెట్ అభిమానులకు లేనట్టేనా? ప్రస్తుతం ఈ ప్రశ్న క్రికెట్ అభిమానుల మనసుల్లో మెదులుతూనే ఉంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అది కష్టమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలనై ఐసీసీ షెడ్యూల్ ప్రకారం భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, పాకిస్థాన్‌లో ఆసియా కప్ టోర్నమెంట్‌లు జరగాల్సి ఉంది.
అయితే పాక్‌లో ఆసియా కప్‌ను నిర్వహిస్తే టీమ్ఇండియా అక్కడికి రాదని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పాక్‌లో కాకుండా తటస్థ వేదికలపైనే తాము ఆడతామని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇప్పటికే ప్రకటించారు. దాంతో పాక్ కూడా వన్డే ప్రపంచకప్‌లో ఆడేది లేదని ఎప్పటి నుంచో స్పష్టం చేస్తూ వస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పాక్ క్రికెట్ బోర్డు కూడా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రపంచ కప్‌లో ఆడేందుకు వీరు ఓ నయా షరతులను విధించడం గమనార్హం.
ఆసియా కప్ కోసం భారత్ తటస్థ వేదికలపైనే ఆడేందుకు ఎలా అయితే మొగ్గు చూపిందో.. పాకిస్థాన్ టీమ్ సైతం వన్డే ప్రపంచకప్‌లో తాము ఆడాల్సిన మ్యాచ్‌లను బంగ్లాదేశ్ లేదా శ్రీలంక దేశాల్లోని మైదానాల్లో నిర్వహించాలంటూ షరతులను విధించినట్లు తెలుస్తోంది. ఓ వైపు అక్టోబర్ - నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఐసీసీ ఇప్పటి వరకు పూర్తిస్థాయి షెడ్యూల్‌ను వెల్లడించలేదు. ఈ క్రమంలో కొత్త షరతులతో పాక్ క్రికెట్ బోర్డు ముందుకు రావడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. అయితే ఐసీసీ, బీసీసీఐ మాత్రం దీనికి ఒప్పుకోవడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
"అవును.. ఒకవేళ బీసీసీఐ తమ జట్టును ఆసియా కప్ కోసం పాక్‌కు పంపించకపోతే.. మేము కూడా ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వచ్చే ఛాన్స్ లేదు. మా మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికలపైనే నిర్వహించాలి. ఇదే మా షరతు కూడా " అని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆసియా కప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై తుది నిర్ణయం వెలువడితేనే ఈ ప్రపంచకప్ సమస్యకూ తెరపడే అవకాశాలు ఉన్నాయి. అయితే పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే భద్రతరీత్యా దాయాది దేశానికి వెళ్లేందుకు మాత్రం టీమ్‌ఇండియాకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యం.