Ashwin about Dhoni: టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ చెప్పే మాటలను గుర్తుచేసుకున్నాడు. అశ్విన్ కొద్దికాలం తుది జట్టులో చోటు కోల్పోయి ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. ఇటీవల ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆ విషయాలను పంచుకున్నాడు. తాను ఎదుర్కొన్న సమస్యలను పూసగుచ్చినట్లు వివరించాడు. ఈ క్రమంలోనే ధోనీ ఎప్పుడూ మన ప్రయత్నాల ఆధారంగానే ఫలితాలు ఉంటాయని చెప్పేవాడని అశ్విన్ పేర్కొన్నాడు.
"నేను 2019లో జట్టుకు దూరమయ్యాక మానసికంగా ఇబ్బందులకు గురయ్యా. నా జీవితంలో ఎప్పుడూ వైఫల్యాల గురించి భయపడలేదు. అలాగే మైదానంలోకి అడుగుపెట్టాక బంతి అందుకొని వికెట్లు తీయలేకపోయినా బాధపడను. అది నాకు పర్వాలేదు. ధోనీ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవాడు. 'మన ప్రయత్నాలను బట్టే ఫలితాలు ఉంటాయి' అనేవాడు. నా ప్రయత్నాల్లో ఎలాంటి లోపం లేదని గట్టిగా నమ్ముతా. అలాంటప్పుడు ప్రజల ముందు విఫలమైనా భయపడను. ఎందుకంటే నేను మైదానంలో దిగే అవకాశం వచ్చిందని సంతోషిస్తా. చాలా మందికి ఆ అవకాశం కూడా రాదు" అని అశ్విన్ తన ఆలోచనా విధానాన్ని వివరించాడు.
"అయితే, గాయాలకంటే మానసికంగా ఆరోగ్యకరంగా ఉండటమే చాలా కష్టమైన పని. సహజంగా నాపై నాకు నమ్మకం ఉంది. నా పరిస్థితులు ఏంటో బాగా అర్థం చేసుకోగలను. అలాగే ఏ విషయాన్ని అయినా ఎక్కువగా ఆలోచిస్తా. దీంతో అది మానసికంగా ఇబ్బందికి గురిచేసింది. ఎవరైనా గాయాల నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వస్తే.. అప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ, ఇలా మానసికంగా బాధపడి తిరిగి పుంజుకోవడం ఇంకా కష్టంగా ఉంటుంది" అని అతడు పేర్కొన్నాడు.
కాగా, అశ్విన్ తర్వాతి కాలంలో రాణించి తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో ఇటీవల టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమ్‌ఇండియా బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (417)ను అధిగమించాడు. ప్రస్తుతం (427) వికెట్లతో కొనసాగుతున్న అతడు దక్షిణాఫ్రికా పర్యటనలో కపిల్(434) రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: అతడిని ఔట్ చేసేందుకు ఆరు నెలలు రీసెర్చ్ చేశా: అశ్విన్