Rahul Dravid Head Coach : టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు క్రికెట్ హిస్టరీలో ప్రత్యేక స్థానం ఉంది. ఎన్‌సీఏ అధ్యక్షుడిగా, జూనియర్ కోచ్‌గా తనదైన ముద్ర వేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ మాజీ క్రికెటర్. అయితే ఏనాడు అతడు టీమ్‌ఇండియా కోచ్ పొజిషన్‌పై ఆసక్తిని కనబరచలేదు. బీసీసీఐ పెద్దలు ఎంతో ప్రయత్నించినప్పటికీ.. ఎందుకో అతడు ఈ పగ్గాలు చెప్పటడంలో సుముఖత చూపించలేదు. కానీ ద్రవిడ్ ఒకప్పటి కో పార్ట్నర్ గంగూలీ.. రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా ఉండేలా ద్రవిడ్‌ను ఒప్పించగలిగాడు.
అయితే కోచ్‌గా ద్రవిడ్ జర్నీ అంతా ఈజీగా సాగలేదు. 2021 నవంబరులో బాధ్యతలు స్వీకరించిన ఈ స్టార్ క్రికెటర్.. ప్రారంభంలోనే ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాడు. కోహ్లి కెప్టెన్సీపై జరిగిన వివాదాలు జట్టులో ఎంత అలజడి రేపాయో చెప్పనక్కర్లేదు. ఆ ఆటుపోట్లను సరిచేసి జట్టును ఆటపై ఫోకస్ చేసేలా చేశాడు ద్రవిడ్. ఇలా కోచ్‌గా తన మొదటి విజయాన్ని సాధించాడు. అయితే ద్రవిడ్‌కు మొదట్లో మంచి మార్కులేమీ పడలేదు. పెద్ద టోర్నీల్లో జట్టు ప్రదర్శనే అందుకు కారణం. 2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్పుల్లో టీమ్‌ఇండియా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లోనూ జట్టు ఓడిపోవడం వల్ల ద్రవిడ్‌పై విమర్శలు వచ్చాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, మౌనంగానే ప్రపంచకప్‌కు జట్టును ప్లాన్ ప్రకారం రెడీ చేశాడు. తగిన కూర్పు కోసం ఏడాది ముందు నుంచే సన్నదతను మొదలెట్టాడు.
అందులో భాగంగా అతడు చేసిన మొదటి పని.. ప్రపంచకప్‌లో ఆడగల సత్త ఉన్న ప్లేయర్లను గుర్తించి వారిపైనే దృష్టిసారించాడు. అంతే కాకుండా వారికి తగినన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలను కల్పించాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్‌తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్.. సుమారు 24 మంది ఆటగాళ్లతో ఓ పూల్‌ను రెడీ చేశాడు.
ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు టీమ్ఇండియా తరఫున ఆడిన ప్లేయర్లందరూ ఈ పూల్‌కు చెందిన వాళ్లే. ఇది దాటి మరొకరు కనిపించరు. ఇక ఇందులో నుంచే వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేశారు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్, ఫామ్‌పై ఎన్ని అనుమానాలు, విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. ప్రపంచకప్ జట్టుకు వారి ఎంపికపై వ్యతిరేకత వచ్చినా కూడా ద్రవిడ్ తగ్గలేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లను సపోర్ట్ చేశాడు. వాళ్లకు వెన్నుదన్నుగా నిలిచాడు. తీవ్ర వెన్ను గాయం వల్ల ఇబ్బంది పడ్డ జస్ప్రీత్ బుమ్రాను సైతం తొందరపాటు లేకుండానే మెగా టోర్నీకి సిద్ధం చేశాడు.
ఇక ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుస విజయాల్లోనూ ద్రవిడ్ కీలక పాత్ర ఉంది. ఒక్కో ఆటగాడికి ఒక్కో ప్రత్యేక బాధ్యతను అప్పగించడం ఎంత గొప్ప ఫలితాన్నిచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్లాన్‌ను అమలు చేసే విషయంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. ద్రవిడ్ తన ప్రపంచకప్ ప్రణాళిక నుంచి పక్కకు జరగలేదు. జట్టులో విపరీతంగా మార్పులు కూడా చేయలేదు. అన్నింటికన్నా మిన్నగా తన ఫ్రెండ్లీ స్పిరిట్‌తో ప్లేయర్ల విశ్వాసాన్ని, అభిమానాన్ని, గౌరవాన్ని పొందాడు. ఇదే జట్టు సక్సెస్‌కు మూల కారణం.
Rahul Dravid World Cup 2023 : 'మేం చేయగలిగింది అంతవరకే.. కోచ్‌లు గ్రౌండ్లోకి దిగలేరు కదా!'
రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ పొడగింపు - బీసీసీఐ అఫీషియల్ అనౌన్స్మెంట్