విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా.. టీమ్ఇండియా టెస్టు జట్టులో అనుభవజ్ఞులు, అత్యుత్తమ ఆటగాళ్లు. వీరు జట్టులో ఉంటే మనకు ఢోకా లేదనుకునే అభిమానులు కోకొల్లలు. కానీ ఈ మధ్య సుదీర్ఘ ఫార్మాట్లో దారుణంగా విఫలమవుతున్నారు వీరు ముగ్గురు. చాలా కాలంగా ఒక్క సెంచరీ కూడా బాదలేక ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టెస్టుల్లో వీరి స్ట్రైక్ రేట్ ఎంత దిగజారిపోయిందో చూద్దాం.
విరాట్ కోహ్లీ
![Kohli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/d48a0f09b848f59e5a49dfbbde07f2eb_2311a_1637663649_153.jpg)
Virat Kohli Test Strike Rate: టీమ్ఇండియాకు కెప్టెన్‌గా విదేశాల్లో అత్యద్భుత, చరిత్రలో నిలిచిపోయే విజయాల్ని అందించాడు విరాట్ కోహ్లీ. రన్ మెషీన్‌గా కీర్తి గడించాడు. కానీ ఈ మధ్య ఆ పరుగుల యంత్రం మొండికేసింది. రెండేళ్లుగా ఇతడి నుంచి ఒక్క సెంచరీ కూడా లేదంటే నమ్మగలమా? కానీ ఇదే నిజం. ఈ ఏడాది టెస్టుల్లో 12 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 4 హాఫ్ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం ఇతడి స్ట్రైక్ రేట్ 29.80గా ఉంది.
పుజారా
![Pujara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4d9cb91de42968d400348b7fa7dd5641_2511a_1637819799_846.jpg)
Cheteshwar Pujara Test Strike Rate: నయా వాల్.. డిఫెన్స్ కింగ్.. క్రీజులో కుదురుకుంటే ఇతడిని ఔట్ చేయడం ప్రత్యర్థి బౌలర్ల తరం కాదు.. ఇన్ని రోజులు పుజారా పేరు చెబితే మనకు ఎదురయ్యే సమాధానాలు. కానీ కొంత కాలంగా దారుణమైన ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశకు గురిచేస్తున్నాడు పుజారా. ప్రపంచ ఛాంపియన్ షిప్లో దాదాపు 39 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్ల్లో 22 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 6 హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించాడు. ప్రస్తుతం ఇతడి స్ట్రైక్ రేట్ 30.42గా ఉంది.
అజింక్యా రహానే
![Rahane](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/f5ac5cb8ebf54a6ada2cbf8d6421b031_2210a_1634896510_944.jpg)
Ajinkya Rahane Test Strike Rate: ఇతడు జట్టులో ఉంటే కొండంత భరోసా.. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటంలో దిట్ట.. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా అలవోకగా పరుగులు రాబట్టగల సామర్థ్యం ఇతడి సొంతం.. అతడే అజింక్యా రహానే. కోహ్లీ తర్వాత భారత టెస్టు జట్టుకు చాలాకాలంగా పెద్దన్నగా అండగా నిలిచాడు. కానీ ఈ మధ్య కాలంలో రహానే నుంచి చెప్పుకోదగిన ఒక్క మంచి ఇన్నింగ్స్ రాకపోవడం గమనార్హం. ఈ ఏడాది 21 ఇన్నింగ్స్‌ల్లో కేవలం రెండంటే రెండే అర్ధశతకాలు నమోదు చేశాడు. ప్రస్తుతం ఇతడి సగటు 19.57గా ఉంది.
గత టెస్టు ఛాంపియన్ షిప్లో ఫైనల్ వరకు వెళ్లిన భారత్ ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని భావిస్తోంది. కానీ అది జరగాలంటే ఈ బ్యాటింగ్ త్రయం రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే యువ ఆటగాళ్లు అద్భుత ప్రతిభతో జట్టులోకి వచ్చేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో అద్భుత సెంచరీతో కదం తొక్కిన శ్రేయస్ అయ్యర్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఇప్పటికైనా రాణించకపోతే పుజారా, రహానే స్థానాలు గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది.