T20 World Cup : ఐసీసీ మొగా టోర్నీ ప్రారంభమైంది. మొదటి రోజు గ్రూప్ దశలో శ్రీలంక, నమీబియా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసి.. 55 పరుగుల తేడాతో లంకపై గెలిచింది నమీబియా.
మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన నమీబియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్ల ధాటికి.. లంక బౌలర్లు చేతులెత్తేసి భారీ పరుగులు సమర్పించుకున్నారు. నమీబియా ఆటగాడు జాన్ ఫ్రిలింక్ (44) మెరిశాడు. ఇన్నింగ్స్ ఆఖరి వరకు ఆడి రనౌట్ అయ్యాడు. ఈటన్(20), బార్డ్(26), ఎరాస్మస్(20), స్మిత్(31) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్ ప్రమోద్ మదుషన్ రెండు వికెట్లు తీశాడు. తీక్షణ, చమీర, కరుణరత్నే, హసరంగ ఒక్కో వికెట్ తీశారు.
164 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక.. ఆది నుంచే అష్టకష్టాలు పడింది. శ్రీలంక బ్యాటర్లకు.. నమీబియా బౌలర్లు చుక్కలు చూపించారు. కేవలం 6 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. ఆ తర్వాత గాడిలో పడలేదు. శనక (29) కొంచెం రాణించినా ఫలితం లేకపోయింది. రాజపక్స(20), ధనంజయ(12), తీక్షణ(11) ఫర్వాలేదనింపించారు. దీంతో 16 ఓవర్లకు 108 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది శ్రీలంక.
ఇవీ చదవండి : T20 World Cup: పొట్టి కప్పు సమరం షురూ.. మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?