Jasprit Bumrah Injury Update : టీమ్ఇండియా స్పీడ్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. వెన్ను గాయం కారణంగా చాలా కాలంగా క్రికెట్‌కు దూరమయ్యారు. ఈ ఏడాది న్యూజిలాండ్ వెళ్లిన అతడు.. అక్కడే సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కోలుకుంటున్నాడు. ఇప్పటికే బుమ్రా చాలా వరకు కోలుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో అతడు మళ్లీ టీమ్ఇండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jasprit Bumrah Surgery New Zealand : ఈ క్రమంలోనే తాను త్వరలోనే టీమ్ఇండియా తరఫున పునరాగమనం చేస్తానని బుమ్రా తాజాగా హింట్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాలో ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు బుమ్రా. ఆ వీడియోలో తన ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలు ఉన్నాయి. 'కమింగ్ హోం' అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు ఈ టీమ్ఇండియా పేసర్. గతేడాది సెప్టెంబరు నుంచి బుమ్రా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో అతడిని ఆడించగా.. రెండో మ్యాచ్‌లోనే గాయం తిరగబెట్టడం వల్ల విలవిల్లాడాడు.
అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్.. ఏదీ ఆడలేదు. అయితే ఈ ఏడాది చివర్లో జరిగే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌నకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బుమ్రా లేకపోవడం వల్ల భారత జట్టులో సరైన పేసర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం బుమ్రా చాలా వరకు కోలుకున్నాడని.. ప్రాక్టీస్ సెషన్స్‌లో 8-10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడని సమాచారం.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టులో జరిగే ఐర్లాండ్ టూర్‌లో బుమ్రా మళ్లీ భారత జట్టుతో కలిసే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత బృందం మూడు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ వెళ్లనుంది. ఐర్లాండ్ టూర్నకు బుమ్రాను కూడా పంపాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. బుమ్రా లేకపోవడం వల్ల భారత బౌలింగ్‌లో ముఖ్యంగా డెత్ ఓవర్లలో పదును కనిపించడం లేదు. బుమ్రా తిరిగొస్తే భారత జట్టు పూర్తి బలంతో వన్డే వరల్డ్ కప్ బరిలో దిగుతుంది.