ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యుత్తమ కెప్టెన్ అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. 'అతడిలాంటి కెప్టెన్ లేడు. భవిష్యత్తులో అలాంటి వాడు ఎప్పటికీ ఉండడు' అని గవాస్కర్ చెప్పాడు. కఠిన పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కాలో సీఎస్కేకు బాగా తెలుసు అని.. అది ధోనీ సారథ్యంలోనే సాధ్యం అవుతుందని ప్రశంసల జల్లు కురిపించాడు.
'200 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాలంటే చాలా కష్టం. కెప్టెన్సీ అనేది బ్యాటర్‌కు అదనపు భారంగా ఉంటుంది. అప్పుడప్పుడు అది బ్యాటర్ ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. కానీ, ధోనీ ఇందుకు భిన్నం. మహీ కెప్టెన్సీ తీరు.. ఇతర జట్ల కెప్టెన్ల కన్నా వైవిధ్యంగా ఉంటుంది. అతడి వ్యూహాలు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు అంతుచిక్కవు" అని గవాస్కర్ ఒక ప్రకటనలో తెలిపాడు.
ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి (2016,17 రెండు సీజన్లలో మినహా) ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుఫున ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిందంటూ జట్టు రెండేళ్లపాటు సస్పెండ్‌కు గురయ్యింది. 2016లో రైజింగ్ పుణే సూపర్‌జయింట్స్ జట్టుకూ ధోనీనే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఆ సీజన్లో ధోనీ 14 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా కెప్టెన్‌గా 214 మ్యాచ్‌లు ఆడాడు ధోనీ. 2017లో జట్టు యాజమాన్యం ధోనీని కెప్టెన్‌గా తప్పించి, ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే, ధోనీ సారథ్యంలోని సీఎస్కే నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలవడం విశేషం. మహీ కెప్టెన్సీలో చెన్నై ఇప్పటివరకూ 120 విజయాలు నమోదు చేసింది. 79 మ్యాచ్‌లలో ఓడగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
మరోవైపు, కోహ్లీని కూడా పొగడ్తలతో ముంచెత్తాడు గవాస్కర్. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ.. వింటేజ్ విరాట్‌ను గుర్తుకు తెచ్చేలా ఆడుతున్నాడని అన్నాడు. 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ప్రదర్శనతో టోర్నీని ఆరంభించింది. ఇప్పటికే రెండుసార్లు విరాట్ కోహ్లీ ఆర్సీబీకి శుభారంభాలను ఇచ్చాడు. జట్టు విజయాల్లో అతడి పాత్ర కీలకం కానుందని, విరాట్ ఫామ్‌లోకి రావడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ధోనీ 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు తెచ్చిపెట్టాడు. 2019 ప్రపంచ కప్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నాడు.