IPL playoffs 2022: ఐపీఎల్ ప్లేఆఫ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. టోర్నీ తొలి ప్లేఆఫ్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను వరుసగా మే 24, 25వ తేదీల్లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అలాగే రెండో ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లు 27, 29వ తేదీల్లో అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరుగుతాయని తెలిపింది. మరోవైపు మహిళల టీ20 టోర్నీని మే 23 నుంచి 28 వరకు పుణె వేదికగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలుత ప్రకటించిన తేదీల ప్రకారం.. మహిళ టోర్నీని లఖ్‌నవూ వేదికగా జరగాల్సి ఉండగా పుణెకు, ఫురుషుల ఎలిమినేటర్ మ్యాచ్‌ను 26 నుంచి 25 తేదీకి మార్పు చేస్తూ బీసీసీఐ తాజా షెడ్యూల్ విడుదల చేసింది.
మరోవైపు, ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు పూర్తిస్థాయిలో అభిమానులను అనుమతించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. రెండేళ్ల తర్వాత వంద శాతం సామర్థ్యంతో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లు ఇవే కానున్నాయి. కాగా, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో ప్లేఆఫ్స్ ఉంటాయని ఇదివరకే వార్తలు వచ్చాయి. తాజాగా అధికారికంగా వెల్లడించారు జైషా.
ఫిబ్రవరిలో విండీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు కోల్‌కతా, అహ్మదాబాద్ ప్రాతినిధ్యం వహించాయి. కోల్‌కతాలో 75 శాతం సామర్థ్యంతో అభిమానులను అనుమతించగా.. అహ్మదాబాద్‌లో ఖాళీ స్టేడియాలతోనే మ్యాచ్‌లు నిర్వహించారు. మరోవైపు, మహిళ టీ20 ఛాలెంజ్ టోర్నీని ఈ ఏడాది నిర్వహించనున్నట్లు జైషా స్పష్టం చేశారు. అన్ని మ్యాచ్‌లు పుణెలోనే ఉంటాయని తెలిపారు. మే 23, 24, 26 తేదీల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తామని వివరించారు. ఫైనల్ మార్చి 28న ఉంటుందని వెల్లడించారు.
కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను ఒకే రాష్ట్రానికి పరిమితం చేసింది బీసీసీఐ. ఆటగాళ్లు పదేపదే ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా మహారాష్ట్రలోని నాలుగు అంతర్జాతీయ స్టేడియాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ముంబయిలోని వాంఖడే, బ్రబౌర్న్ స్టేడియాలతో పాటు.. నవీ ముంబయిలోని డీవై పాటిల్, పుణెలోని ఎంసీఏ స్టేడియాలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక ప్లేఆఫ్స్‌కు వెళ్లిన జట్లు కోల్‌కతా, అహ్మదాబాద్‌లకు ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: DRS For Wides: 'వైడ్ల నిర్ణయంపైనా డీఆర్‌ఎస్‌కు అవకాశం!'