ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా జరుగుతున్న మూడో మ్యాచ్ జరుగుతోంది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విండీస్ హార్డ్ హిట్టర్ కైల్ మేయర్స్ అదరగొట్టేశాడు. తన డెబ్యూ ఐపీఎల్‌లోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 38 బంతుల్లో రెండు ఫోర్లు, ఏడు సిక్స్‌లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే ఓ సూపర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. అలా తమ తొలి మ్యాచ్‌లోనే ఎక్కువ స్కోరు చేసిన ప్లేయర్స్ లిస్ట్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు.
అంతకుముందు 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్(కేకేఆర్) 158 అజేయ పరుగులు చేశాడు. అలా డెబ్యూ మ్యాచ్‌లోనే అత్యధిక స్కోరు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అనంతరం 2008లో చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయిన మైక్ హస్సీ రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత అదే సీజన్లో 2008లో పంజాబ్ కింగ్స్-డెక్కన్ చార్జర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో షాన్ మార్ష్ 84* పరుగులతో రాణించాడు. అలా ఈ ముగ్గురు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. తాజాగా కైల్ మేయర్స్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 73 పరుగులు చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. క్రీజులో ఉన్నంత సేపు చెలరేగిపోయిన ఓపెనర్ కైల్ మేయర్స్.. సెంచరీ బాదుతాడని ఆశిస్తే.. అతడిని అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. దీంతో దిల్లీ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకోగా.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ఇక మేయర్స్ ఔట్ అవ్వగానే స్కోరు బోర్డు నెమ్మదించింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చినవారు విఫలమయ్యారు. ఒక్క నికోలస్ పూరన్(36; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రం కాసేపు క్రీజులో నిలబడగలిగాడు. చివర్లో ఆయుష్ బదోని(18; 7 బంతుల్లో 2x6, 1x4) పరుగులు చేశాడు. దీంతో జట్టు స్కోరు 193 పరుగుల వద్ద ముగిసింది. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అక్సర్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: కోల్‌కతాకు వరుణుడి షాక్.. D/L పద్ధతిలో పంజాబ్ విజయం