Jasprit Bumrah: విభిన్నమైన బౌలింగ్ శైలి.. వికెట్లు కూల్చే యార్కర్లు.. బుట్టలో పడేసే స్లో డెలివరీలు.. హడలెత్తించే షార్ట్‌పిచ్ బంతులు.. ఇలా వైవిధ్యమైన బౌలింగ్‌కు మారుపేరైన బుమ్రాకు ఇప్పుడేమైంది? అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి.. ప్రపంచ ఉత్తమ బ్యాటర్లకు వణుకు పుట్టించి.. భారత జట్టులో కీలకంగా ఎదిగిన అతని మాయ ఇప్పుడెందుకు కనిపించడం లేదు?.. ఇవీ ఈ సీజన్‌లో అతని ప్రదర్శనపై రేకెత్తుతున్న ప్రశ్నలు. ముంబయి బౌలింగ్ అంటే ముందుగా బుమ్రానే గుర్తుకు వస్తాడు. జట్టుకు ఎన్నో విజయాలు అందించి.. టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించిన అతను.. ఇప్పుడు పరాజయాల బాటలో సాగుతున్న జట్టుకు తొలి గెలుపు అందించే ప్రదర్శన చేయలేకపోతున్నాడు. పరుగులు కట్టడి చేస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నాడు. బ్యాటర్లను పెవిలియన్ చేరిస్తేనే ప్రత్యర్థి జట్టు మీద ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఇప్పుడా బాధ్యతను నిర్వర్తించడంలో అతను విఫలమవుతున్నాడు.
ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌ల్లో బుమ్రా తీసిన వికెట్లు నాలుగు మాత్రమే. రాజస్థాన్ రాయల్స్‌పై ఉత్తమ ప్రదర్శన (3/17)తో ఆకట్టుకున్న అతను.. ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. మెగా వేలం కారణంగా జట్టు మారింది. గత సీజన్లలో బుమ్రాతో పాటు జట్టులో ఉన్న బౌల్ట్ లాంటి ఉత్తమ పేసర్లు దూరమయ్యారు. ఈ సారి పూర్తి భారం బుమ్రా మీదే పడుతోంది. మిగతా బౌలర్లూ విఫలమవుతుండడం వల్ల అతనిపై ఒత్తిడి ఇంకా పెరుగుతోంది. దీంతో తన ప్రదర్శన పడిపోతోంది.
ఓ సీనియర్ పేసర్‌గా వికెట్ల వేటలో సాగుతూ.. సహచర బౌలర్లలో స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత బుమ్రాపై ఉంది. అలాంటిది అతనే నిరాశపరుస్తుంటే ఇక బౌలింగ్ ఎలా గాడిన పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జట్టు మరీ ఎక్కువ తేడాతో ఓడడం లేదు. బౌలర్లు పుంజుకుని ప్రత్యర్థికి కళ్లెం వేస్తే జట్టు బోణీ కొట్టడం కష్టమేమీ కాదు. అందుకు బుమ్రానే తన బౌలింగ్‌లో మునుపటి పదును చూపించి బౌలింగ్ దళాన్ని నడిపించాల్సి ఉంది.
ఇదీ చూడండి: ముంబయి వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే: రోహిత్ శర్మ