IPL 2022 Dhoni Bites Bat: దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఫినిషర్‌గా సీఎస్కే కెప్టెన్ ధోనీ మరోసారి రాణించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన మహీ 8 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ధోనీ క్రీజులోకి రావడానికి ముందుకు తన బ్యాట్‌ను కొరకుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గతంలోనూ పలు సందర్భాల్లో అతడు బ్యాట్‌ను కొరుకుతూ కనిపించాడు. అసలు అతడు అలా చేయడం వెనుక ఉన్న కారణాన్ని తెలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా.
"ధోనీ బ్యాట్ కొరకడంపై మీకు సందేహాలు ఉన్నాయా.. అయితే వినండి. మహీ తన బ్యాట్‌పై ఏదైనా టేప్ లేదా థ్రెడ్ అంటే దానిని తొలగించేందుకు నోటితో కొరుకుతుంటాడు. ప్రతిసారి బ్యాటింగ్‌కు వెళ్లేముందు ఇలా చేస్తాడు. అందుకే మీరెప్పుడైనా ధోనీ బ్యాట్‌ను గమనించండి.. ఎలాంటి టేప్, థ్రెడ్ కనిపించవు" అంటూ ట్వీట్ చేశాడు.
CSK Playoffs: ఇక మ్యాచ్‌లో సీఎస్కే గెలిచినప్పటికీ ప్లే ఆప్ అవకాశాలు దాదాపు లేనట్లే. 11 మ్యాచుల్లో నాలుగు మాత్రమే గెలిచిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచి ఇంకా టెక్నికల్‌గా ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. అయితే, అదంత తేలిక కాదు. చెన్నై టాప్-4లో నిలవాలంటే మిగతా జట్లు భారీ ఓటములు చవిచూడటంతో పాటు చెన్నై ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లోనూ గొప్ప విజయాలు నమోదు చేయాలి. ఈ నేపథ్యంలో దీని గురించి కుడా మాట్లాడాడు ధోనీ. చెన్నై జట్టు ఇప్పుడు ప్లేఆఫ్స్ గురించి ఆలోచించట్లేదని, నెట్ రన్‌రేట్ విషయంపైనా ఆలోచించడం అనవసరమని చెప్పాడు.
"ఇలాంటి విజయాలు ముందే వచ్చి ఉంటే బాగుండేది. ఇదో గొప్ప మ్యాచ్. మా బ్యాటర్లు బాగా ఆడారు. మిగతావారు ఏదో ఒక విధంగా రాణించారు. మ్యాచ్ గెలవాలంటే స్కోర్‌బోర్డుపై భారీ లక్ష్యం నిర్దేశించడం ముఖ్యమైన విషయం. అలాగే దిల్లీ జట్టులోని బిగ్ హిట్టర్లను నియంత్రించడం కూడా ఎంతో ముఖ్యం. ముఖేశ్, సిమర్జీత్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్‌లు ఆడేకొద్దీ మరింత మెరుగవుతారు. ఇక నా బ్యాటింగ్ విషయానికొస్తే క్రీజులోకి వెళ్లిన వెంటనే ఎడాపెడా బాదాలనుకోను. కానీ, ఈరోజు తక్కువ బంతులే మిగిలి ఉండటంతో ధాటిగా ఆడాల్సి వచ్చింది. అలాగే మేం ప్లేఆఫ్స్ చేరతామా లేదా అనే లెక్కలు వేసుకోవడం లేదు. నాకు లెక్కలంటే ఇష్టం ఉండదు. చిన్నప్పుడు స్కూల్లోనూ మాథ్స్ లో వెనుకబడిపోయాను. ఇప్పుడు నెట్ రన్‌రేట్ గురించి ఆలోచిస్తే ఉపయోగం లేదు. ఈ టీ20 లీగ్‌ను ఎంజాయ్ చేయాలంతే. తర్వాతి గేమ్‌లో ఎలా ఆడాలనేదాని గురించే ఆలోచించాలి. ఒకవేళ మేం ప్లేఆఫ్స్ చేరితే మంచిదే. వెళ్లకపోయినా పోయేదేం లేదు. దీంతో ప్రపంచం అంతరించిపోదు" అని ధోనీ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: ధోనీ సూపర్ రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ..