భారత జట్టుకు విజయాలను అందించడంలో కెప్టెన్ విరాట్ కోహ్లి సఫలమవుతున్నాడు. కానీ ఐపీఎల్లో అతడు సారథ్యం వహిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం ఓటములతో ఇబ్బంది పడుతోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడుస్తుంది. "కోహ్లి మంచి కెప్టెనా.. లేక మంచి జట్టుకు కెప్టెనా" అంటూ విమర్శలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
కోహ్లి సారథ్యంలో మూడేళ్లుగా టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వన్డేలు, టీ20ల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది.
ఐపీఎల్‌కు వచ్చేసరికి కోహ్లి కెప్టెన్‌గా ఉన్న బెంగళూరు ఓటమి మీద ఓటమితో అభిమానులను అసహనాన్ని కలిగిస్తోంది.
ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. కోహ్లి మంచి కెప్టెనా.. లేక మంచి జట్టుకు కెప్టెనా..! అని. భారత జట్టుకు వరుస విజయాలనందిస్తూ... శతకాలతో చెలరేగుతూ మంచి పేరు సంపాదించాడు విరాట్. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో జాతీయ జట్టును విజయపథాన నడిపిస్తున్నాడు. మరి ఐపీఎల్‌కు వచ్చేసరికి కోహ్లికి ఏమవుతుందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
టీమిండియాలో రోహిత్ శర్మ, ధోని, పుజారా, బుమ్రా లాంటి మేటి ఆటగాళ్లు ఉన్నారని, అందుకే కోహ్లి సారథ్యంలో జట్టుకు విజయాలు దక్కుతున్నాయనేది కొందరి వాదన. అయితే ఐపీఎల్లో కోహ్లి సారథ్యంలోని బెంగళూరు జట్టులో కూడా డివిలియర్స్, పార్థివ్ పటేల్, చాహల్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. అయినా ఓటములు తప్పడం లేదు.
ఎంత గొప్ప ఆటగాడైనా ఒత్తిడి సమయంలో జట్టును నడిపించే విధానంలోనే గెలుపు దాగి ఉంటుందని క్రికెట్ పండితులు అంటున్నారు. కోహ్లికి, ధోనికి ఉన్న తేడా అదే అంటున్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా జట్టును కూల్‌గా నడిపించగలడు ధోని. అందుకే మహీ సారథ్యంలోని జట్టు విజయాల బాట పడుతోందని చెబుతున్నారు.
గడ్డు పరిస్థితులను కోహ్లి సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాడని కొందరు విశ్లేషిస్తున్నారు. 2015 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌నే కొందరు ఉదాహరణగా చూపుతున్నారు. ఛేదనలో గొప్ప ఆటగాడని పేరుతెచ్చుకున్న విరాట్ ఆ మ్యాచ్‌లో 329 పరుగుల లక్ష్యం ముందుండగా కేవలం ఒక పరుగు చేసి వెనుదిరిగాడు. అప్పుడు కూడా కోహ్లిపై విమర్శలు వచ్చాయి.
ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో కోహ్లి ఈ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బెంగళూరు జట్టును విజయపథాన నడిపి తన సత్తా నిరూపించుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
ఇవీ చూడండి..అభిమానానికి వయసుతో పనేంటి!