India Vs West Indies ODI : వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను రోహిత్ సేన మట్టికరిపించింది. విండీస్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్(19), రవీంద్ర జడేజా(16) రోహిత్ శర్మ(12)తో ఈ మ్యాచ్‌లో రాణించాడు. ఇక ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. ఇక టీమ్ఇండియా బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ (4/6), జడేజా (3/37) ప్రత్యర్థులకు చుక్కలు చూపించగా.. విండీస్ ప్లేయర్లలో షై హోప్(43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Ind Vs WI ODI : ఛేదన చిన్నదే కావడం వల్ల ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ దిగకుండా వేరే ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు. భారత్ విజయం ఎన్ని ఓవర్లలో అన్నదే ఛేదనలో ఉన్న ఆసక్తి. అయితే ఏ దశలోనూ గెలుపుపై సందేహం లేకపోయినప్పటికీ.. భారత్ అయిదు వికెట్లు చేజార్చుకోవడం మాత్రం అనూహ్యమే. ఇక విండీస్ స్పిన్నర్ గుదాకేశ్ మోతీ చక్కగా బౌలింగ్ చేశాడు. ఇషాన్ కిషన్ రాణించడం వల్ల భారత్ విజయం సాధించింది.
మరోవైపు ఈ మ్యాచ్‌లో ఇషాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన శుభ్‌మన్ గిల్ (7) క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అంతగా ఫామ్‌లో లేని గిల్ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో నెట్టుకురాగా.. చివరికి నాలుగో ఓవర్లో సీల్స్ బౌలింగ్‌లో ఎడ్జ్‌తో కింగ్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత దిగిన సూర్య కుమార్ (19) బౌండరీతో ఖాతా తెరవగా.. తొలి 16 బంతుల్లో 9 పరుగులే చేసిన ఇషాన్.. క్రమంగా వేగాన్ని పుంజుకున్నాడు. డ్రేక్స్ ఓవర్లో రెండు ఫోర్లతో అలరించాడు. అయితే సీల్స్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన సూర్య.. 11 ఓవర్లో మోతీ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. అప్పుడు జట్టు స్కోరు 54.
కానీ కాసేపటికే హార్దిక్ (5) అనూహ్యంగా రనౌటైనా కూడా.. జడేజాతో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కానీ జట్టు స్కోరు 94 వద్ద వద్ద మోతీ బౌలింగ్‌లో అతడు భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే శార్దూల్ (1)ను కరియా వెనక్కి పంపడం వల్ల భారత్ 97/5తో నిలిచింది. అయినా లక్ష్యం తక్కువే కావడం వల్ల భారత్‌కు ఈ మ్యాచ్‌లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. చివరిలో క్రీజులోకి వచ్చిన రోహిత్ (12 నాటౌట్).. ఎలాంటి తడబాటుకు అవకాశం ఇవ్వకుండా జడేజా (16 నాటౌట్)తో కలిసి పని పూర్తి చేశాడు.