ICC world cup 2023 : ఈ సారి ఎలాగైనా వరల్డ్ టైటిల్ సాధించి 13 ఏళ్ల కప్పు దాహాన్ని తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది టీమ్ఇండియా. భారీ అంచనాల మధ్య వన్డే ప్రపంచకప్ బరిలో దిగుతోంది. 1983లో తొలి వరల్డ్ కప్‌ను ముద్దాడిన కపిల్ డెవిల్స్, 2011లో రెండో మెగా టోర్నీ టైటిల్ సాధించిన ధోనీసేన తరహాలోనే రోహిత్ టీమ్ కూడా అద్భుత ఆటతీరు ప్రదర్శించి కప్పు కొట్టేస్తుందని అభిమానులు బోలెడు ఆశలతో ఉన్నారు. అయితే కూర్పు పరంగా.. ప్లేయర్ల సామర్థ్యాల పరంగా చూడ్డానికి మన జట్టు బలంగానే కనిపిస్తోంది. అతేకాకుండా ఇటీవలి ఫామ్ కూడా మెరుగుపడింది. అయితే వరల్డ్ కప్ సాధించే క్రమంలో మిగతా జట్లను తట్టుకుని నిలవడం అంత తేలికైన విషయమేమీ కాదు. భారత్ కప్ కొట్టాలంటే కొన్ని జట్లను దాటాల్సిందే. ఇప్పుడు భారత్.. వరల్డ్ కప్ మధ్య అడ్డంకులుగా ఉన్న కొన్న పెద్ద జట్లు ఇవే.
ఆల్‌రౌండ్ బలంతో..
వరల్డ్ కప్ వస్తుంటే న్యూజిలాండ్ మీద మరీ అంచనాలేమీ ఉండవు. అందుకు తగ్గట్టు ఆ టీమ్ కూడా అంతగా హడావుడి చేయదు. కానీ టోర్నీలో నిలకడగా ఆడి ముందంజ వేస్తుంది. టైటిల్ ఫేవరెట్ జట్లకు చెక్ పెడుతుంటుంది. ఎలాగైనా తొలి వరల్డ్ కప్ ముద్దాడాలని గత కొన్నేళ్లుగా గట్టిగా ప్రయత్నిస్తోంది. గత రెండు టోర్నీల్లోనూ కివీస్ రన్నరప్‌గా నిలవడమే దానికి నిదర్శనం. చివరిలో వరల్డ్ కప్‌నకు అత్యంత చేరువగా వచ్చిన ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. మ్యాచ్ టై అయింది. సూపర్‌ఓవర్లోనూ స్కోర్లు సమమైన క్రమంలో మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
ఈసారి బలమైన జట్టుతో బరిలోకి దిగుతున్న న్యూజిలాండ్.. అన్ని అడ్డంకులనూ దాటి వరల్డ్‌కప్ 2023 టైటిల్ గెలవాలనుకుంటోంది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ విలియమ్సన్ అందుబాటులోకి రావడం ద్వారా ఆ జట్టుకు ఉపశమనం లభించినట్టైంది. ఇక డరైల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర.. వంటి మరే జట్టుకూ లేనంతమంది ఆల్‌రౌండర్లు కివీస్ టీమ్‌లో ఉన్నారు. కాన్వే, యంగ్, లేథమ్, నికోల్స్ వంటి నాణ్యమైన స్పెషలిస్టు బ్యాటర్లు కూడా ఉన్నారు. బౌల్ట్, సౌథీ, జేమీసన్‌లతో మంచి పేస్ దళం ఉంది. ఇక సోధి, రచిన్‌లతో భారత పిచ్‌లకు తగ్గ స్పిన్ బలం కూడా ఉంది. అయితే ఈ ఆల్‌రౌండ్ జట్టును దాటి వరల్డ్ కప్ విజేతగా నిలవాలంటే భారత్ కష్టపడాల్సిందే.
కప్పు అంటే చాలు..
వరల్డ్ కప్ అంటే చాలు ఆస్ట్రేలియా జట్టు ఎక్కడ లేని సత్తువ కూడగట్టుకుంటుంది. వరల్డ్ కప్ ముంగిట చివరగా భారత్‌తో ఆడిన సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓటమి చవిచూసింది. అంతమాత్రాన కంగారూలను తక్కువగా అంచనా వేయలేం. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఎలా ఆడాలో కంగారూ టీమ్‌కు తెలిసినట్లు మరే జట్టుకూ తెలియదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పటివరకు ఆ జట్టు అయిదు సార్లు వరల్డ్‌కప్‌ను గెలిచింది. తరాలు మారినా.. ఆటగాళ్లు మారినా ఆసీస్ మాత్రం ప్రపంచకప్‌లో ఎప్పుడూ ఫేవరెట్ జట్టే. సారథి కమిన్స్‌తో పాటు స్మిత్, స్టార్క్, మ్యాక్స్‌వెల్ వంటి కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలను అధిగమించి వరల్డ్ కప్‌నకు అందుబాటులోకి రావడం ఆ జట్టుకు శుభపరిణామం. దీంతో ఆ జట్టు బలం పెరిగింది. ఇక డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, హెడ్, లబుషేన్, స్టాయినిస్, ఆడమ్ జంపా మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న కంగారూలను లీగ్ మ్యాచ్‌లో భారత్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
భయపెట్టే దూకుడు
ఈసారి వరల్డ్ కప్‌నకు భారత్ ఆతిథ్యమిస్తున్నా.. మన జట్టును కాదని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ఇంగ్లాండ్‌ను టైటిల్ ఫేవరెట్‌గా పేర్కొన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఆ జట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ ఆటతీరును చూస్తున్న క్రికెట్ అభిమానులకు సన్నీ అంచనా అతిగా ఏమీ అనిపించదు. వన్డేల్లో కూడా టెస్టుల్లో అనుసరిస్తున్న 'బజ్‌బాల్' వ్యూహాన్ని చాలా ఏళ్ల నుంచి ఇంగ్లాండ్ అమలు చేస్తోంది. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమి తర్వాత వన్డేలు ఆడే తీరునే మార్చేసింది.
ఆచితూచి ఆడే ఆటగాళ్లందరినీ పక్కన పెట్టి విధ్వంసక ఆటగాళ్లతో జట్టును కూర్పు చేసింది. ఇక నెమ్మదిగా ఆడే రూట్ సైతం తన ఆటతీరును మార్చుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా 8, 9 స్థానాల్లో కూడా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లుండటం వల్ల క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ప్రతి బ్యాటర్ బాదడమే పనిగా పెట్టుకుంటున్నాడు. నాకౌట్‌లో ఈ జట్టు ఎదురై, వాళ్ల సహజశైలిలో రెచ్చిపోతే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు భారత్ ముందున్న ప్రశ్న. గత టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ మిగిల్చిన పరాభవాన్ని టీమ్‌ఇండియా మరిచిపోలేదు. ఇంగ్లాండ్‌కు మరో జట్టయినా అడ్డుకట్ట వేయాలి. లేదా నాకౌట్లో ఆ జట్టు ఎదురైతే రోహిత్ సేన పక్కా ప్లాన్‌తో దెబ్బ కొట్టాలి. లేదంటే వరల్డ్ కప్‌పై ఆశలు వదులుకోవాల్సిందే.