Hetmyer Dropped: టీ20 వరల్డ్‌కప్‌నకు ముందే మాజీ ఛాంపియన్స్ వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మయర్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. అయితే సాధారణంగా ఓ ప్లేయర్‌ను గాయం కారణంగానో, ఫామ్ లేమి కారణంగానో పక్కన పెడతారు. ఇక్కడ మాత్రం హెట్‌మయర్ ఫ్లైట్ మిస్ కావడంతో టీమ్ నుంచి తప్పించాలని విండీస్ బోర్డు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
వరల్డ్‌కప్ కోసం వెస్టిండీస్ టీమ్ గ్రూపులుగా ఆస్ట్రేలియా వెళ్తోంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ముగించుకొని ప్లేయర్స్ ఒక్కొక్కరుగా ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కుతున్నారు. శనివారం (అక్టోబర్ 1) హెట్‌మయర్ ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో తన ఫ్లైట్ రీషెడ్యూల్ చేయాల్సిందిగా అతడు విండీస్ బోర్డును కోరాడు.
వాళ్లు సోమవారం(అక్టోబర్ 3) అతడికి ఫ్లైట్ బుక్ చేశారు. కానీ సమయానికి అతడు రాలేకపోయాడు. దీంతో వరల్డ్‌కప్ టీమ్ నుంచి అతడిని తప్పించి షమార్ బ్రూక్స్‌కు స్థానం కల్పించాలని విండీస్ బోర్డు నిర్ణయించింది. ఇది బోర్డు తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయమని మీడియా ప్రకటనలో తెలిపింది. సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ టీమ్ కెప్టెన్‌గా ఉన్నాడు హెట్‌మయర్.
"విమానాలు అందుబాటులో ఉండటం సవాలే అయినా అతడి విజ్ఞప్తి మేరకు సోమవారం (అక్టోబర్ 3) ఒక టికెట్ బుక్ చేయగలిగాం. అప్పటికీ అతడు అక్టోబర్ 5న ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి టీ20 మిస్ అవుతాడని తెలుసు. అయినా సోమవారం ఉదయం హెట్‌మయర్ ఫోన్ చేసి తాను సమయానికి ఎయిర్‌పోర్ట్‌కు రాలేకపోతున్నానని చెప్పాడు" అని విండీస్ బోర్డు మీడియా ప్రకటనలో తెలిపింది.
వరల్డ్‌కప్‌నకు ముందు ఆస్ట్రేలియాతో రెండు టీ20ల సిరీస్ ఆడనుంది వెస్టిండీస్. ఆ తర్వాత సూపర్ 12 స్టేజ్‌కు నేరుగా క్వాలిఫై కాలేకపోయిన విండీస్ టీమ్.. అక్టోబర్ 17 నుంచి జరగబోయే తొలి స్టేజ్‌లో తలపడనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఎంపికైన బ్రూక్స్ ఈ వారాంతంలోగా ఆస్ట్రేలియాలోని వెస్టిండీస్ టీమ్‌తో కలవనున్నాడు. గ్రూప్ బీలో ఐర్లాండ్, స్కాట్లాండ్, జింబాబ్వేలతో కలిసి సూపర్ 12 స్టేజ్‌కు క్వాలిఫై అయ్యేందుకు విండీస్ పోటీ పడనుంది.
ఇవీ చదవండి: 'ఇప్పుడే ఫామ్‌లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్ ఇస్తే ఎలా?'.. మేనేజ్మెంట్పై మాజీలు ఫైర్!
'నెర్వస్ 19'.. బౌలింగ్ ఫోబియా నుంచి రోహిత్ సేన ఎలా బయటపడుతుందో?