Womens ICC Rankings 2023 : అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో పలు ప్లేయర్లు తమ స్థానాలను మెరుగుపరుచుకుని ముందుకు సాగగా.. టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దూసుకెళ్లింది. ఏకంగా నాలుగు స్థానాలను మెరుగుపర్చుకుని పదో ర్యాంక్‌కు చేరింది. శ్రీలంక ప్లేయర్ చమారి ఆటపట్టు, ఇంగ్లాండ్ ప్లేయర్ నటాలీ స్కివెర్తో కలిసి హర్మన్ సంయుక్తంగా ఈ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో 35 బంతుల్లోనే 54 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన ఘనతను ఖాతాలోకి వేసుకున్న హర్మన్ మరో ప్రతిష్టాత్మక రికార్డును తన ఖాతాలోకి వేసుకుంది.
మరోవైపు ఈ జాబితాలో తహిలా మెక్‌గ్రాత్ (784), బెత్ మూనీ (777), స్మృతీమంధాన (728), సోఫీ డివైన్ (683 పాయింట్లు), బేట్స్ (677)తో టాప్ -5 స్థానాలను సొంతం చేసుకున్నారు. ఇక బౌలర్ల జాబితాలో భారత బౌలర్ దీప్తి శర్మ (733 పాయింట్లు) మూడో ర్యాంకింగ్‌లో కొనసాగుతూ రెండో ర్యాంకర్ లబా (746)కు కాస్త చేరువగా వచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ (788) అగ్రస్థానంలో ఉంది. దీప్తి శర్మ కాకుండా రేణుకా సింగ్ (693 పాయింట్లు) తొమ్మిదో స్థానంతో భారత్ తరఫున టాప్ -10లో కొనసాగుతున్న రెండో బౌలర్‌గా నిలిచింది. ఇక ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో ఆసీస్ ప్లేయర్ ఆష్లే గార్డెనర్ (435) అగ్రస్థానంలో ఉండగా.. భారత్ బౌలర్ దీప్తి శర్మ (395) ఐదో స్థానంలో కొనసాగుతోంది.
గతంలో విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన..ఒక్కో స్థానం కోల్పోయారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హర్మన్‌ప్రీత్.. ఓ ర్యాంక్ కోల్పోయి ప్రస్తుతం ఆరో స్థానంలో నిలువగా.. వైస్ కెప్టెన్ స్మృతి మందన ఏడో ర్యాంక్‌కు చేరింది. హర్మన్‌ప్రీత్ 716 పాయింట్లతో .. స్మృతి 714 ర్యాంకింగ్ పాయింట్లతో ఈ స్థానాన్ని దక్కించుకోగా.. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (758 పాయింట్లు) బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.