ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు తొలిరోజున తన బౌలింగ్ ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చిందని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్, బ్యాట్స్‌మన్ బెయిర్ స్టోను ముందస్తు ప్రణాళికల ద్వారా ఔట్ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపాడు.
"ఓవర్ ప్రారంభానికి ముందు నా బౌలింగ్‌లో రూట్‌ను ఔట్ చేయాలని అనుకున్నా. ఆ విధంగా నా వ్యూహాన్ని అమలు పరిచి అనుకున్నది సాధించా. అది నాకొక గొప్ప అనుభూతినిచ్చింది. అదే విధంగా కొన్ని పాత ఫుటేజీల ద్వారా బెయిర్ స్టో బ్యాటింగ్ బలహీనతను తెలుసుకున్నా. ఇన్-స్వింగ్ బంతులకు అతడు ఔట్ అవ్వడం గమనించా. వరుసగా అవే బంతులను విసరడం వల్ల చివరికి అతడి వికెట్ సాధించగలిగా".
- మహ్మద్ సిరాజ్, టీమ్ఇండియా పేసర్
కోహ్లీకి చెప్పాను..
ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో జరిగిన వాగ్వివాదంపై సిరాజ్ స్పందించాడు. ఈ సంఘటనలో కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా చక్కగా వ్యవహరించాడని తెలిపాడు. "అతడు (బెన్ స్టోక్స్) నాపై ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయాన్ని విరాట్ కోహ్లీ భాయ్‌కి చెప్పాను. అతడికి తగిన రీతిలో కోహ్లీ సమాధానం చెప్పాడు" అని సిరాజ్ అన్నాడు.
స్పిన్నర్లదే పైచేయి..
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్‌మన్ మరోసారి తేలిపోయారు. నాలుగో టెస్టులో టీమ్ఇండియా స్పిన్ ద్వయం అక్షర్ పటేల్ (4/68), రవిచంద్రన్ అశ్విన్ (3/47) మాయాజాలానికి సిరాజ్ (2/45) పేస్ తోడవ్వడం వల్ల ఇంగ్లీష్ జట్టు విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), చెతేశ్వర్ పుజారా (15) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ మూడో బంతికే శుభ్‌మన్ గిల్ (0) వికెట్ చేజార్చుకున్న భారత్ చివరి (12 ఓవర్లు) వరకు పట్టుదలగా ఆడింది. కోహ్లీసేన 181 పరుగుల లోటుతో ఉంది.
ఇదీ చూడండి: స్పిన్నర్లదే రాజ్యం.. ఆడితేనే పరుగులు