వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును అధిగమించాలని యువరాజ్ తనను కోరినట్లు టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ వెల్లడించాడు. 2013లో ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్‌లో 209 పరుగులు చేసి సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు హిట్‌మ్యాన్. సోమవారం భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో తొలి డబుల్ సెంచరీ తర్వాత జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నాడు రోహిత్.
"డబుల్ సెంచరీ చేసి వెనుదిరిగినపుడు.. 'నువ్వు మరో ఓవర్ ఆడి ఉంటే సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టేవాడివి' అని అన్నాడు యువీ. అప్పటికే డ్రసింగ్ రూమ్‌లో నాపై అంచనాలు చాలా పెట్టుకున్నారు. మరో 10 నుంచి 15 పరుగులు చేసి ఉండాల్సిందని.. యువీ, శిఖర్ ధావన్ అన్నారు".
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా వైస్ కెప్టెన్
2013లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఆచితూచి ఆడిన రోహిత్.. సెంచరీ దాటిన తర్వాత వేగం అమాంతంగా పెంచాడు. 158 బంతుల్లో 209 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 384 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించిన భారత్.. 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రోహిత్ శర్మ కెరీర్లో ఇప్పటివరకు 224 వన్డేలు, 108 టీ20లు, 32 టెస్టులు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 14,029 పరుగులు చేశాడు. మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 264 పరుగులు సాధించి.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా ఘనత దక్కించుకున్నాడు.
ఇదీ చూడండి.. పాంటింగ్ అందుకే కెప్టెన్‌గా ఉండనన్నాడు: రోహిత్