ప్రస్తుతం క్రీడల్లో నల్ల జాతీయులపై వివక్ష అంశం పెద్ద చర్చకు దారితీసింది. అమెరికాలో పోలీసుల ఘాతుకానికి చనిపోయిన ఫ్లాయిడ్‌కు నిరసన తెలుపుతూ క్రీడాకారులు తమ ఆవేదనను వినిపిస్తున్నారు. క్రికెట్లోనూ ఈ వివక్ష ఉందని వెస్టిండీస్ ఆటగాళ్లతో పాటు మరికొందరు వెల్లడించారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మఖియా ఎన్తిని బ్లాక్ లివ్స్ మ్యాటర్‌కు మద్దతు తెలుపుతూ అప్పట్లో తానూ ఈ వివక్ష ఎదుర్కొన్నానని తెలిపాడు.
"ఆ సమయంలో నేను ఒంటరిగా ఉన్నా అనిపించేది. భోజనానికి వెళ్లేపుడు నన్నెవరూ పిలిచేవారు కాదు.వెళ్లినా ఎవరూ నా పక్కన కూర్చునే వారు కాదు. నా ముందే వారు ప్రణాళికలు రచించేవారు. కానీ నన్ను అందులో భాగస్వామిని చేసేవారు కాదు. మేమందరం ఒకే జెర్సీ ధరించేవాళ్లం, ఒకే జాతీయ గీతం పాడేవాళ్లం. కానీ నేను వేరుగా కనిపించేవాడిని. ఇలాంటి సంఘటన వల్ల జట్టుతో కలిసి బస్సులో కూడా వెళ్లకపోయేవాడిని. డ్రైవర్‌కు నా బ్యాగ్ ఇచ్చి.. పరుగెత్తుకుంటూ స్టేడియంకు చేరుకునేవాడిని. వచ్చేటపుడు కూడా అలానే చేసేవాడిని."
-ఎన్తిని, దక్షిణాఫ్రికా మాజీ పేసర్
బ్లాక్ లివ్స్ మ్యాటర్‌కు మద్దతు ప్రకటించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. జట్టులో వివక్షను నిర్మూలించాలని ఆటగాళ్లందరూ ఓ లేఖపై సంతకాలు కూడా చేశారు.