ఎడారి వేడిలో ఆటగాళ్లు అతిగా సాధన చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్. ప్రతి సెషన్ తర్వాత అలసటను బట్టి తర్వాతి సెషన్‌కు సమయం నిర్దేశించుకుంటామని పేర్కొన్నారు. శిబిరంలో తక్కువ మందే ఆటగాళ్లు ఉండటం వల్ల జాగ్రత్తగా కసరత్తులు చేయాలని సూచించారు.
సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానెల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి సాధనా శిబిరం తర్వాత జట్టు పరిస్థితులను ఆయన మదింపు చేశారు.
"మేం చాలా తక్కువ మందిమే ఇక్కడికొచ్చాం. గతేడాదికి భిన్నంగా మా శిక్షణ సెషన్లు ఉండాలని కోరుకుంటున్నా. తొలి మూడు వారాల్లో అతిగా సాధనా శిబిరాలు ఉండవని మా కుర్రాళ్లకు చెప్పాను. మొదటి మ్యాచ్‌కు సన్నద్ధమయ్యేంత వరకు కాస్త సవాలే. అయితే శారీరకంగా, సాంకేతికంగా, వ్యూహాత్మకంగా మా కుర్రాళ్లను సన్నద్ధం చేయడం అత్యంత ముఖ్యం. తొలి మ్యాచ్‌కు ముందు మేం 20 ట్రైనింగ్ సెషన్లు నిర్దేశించుకున్నాం. ఇప్పుడవి ఎక్కువేనని అనిపిస్తోంది. ప్రతి రోజు శిక్షణ తర్వాత పరిస్థితులను సమీక్షిస్తాం"
--రికీ పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్ కోచ్
గతేడాది ప్రదర్శననే ఈసారీ పునరావృతం చేయాలనుకుంటున్నట్టు చెప్పారు రికీ. ఒకసారి విజయవంతమైనప్పుడు ఎందుకు విజయవంతం అయ్యామో అర్థం చేసుకోవడం ముఖ్యమన్నారు. సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. బయో బుడగ నిబంధనలను కఠినంగా పాటించేలా చేస్తానన్నారు రికీ పాంటింగ్. మేనేజ్ చేయడమంటే ఆటగాళ్లను నియంత్రణలో ఉంచడం కాదని సమయ పాలన అని పేర్కొన్నారు. కొత్తగా జట్టులో చేరిన అశ్విన్, రహానెపై ఆయన ప్రశంసలు కురిపించారు.
"వారిద్దరూ క్లాస్ ఆటగాళ్లు. టీమ్‌ఇండియాకు సుదీర్ఘంగా ఆడుతున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో అశ్విన్ ఒకరు. రాజస్థాన్ రాయల్స్‌ను రహానె సుదీర్ఘకాలం నడిపించారు. వారికి ఎంతో నైపుణ్యం, క్లాస్, అనుభవం ఉన్నాయి. అవి జట్టుకెంతో అవసరం. మా సారథి యువకుడు. ఇలాంటి సీనియర్ల సహకారం అతడికెప్పుడూ ఉపయోగమే" అని పాంటింగ్ అన్నారు.
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. అయితే ఇటీవల సీఎస్కే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా 13మంది సిబ్బందికి కరోనా సోకింది. ప్రస్తుతం వారిని క్వారంటైన్లో ఉంచారు. మిగతా జట్ల ఫ్రాంఛై జీలు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించాయి.