త్రీ టీమ్ క్రికెట్(3టీసీ) సాలిడారిటీ కప్పు మ్యాచ్లో పాల్గొన్నందుకు గర్వంగా ఉందని చెప్పాడు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ సారథి ఏబీ డివిలియర్స్. ఈ టోర్నీ ద్వారా 1 కోటి 13 లక్షల రూపాయలకు పైగా విరాళాలు సేకరించారు. ఇందులో దాదాపు 90 లక్షల రూపాయలను క్రికెట్ రంగంలో పనిచేస్తూ.. ప్రస్తుతం కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అందించనున్నారు. మిగతా మొత్తాన్ని కెప్టెన్లు సూచించిన పలు ఛారిటీలకు అందజేస్తారు.
" మహమ్మారి సమయంలో బయటకు వచ్చి ఆడటం వెనుక చాలా ముఖ్యమైన కారణముంది. దక్షిణాఫ్రికాలోని సాలిడారిటీ కోసం ఇదంతా చేశాం. దేశంగా అందరం ఒకటేనని చాటిచెప్పాం. అదే నాకు కావాల్సింది. విరాళాలు సేకరించడం చాలా ఆనందాన్నిచ్చింది" అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
ఒకే మ్యాచ్లో మూడు జట్లు ఆడేలా ఒక కొత్త ఫార్మాట్ రూపొందించింది దక్షిణాఫ్రికా బోర్డు. కరోనా తర్వాత ఆటను పునః ప్రారంభించడానికి ఈ టోర్నీ ఉపయోగపడింది. కొవిడ్-19 లాక్డౌన్ వల్ల మార్చి నుంచి క్రికెట్ బంద్ అయిన విషయం తెలిసిందే.
డివిలియర్స్ సారథ్యం వహించిన ఈగల్స్ జట్టు మొదటి ఎడిషన్లోనే స్వర్ణం గెలుచుకుంది. ఈ మ్యాచ్లో 24 బంతుల్లో 61 పరుగులతో దుమ్ములేపాడు ఏబీడీ.