ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై టీమ్‌ఇండియా మాజీ సారథి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ అనిల్‌కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. కొవిడ్-19 ముప్పుతో అభిమానులు లేకుండా టోర్నీ నిర్వహిస్తే ఇబ్బందేమీ లేదని పేర్కొన్నాడు.
"సమయం అనుకూలిస్తే ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణకు అవకాశం ఉంటుందన్న నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించకపోతే 3 లేదా 4 వేదికలు సరిపోతాయి. ఇప్పటికీ అవకాశం ఉంది. మేం విశ్వాసంతో ఉన్నాం"
-- అనిల్ కుంబ్లే, టీమ్‌ఇండియా మాజీ సారథి
ఎంపిక చేసిన నగరాల్లోనే
హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం కుంబ్లే అభిప్రాయంతో ఏకీభవించాడు. ఆటగాళ్ల ప్రయాణాలను తగ్గించేందుకు ఎక్కువ స్టేడియాలున్న నగరాల్లో లీగ్‌ను నిర్వహిస్తే బాగుంటుందన్నారు.
"ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణకు కచ్చితంగా అవకాశాలు ఉన్నాయి! లీగ్ భాగస్వాములంతా విశ్వాసంతో ఉన్నారు. 3 లేదా 4 వేదికలున్న ఓ నగరాన్ని గుర్తించాలి. అలాంటి దానిని గుర్తిస్తే ప్రయాణ సమస్య తీరుతుంది. ఎందుకంటే విమానాశ్రయాల నుంచి ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు. అందుకే ఫ్రాంచైజీలు, బీసీసీఐ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాయని భావిస్తున్నా"
-- లక్ష్మణ్, భారత మాజీ క్రికెటర్
కరోనా ముప్పుతో మార్చి నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్తంభించింది. ఏప్రిల్, మేలో జరగాల్సిన ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ఖాళీ స్టేడియాల్లో క్రీడలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల మళ్లీ ఆశలు చిగురించాయి. తాజాగా ఆస్ట్రేలియా బోర్డు భారత్‌తో సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య తేదీలు ఖాళీగా ఉంచడం ఐపీఎల్-2020పై ఆశలు కల్పిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఐపీఎల్‌పై ఆశలు.. టోర్నీకి తగ్గట్లు ఆసీస్ బోర్డు షెడ్యూల్!