టీ20 ప్రపంచకప్ యథావిధిగా జరగాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడాటోర్నీలు రద్దైన క్రమంలో టీ20 ప్రపంచకప్ నిర్వహణ గాల్లో దీపంలా మారింది. ఈ నెల 28న జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించే సమావేశంలో టోర్నీ నిర్వహణ సహా క్రికెటర్లు పాటించాల్సిన కొన్ని నిబంధనలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ స్పందించాడు.
"బంతిని మెరిపించడం సహా మ్యాచ్ జరిగే సమయంలో ఆటగాళ్లంతా ఒకచోట చేరి సంబరాలు చేసుకోవడం నిషేధించడమనేది ఊహించుకోవడానికి కష్టంగానే ఉంది. కానీ, ఐసీసీ నిబంధనలను రూపొందిస్తే కచ్చితంగా వాటిని అందరూ పాటించి తీరాలి. ఆటగాడిగా, కెప్టెన్గా ఇదే నా మొదటి టీ20 ప్రపంచకప్. ఈ టోర్నీ అనుకున్న సమయానికి జరగాలని కోరుకుంటున్నా. అయితే ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఆడాలంటే ఆటగాళ్లకు ఎక్కువ ప్రేరణ అవసరం అవుతుంది".
- బాబర్ అజామ్, పాకిస్థాన్ జట్టు కెప్టెన్
మే 28న జరిగే సమావేశంలో ఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ముందు మూడు అంశాలు పరిశీలనలోకి రానున్నాయి. ఆటగాళ్లను 14 రోజుల నిర్బంధంతో పాటు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలనేది అందులో మొదటి అంశం. ప్రేక్షకులను అనుమతించకుండా టోర్నీ నిర్వహించాలనేది రెండో అంశం. ఇవి కుదరని పక్షంలో టోర్నీని 2022కు వాయిదా వేయడమనేది చివరి అంశంగా పరిశీలించనున్నట్లు ఐసీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇదీ చూడండి... జమైకా పరుగుల వీరుడి ఇంటికి బుల్లి స్ప్రింటర్