BCCI President : బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు వచ్చేశాడు. భారత జట్టు మాజీ ప్లేయర్ రోజర్ బిన్నీ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ మేరకు మంగళవారం ముంబయి తాజ్ హొటల్లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
సౌరవ్ గంగూలీ తర్వాత మరో క్రికెటర్‌కే అవకాశం ఇస్తే బాగుంటుందని రాష్ట్ర సంఘాల సభ్యులు భావించారు. దీంతో రోజర్ బిన్నీకి అవకాశం దొరికింది. బిన్నీతో పాటు బీసీసీఐ పాలకవర్గానికి కూడా ఎన్నికలు జరిగిగాయి. అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా జై షా, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ లోన్ సాకి, కోశాధికారిగా ఆశీష్ షెలార్, ఐపీఎల్ ఛైర్మన్‌గా అరుణ్ సింగ్ ధూమాల్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్‌గా ఖైరుల్ జమాల్ మజుందార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆ రెండిటిపైనే నా దృష్టి.. తాను రెండు విషయాలపై ఫోకస్ పెట్టబోతున్నట్టు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రోజర్ బిన్నీ అన్నాడు. మొదటిది ప్లేయర్లకు గాయాలు కాకుండా.. రెండోది దేశంలోని పిచ్‌లపై అని చెప్పాడు. గాయాల కారణంగానే బుమ్రా వరల్డ్ కప్‌కు దూరమయ్యాడని పేర్కొన్నాడు.
గొప్ప చేతుల్లో ఉంది.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంపై రోజర్ బిన్నీకి అభినందనలు తెలిపాడు మాజీ అధ్యక్షుడు గంగూలీ. అలాగే కార్యవర్గం మొత్తానికి శుభాకాంక్షలు చెప్పాడు. బీసీసీఐ గొప్ప చేతుల్లో ఉంది అని కొనియాడాడు.
కాగా, భారత క్రికెట్లో రోజర్ బిన్నీ అనేక బాధ్యతలు చేపట్టారు. కపిల్ దేవ్ సారథ్యంలో 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడు. ఆ వరల్డ్ కప్‌లో 18 వికెట్లు పడగొట్టారు. అలాగే ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు. మొత్తంగా జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
బిన్నీ మొత్తంగా 27 టెస్టు మ్యాచ్‌లు, 72 వన్డేలు ఆడాడు. మొత్తంగా 205 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆటకు వీడ్కోలు పలికాక కోచ్‌గా మారారు. బీసీసీఐ సెలక్టర్‌గానూ పనిచేశారు. 2015 వన్డే ప్రపంచకప్ ఎంపిక చేసిన సెలక్టర్ల బృందంలో ఆయనా ఉన్నారు. 2019లో కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక తాజాగా 2022లో బీసీసీఐ అధినేతగా మారారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల వరకు ఉంటారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన బిన్నీపై చాలా పెద్ద బాధ్యతే ఉంది. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ క్రికెట్‌ను ప్రభావితం చేస్తాయి. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా అతడి పనితీరుపైనే అందరి దృష్టి ఉంటుంది.
ఇవీ చదవండి : ఐసీసీ ఛైర్మన్ రేసులో ఎవరు?.. గంగూలీకి కష్టమేనా?