Virat Kohli Watch Collection : స్టార్ క్రికెటర్స్‌లో ఒక్కోక్కరికి ఒక్కో వస్తువు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వద్ద వందల కొద్ది బైక్స్ కలెక్షన్స్ ఉన్నాయి. ఆ వాహనాలను పెట్టుకునేందుకు రాంచీలోని ఫామ్ హౌస్‌లో ఓ స్పెషల్ గ్యారేజ్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మాహీ లాగే రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీకి కూడా వాచ్‌లు అంటే ఎంతో ఇష్టమట. తన ఇంటి నిండా ఇప్పటికే ఎన్నో రకాల వాచ్ కలెక్షన్స్ ఉన్నట్లు అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో విరాట్ తెలిపాడు.
ఇక విరాట్ కోహ్లీ ఇంట్లోని వార్డ్ రోబ్‌లో దాదాపు అన్నీ ఖరీదైన వాచ్‌లే ఉంటాయి. అందులో రోలెక్స్ వాచీలే ఎక్కువ ఉంటాయట. ఇటీవలే వెస్టిండీస్ టూర్‌లో విరాట్ కోహ్లీ తన చేతికి ఓ రోలెక్స్ వాచ్ పెట్టుకుని కనిపించాడు. కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవరోస్ అనే ఈ గోల్డ్ కలర్ వాచ్.. ఖరీదు దాదాపు రూ.88 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దీంతో పాటు రోలెక్స్ కంపెనీకి చెందిన డేట్‌జస్ట్ 41 అనే వాచీ కూడా విరాట్ దగ్గర ఉంది. 18 క్యారెట్స్ గోల్డ్, డైమండ్స్‌తో తయారుచేసిన ఈ వాచ్ ఖరీదు సుమారు రూ.9 లక్షల రూపాయలని అంచనా.
అంతేకాకుండా విరాట్‌కు వాచీలను కానుకగా ఇచ్చే అలవాటు కూడా ఉందట. అలా ఇప్పటి వరకు అతను శుభ్‌మన్ గిల్, ఏబీ డివిల్లియర్స్, ఫాఫ్ డుప్లిసిస్ లాంటి స్టార్స్‌కు ఖరీదైన వాచ్‌లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అలాగే ఎవరైన క్రికెటర్ తన చేతికి వాచీ వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, దాని గురించి ఆరా తీయడంతో పాటు దాన్ని వెంటనే కొనుగోలు చేసే అలవాట్లు కూడా విరాట్ కోహ్లీకి ఉన్నాయట.
Hardik Pandya Expensive Watch : అయితే టీమ్ఇండియాలో అత్యంత ఖరీదైన వాచీ ఉన్నది మాత్రం ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా దగ్గరేనట. అతను ధరించే పటెక్ ఫిలిప్పీ రిస్ట్ వాచ్ ధర సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. అంతే కాకుండా ఆ వాచీలో 32 ఖరీదైన వజ్రాలు పొదగి ఉంటాయట.