నటీనటులు: విష్ణు విశాల్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మంజిమా మోహన్, రైజా విల్సన్, రేబా మోనికా జాన్, మాల పార్వతి, తదితరులు; సమర్పణ: రవితేజ; సంగీతం: అశ్వంత్; నిర్మాత: విష్ణు విశాల్; రచన, దర్శకత్వం: మను ఆనంద్; విడుదల తేదీ: 11-2-2022
విష్ణు విశాల్ కథల ఎంపిక చాలా బాగుంటుంది. తమిళంలో ఆయన చేసిన సినిమాలే అందుకు రుజువు. అక్కడ చేసిన 'రాక్షసన్' సంచలన విజయం సాధించింది. అది తెలుగులోనూ 'రాక్షసుడు'గా రీమేకై ఘన విజయం అందుకుంది. విష్ణు విశాల్ ఇప్పుడు తెలుగు మార్కెట్‌పై కూడా దృష్టి పెట్టాడు. రానాతో కలిసి 'అరణ్య'లో మెరిసిన ఆయన.. స్వయంగా నిర్మిస్తూ చేసిన 'ఎఫ్.ఐ.ఆర్' తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైంది. మరి చిత్రం ఎలా ఉంది ? ఆయన గత చిత్రాల స్థాయిలో కథాబలం ఉందా? తెలుసుకుందాం పదండి.
కథేంటి: ఇర్ఫాన్ (విష్ణు విశాల్) కెమికల్ ఇంజినీరింగ్ చదువుకున్న యువకుడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చివరికి ఓ కంపెనీలో పార్ట్ టైం జాబ్‌లో చేరతాడు. అతడి జీవితం ఇంటెలిజెన్స్ విభాగానికి అనుమానాస్పదంగా కనిపిస్తుంది. దాంతో అతడు అబూబకర్ అనే నిర్ణయానికి వస్తుంది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న తీవ్రవాదే ఈ అబూ బకర్. అతడ దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశాడని తెలిసి ఇంటెలిజెన్స్ విభాగం మరింతగా అతడి కదలికలపై కన్నేస్తుంది. కొన్ని ఘటనలతో ఇర్ఫానే.. అబూబకర్ అనే గట్టి నిర్ణయానికి వచ్చి అతడి అదుపులోకి తీసుకుంటారు అధికారులు. ఇర్ఫాన్ అరెస్ట్ తర్వాత కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. మరి నిజంగా ఇర్ఫానే అబూబకరా? లేదంటే అమాయకుడైన అతడిపై తీవ్రవాద ముద్ర వేశారా? చివరికి ఏం జరిగింది అన్నది తెరపైన చూడాల్సిందే.
ఎలా ఉందంటే: ఇదివరకు కొన్ని సినిమాల్లో స్పృశించిన కథే ఇది. తీవ్రవాదం నేపథ్యం, విధ్వంస కుట్రలు, వారికోసం అధికారుల వేట, ఆ క్రమంలో చోటు చేసుకునే అనూహ్యమైన ఘటనలు.. ఈ వరుసలోనే ఓ వేగం, ఓ ప్రత్యేకమైన ఉత్కంఠ కనిపిస్తుంది. ఒక పక్క అమాయక యువకుడిలా కనిపించే ఇర్ఫాన్ జీవితం, అతడి ప్రేమ.. మరో పక్క అబూబకర్ కోసం ఇంటెలిజెన్స్ గాలింపు, ఆ క్రమంలో చోటు చేసుకునే పరిణామాలతో ప్రథమార్ధం సాగుతుంది. ఇంటెలిజెన్స్ శోధన ఆసక్తిని రేకెత్తించినా, ఇర్ఫాన్ జీవిత నేపథ్యంలో సన్నివేశాలు మాత్రం సాదాసీదాగా అనిపిస్తాయి. ఆ రెండు కథలు ఒక చోట ముడిపడినప్పుడు కథ మరింత రసవత్తరంగా మారుతుంది. విరామ సమయంలో వచ్చే సన్నివేశాలు ద్వితీయార్ధంపై మరిన్ని అంచనాల్ని పెంచుతాయి. ఇర్ఫాన్ పాత్ర ఒక్కోసారి ఒక్కోలా కనిపించడం, అమాయకుడు అనిపించేలోపే.. కాదు అన్నట్టుగా మరో ఘటన జరగడం, పోలీస్ చెర నుంచి అతడు తప్పించుకోవడం.. ఇలా అడుగడుగునా చోటు చేసుకునే మలుపులు ఈ సినిమాని ప్రత్యేకంగా మార్చేశాయి. క్లైమాక్స్‌కు చేరుకునే కొద్దీ కథపై మరింత పట్టు ప్రదర్శించాడు దర్శకుడు. పతాక సన్నివేశాల్లో మలుపులు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. తొలి సగభాగంలో కలిగిన అనుమానాలు కూడా నివృత్తి అవుతాయి. విష్ణు విశాల్ ఈ కథ కంటే కూడా, మలుపులని దృష్టిలో ఉంచుకుని ఒప్పుకొని ఉంటారేమో. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే మలుపులు సినిమాకు ప్రాణం. సినిమాల్లోనూ, ఓటీటీ వేదికల్లోనూ ఈ నేపథ్యంలో బోలెడు కథలు వచ్చాయి. వాటి మధ్య ఓ ప్రత్యేక కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. అక్కడక్కడా సన్నివేశాలు బోర్ కొట్టినా చివరికి మాత్రం సినిమా సంతృప్తి పరుస్తుంది.
ఎవరెలా చేశారంటే: విష్ణు విశాల్ పాత్రలో రెండు కోణాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా చక్కటి అభినయం ప్రదర్శించాడు. ఇలాంటి సున్నితమైన కథల్ని ఎంచుకోవడం, ఇలాంటి పాత్రను పోషించడం ఓ నటుడికి అంత సులువేమీ కాదు. విష్ణు నిర్మాతగానూ తన అభిరుచిని ప్రదర్శించాడు. అమ్మాయిలకు బలమైన పాత్రలే దక్కాయి, మంజిమ, రెబా మోనికా జాన్ పాత్రలు కథలో కీలకం. గౌతమ్ మేనన్ పాత్ర చాలా హుందాగా ఉంది. ఆయన తెలుగు డబ్బింగ్ కొత్తగా అనిపించింది. సాంకేతిక విభాగాల్లో కెమెరా, సంగీతానికి మంచి మార్కులు పడతాయి. ముఖ్యంగా నేపథ్యసంగీతం ఆకట్టుకుంటుంది. దర్శకుడు మను కథను నడిపిన తీరు మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
+ కథనం, మలుపులు
+ విష్ణు విశాల్ నటన
+ క్లైమాక్స్
బలహీనతలు
- అక్కడక్కడా కథలో తగ్గిన వేగం
చివరిగా: ఎఫ్. ఐ. ఆర్... ఓ ఆసక్తికరమైన ప్రయత్నం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">