సినిమాలు మనల్ని ఎంతగానో నవ్విస్తాయి.. కొన్నిసార్లు ఏడిపిస్తాయి. వినోదాన్ని ఇస్తూనే జీవితమంటే ఇదే అన్నట్టుగా వెండితెరపై ప్రతిబింబిస్తాయి. అయితే ఇందులో మంచిని బోధిస్తూనే.. నేరాలు, యాక్షన్ సన్నివేశాలు కళ్లకు కట్టినట్టు చూపించడం వల్ల యువతరం వాటివైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనేది కొంతమంది విశ్లేషకుల వాదన. నేరపూరిత అంశాలతో రూపొందించిన సినిమాలు లేదా వెబ్‌సిరీస్‌లకు యువత ఆకర్షితులై.. అదే మాదిరిగా నిజజీవితంలో నేరాలకు పాల్పడుతున్నారని అంటున్నారు.
![Wrong takeaways: When movies inspired criminal acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9550221_oo.jpg)
'మీర్జాపూర్'లోని పాత్ర స్ఫూర్తిగా
ఇటీవలే హరియాణాలో తన ప్రేమను అంగీకరించలేదని తౌసిఫ్ అనే వ్యక్తి నికితా తోమర్(21)ను హత్య చేశాడు. తాను పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు నికితాను అక్టోబరు 26న ఆమె చదువుకునే కళాశాల బయట పట్టపగలు కాల్చి చంపాడు. అయితే ఈ హత్య చేసిన తౌసిఫ్.. 'మీర్జాపూర్' వెబ్సిరీస్లోని నటుడు దివ్యేండు శర్మ నటించిన మున్నా పాత్రకు ఆకర్షితుడయ్యాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
తెరపై చూపిస్తున్న నేరపూరిత సన్నివేశాలు యువతను ప్రేరేపించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి.
![Wrong takeaways: When movies inspired criminal acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9542980__dar_1511newsroom_1605430489_1028.jpg)
హీరోలా కిడ్నాప్
2016లో స్నాప్‌డీల్‌లో పనిచేస్తున్న దీప్తి సర్ణను దేవేంద్ర కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. నివేదిక ప్రకారం.. దీప్తిని కిడ్నాప్ చేయడానికి ముందు 14 నెలల పాటు దేవేంద్ర కుమార్ ఆమెను అనుసరించాడని తేలింది. అయితే 1993లో విడుదలైన 'డార్' చిత్రం నుంచి ఈ తరహా ప్రేరణ పొందినట్లు నిందితుడు తెలియజేశాడు. సినిమాలో జూహీ చావ్లాను ఎక్కువగా ఇష్టపడే షారుఖ్.. ఆమెను ఎక్కువగా అనుసరిస్తాడు. దీన్ని ప్రేరణగా తీసుకున్న దేవేంద్ర కుమార్... దీప్తిని కిడ్నాప్ చేశాడు. అదృష్టవశాత్తు కిడ్నాప్ చేసిన రెండు రోజుల తర్వాత దీప్తి క్షేమంగా తన ఇంటికి చేరింది.
![Wrong takeaways: When movies inspired criminal acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9542980_bunty_1511newsroom_1605430489_263.jpg)
'బంటీ ఔర్ బబ్లీ' తరహాలో
2013-14లో దిల్లీలోని అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడిన జగ్జీత్.. 2017లో అతని స్నేహితులరాలితో కలిసి పట్టుబడ్డాడు. దోపిడీ, స్నాచింగ్, దొంగతనంతో పాటు పోలీసులపై దాడి చేయడం వంటి వాటిల్లో వీరిద్దరిపై అనేక కేసులు నమోదయ్యాయి. అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ నటించిన 'బంటీ ఔర్ బబ్లీ' చిత్రాన్నిచూసి వీరు ప్రేరణ పొందినట్లు విచారణలో పోలీసులకు వెల్లడించారు.
![Wrong takeaways: When movies inspired criminal acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9542980__dhoom_1511newsroom_1605430489_1033.jpg)
'ధూమ్.. ధూమ్'
కేరళలోని దక్షిణ మలబార్ గ్రామీణ బ్యాంకులో డిసెంబరు 31, 2007లో భారీ దోపిడీ జరిగింది. ఇందులో 80 కిలోల బంగారం, రూ.25 లక్షలను దోచుకున్నట్లు తేలింది. కొన్నిరోజులకు ఈ గ్యాంగ్ పోలీసులకు పట్టుబడ్డారు. 'ధూమ్' చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని ఈ దోపిడీని చేశామని దొంగల ముఠా నాయకుడు జోసెఫ్ తెలిపాడు.
![Wrong takeaways: When movies inspired criminal acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9542980__sanjay_1511newsroom_1605430489_802.jpg)
'మున్నాభాయ్'లా పరీక్ష రాసి
బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ రూపొందించిన హిట్ చిత్రం 'మున్నాభాయ్ ఎంబీబీఎస్'. ఈ సినిమా అనేక నేరాలకు ప్రేరణగా నిలిచింది. 2017లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ మెడికల్ పరీక్ష రాసిన గురుగ్రామ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ (ఎఐపీఎంటీ) సందర్భంగా సిమ్ కార్డ్ యూనిట్లు, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇయర్పీస్లతో దుస్తులు ధరించిన విద్యార్థులు.. ఇలాగే తప్పుడు మార్గంలో పరీక్ష రాస్తూ దొరికారు.
![Wrong takeaways: When movies inspired criminal acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9542980__khal_1511newsroom_1605430489_892.jpg)
ఆ హీరోనే స్ఫూర్తి
చైన్ స్నాచింగ్, వాహన దొంగతనం వంటి ఎనిమిది కేసుల్లో నిందితుడుగా ఉన్న దీపక్ అనే వ్యక్తిని 2017లో దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాను సంజయ్ దత్ అభిమానినని.. ఆయన సినిమాలు చూడటం ద్వారా ప్రేరణ పొంది నిజజీవితంలోనూ చెడ్డవాడిగా మారాలని కోరుకుంటున్నట్లు విచారణలో దీపక్ అంగీకరించాడు.
![Wrong takeaways: When movies inspired criminal acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9542980__shoot_1511newsroom_1605430489_818.jpg)
పాఠశాల వయసులోనే కిడ్నాప్
అహ్మదాబాద్‌కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఆరేళ్ల పిల్లాడిని కిడ్నాప్ చేసి హత్యచేశారు. అయితే ఆ చిన్నారిని విడిచిపెట్టేందుకు రూ.25 లక్షలను అడగాలని వారు అనుకున్నారు. 'షూట్ అవుట్ ఎట్ లోఖండ్వాలా'లో తమ అభిమాన హీరోలు చేసిన విధంగా డబ్బుతో స్కార్పియో కొని, అందులో కత్తులు, తుపాకులతో నగర రహదారులపై తిరగాలనేది వారి ప్రణాళిక అని విచారణలో తేలింది. ఈ ముగ్గురిలో చిన్నవాడు టీవీ సీరియల్స్, సీఐడీ ఎక్కువగా చూస్తాడని తెలిసింది.
![Wrong takeaways: When movies inspired criminal acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9542980_ranjh_1511newsroom_1605430489_627.jpg)
'నాకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదు'
తన ప్రేమను అంగీకరించలేదని మీరట్‌కు చెందిన 16 ఏళ్లు బాలుడు ఓ బాలికను హత్య చేశాడు. హీరో ధనుష్, సోనమ్ కపూర్ నటించిన 'రాంఝానా' చిత్రం ప్రేరణతో హతమార్చినట్లు విచారణలో తెలిపాడు. తనకు దక్కని అమ్మాయి మరెవ్వరికీ దక్కకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు ఆ బాలుడు పోలీసులకు వివరించాడు.
![Wrong takeaways: When movies inspired criminal acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9542980_drishyam_1511newsroom_1605430489_477.jpg)
ఆ సన్నివేశమే ప్రేరణ
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శ్రియ నటించిన దృశ్యం సినిమా 2015లో విడుదలైంది. ఈ చిత్రం నిజజీవితంలో ఓ హత్య చేయడానికి నేరస్థులను ప్రేరేపించింది. భోపాల్‌కు చెందిన 25 ఏళ్ల అమితాబ్ ఆదివాసీని హత్య చేసిన నిందితులు ఈ సినిమా చూసి ప్రేరణ పొందినట్లు తెలిపారు. అదే ఏడాది మరో హత్య చేయడానికి ఇదే సినిమా కారణమైంది. తిరువనంతపురంలో తన భార్య హత్యపై పోలీసుల దర్యాప్తును పక్కదారి పట్టించడానికి.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఇదే దృశ్యం సినిమాలోని సన్నివేశం నుంచి స్ఫూర్తి పొందాడు.