రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. తాజా పరిణామాలపై ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోందోనని మదన పడుతున్నాయి. మరోవైపు రష్యా సేనల బాంబు దాడుల్లో సైనిక స్థావరాలు కుప్పకూలుతుండగా.. అమాయక పౌరులు మృత్యువాతపడుతున్నారు. ఎన్నో పర్యాటక ప్రాంతాలు బాంబుల దాడికి ధ్వంసమవుతున్నాయి. ఇదే ఉక్రెయిన్‌లో అందమైన లోకేషన్లలో ఇటీవలే పలు భారతీయ సినిమాలు చిత్రీకరణ జరుపుకొన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు విడుదలవ్వగా.. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ చిత్రాలివే..
'ఆర్‌ఆర్‌ఆర్' కోసం ఉక్రెయిన్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఉక్రెయిన్‌లో షూట్ చేశారు. గత ఆగస్టులో చివరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ కీలక సన్నివేశాలను తెరకెక్కించింది.
99 సాంగ్స్ కూడా..
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, రచనా సహకారం అందించి, నిర్మించిన చిత్రం '99 సాంగ్స్'. ఈ సినిమా కూడా ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకొంది. సినిమాలోని అత్యధిక సన్నివేశాలను అక్కడే తెరకెక్కించారు.
2.ఓలో పాట కోసం..
రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '2.ఓ'. ఈ సినిమాలో ఓ పాట కోసం చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లింది. పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా అక్కడ చిత్రీకరించారు.
కార్తీ 'దేవ్'
తమిళ నటుడు కార్తి కథానాయకుడిగా రజత రవి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దేవ్'. రొమాంటిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా రూపొందించిన ఇందులోని కీలక సన్నివేశాలను ఉక్రెయిన్‌లో తీశారు. 2018లో ఉక్రెయిన్‌లో షూట్ చేశారు.
సాయితేజ్ 'విన్నర్' కూడా అక్కడే..
సాయిధరమ్‌తేజ్, రకుల్ జంటగా నటించిన చిత్రం 'విన్నర్'. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలోని సాంగ్స్ కోసం చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లింది. కీవ్, లీవూ ప్రాంతాల్లో కొన్ని షాట్స్ తీశారు. మూడు పాటలను అది కూడా -2 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఇక్కడ తెరకెక్కించినట్లు ఓ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ చెప్పారు.