అశ్లీల చిత్రాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. "పోర్న్ VS వ్యభిచారం. కెమెరా ముందు శృంగారం చేసినందుకు డబ్బులు చెల్లించడాన్ని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు. వ్యభిచారానికి దీనికీ ఏమైనా వ్యత్యాసం ఉందా" అని ప్రశ్నిస్తూ గతంలో చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2013లో రాజ్‌కుంద్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పేదరికంలో పెరిగానని.. అందుకే ధనవంతుడిని కావాలని చిన్నతనం నుంచే బలమైన కోరిక ఉండేదని పేర్కొన్నారు. స్వతహాగా పైకి వచ్చానని, అందుకే తన భార్య శిల్పా శెట్టి తనను చాలా గౌరవిస్తుందని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
"నేను విధేయత గల కుటుంబానికి చెందిన వ్యక్తిని. మా నాన్న 45 ఏళ్ల క్రితమే లండన్‌కు వెళ్లి అక్కడ బస్ కండక్టర్‌గా పనిచేశారు. మా తల్లి ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. పేదరికాన్ని అసహ్యించుకున్నా. అందుకే ధనవంతుడిని కావాలనుకునేవాడిని. అనంతరం స్వయంకృషితో పైకి ఎదిగా. అందువల్లే శిల్పా నన్ను గౌరవిస్తుంది. వివాహం అనంతరం నేను డబ్బును వృథాగా ఖర్చు చేస్తున్నానేమోనని శిల్పా చెక్ చేసేది. సొంతంగా సంపాదించిన డబ్బును అలా వృథాగా ఖర్చుచేయనని ఆమెతో చెప్పేవాడిని" అని ఆ ఇంటర్వ్యూలో కుంద్రా పేర్కొన్నారు.
అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ముంబయి పోలీసులు ఈ నెల 19వ తేదీన రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని తెలిసి గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు మా దగ్గర ఉన్నాయని, ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌కుంద్రాను కనిపిస్తున్నాడని ముంబయి పోలీస్ కమిషనర్ తెలిపారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని రాజ్‌కుంద్రా పేర్కొన్నారు.