ETV Bharat / science-and-technology

పంక్చరవని టైరు.. కాలుష్యంతో వజ్రం.. 2022లో టాప్​ ఆవిష్కరణలు ఇవే.. - టింబర్‌లైన్‌ సోలార్‌ రూఫింగ్‌ సిస్టమ్‌

కాలంతో పాటుగా సాంకేతికత కూడా అవిశ్రాంతంగా పరుగులు తీస్తుంది. ప్రపంచంలో రోజురోజుకు రకరకాల ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అయితే 2022లో శాస్త్రవేత్తలు తమ తెలివితో చాలా రకాల ఆవిష్కరణలే చేశారు. వాటిలో అచ్చం మనిషిలాగా కన్పించే హ్యూమనాయిడ్‌ రోబోలు, మడిచే ల్యాప్​టాప్​లు, రంగులు మార్చే కార్లు, వ్యర్థాలతో వస్త్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా మరి..!

world top innovations
టాప్​ ఆవిష్కరణలు
author img

By

Published : Dec 25, 2022, 9:44 AM IST

World Top Inventions 2022 : సమయం లాగానే సైన్సు కూడా అవిశ్రాంతంగా పరుగులు తీస్తుంటుంది. 365 రోజులూ ఇరవై నాలుగ్గంటలూ ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది ఈ రంగంలో. పరిశోధకులు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నా.. వారి మెదడు ఆలోచిస్తూనే ఉంటుంది. ప్రయోగశాలలో మొదలుపెట్టిన ప్రక్రియ రసాయన చర్యలు జరుపుతూనే ఉంటుంది. అలా కొన్నేళ్ల పరిశోధన ఫలించి 2022లో విజయవంతంగా మార్కెట్లోకి ప్రవేశించాయి ఎన్నో కొత్త ఆవిష్కరణలు. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ కొన్నిటిని చూద్దామా..!

అచ్చం మనిషిలాంటి.. అమెకా

అచ్చం మనిషిలాంటి.. అమెకా!
ఇళ్లల్లో, పరిశ్రమల్లో, ఆస్పత్రుల్లో.. రకరకాల పనులు చేసిపెడుతున్నాయి రోబోలు. వాటిలో కొన్ని మాత్రమే కాస్త మనిషి ఆకృతిలో ఉంటాయి కానీ చాలావరకూ యంత్రాల్లాగే ఉంటాయి. వాటికి భిన్నంగా అచ్చం మనిషిలాగా కన్పించే హ్యూమనాయిడ్‌ రోబో ఇది. దీని కళ్లూ, తలా, చేతులూ మనిషిలానే కదులుతాయి. ఇప్పటివరకూ తయారైన రోబోలన్నిటిలోనూ ఆధునికమైనదీ చురుకైనదీ కూడా. పేరు- అమెకా. బ్రిటన్‌కి చెందిన ఇంజినీర్డ్‌ ఆర్ట్స్‌ అనే సంస్థ తయారుచేసింది. కృత్రిమమేధతో రూపొందించిన ఈ రోబో ప్రత్యేకత ఏమిటంటే- మనిషిలానే స్పందిస్తుంది, హావభావాలను ప్రకటిస్తుంది. నవ్వుతుంది, బాధపడుతుంది, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తుంది, ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. రోబోల తయారీలో కృత్రిమమేధను మరింత ఎక్కువగా వినియోగించడానికి ఒక వేదికగా 'అమెకా' రోబోను తయారుచేసినట్లు సంస్థ చెబుతోంది. కోటి రూపాయల ధర పలుకుతున్న ఈ రోబోని మనకి కావలసిన నైపుణ్యాలతో ప్రత్యేకంగా తయారుచేసి ఇస్తుందట ఈ సంస్థ. ప్రస్తుతానికి అమెకా రోబోని దుబాయ్‌ ప్రభుత్వం కొనుక్కుంది. అక్కడి 'మ్యూజియం ఆఫ్‌ ద ఫ్యూచర్‌'లో అమెకా సేవల్ని వినియోగించుకుంటోంది. మ్యూజియం చూడడానికి వచ్చే సందర్శకులకు 'హలో' చెప్పి వారు ఎటు వెళ్లాలో చెబుతూ గైడ్‌ చేయడం ఈ రోబో పని. ఆ మ్యూజియం సందర్శకులకు ఇప్పుడీ అమెకా ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మడతపెట్టే ల్వాపీలు

ల్యాపీనీ మడతేయొచ్చు!
జేబులో పెట్టుకునే చిన్న ఫోనుని కూడా మడత పెట్టేలా తయారుచేసి దాంట్లోనూ పెద్ద తెర ఆనందాన్ని ఆస్వాదించేలా చేసిన సాంకేతిక నిపుణుల దృష్టి ఇప్పుడిక ల్యాప్‌టాప్‌ మీద పడింది. డెస్క్‌టాప్‌తో పోలిస్తే ఎంత చిన్నగా ఉన్నా ల్యాప్‌టాప్‌ని భద్రంగా వెంట తీసుకెళ్లాలంటే పెద్ద బ్యాగు ఉండాల్సిందే. ఇక ఆ అవసరం లేదంటోంది అసుస్‌ కంపెనీ. ఈ సంస్థ తయారుచేసిన 17 అంగుళాల 'జెన్‌బుక్‌ ఫోల్డ్‌ ఒఎల్‌ఇడి' టచ్‌స్క్రీన్‌ ల్యాప్‌టాప్‌ని మడతపెట్టి పన్నెండు అంగుళాల సైజుకి మార్చేయొచ్చు. నోట్‌బుక్‌లాగా చేత్తో పట్టుకుని వెళ్లిపోవచ్చు. బ్లూటూత్‌తో పనిచేసే డిటాచబుల్‌ కీబోర్డు ప్లస్‌ టచ్‌ప్యాడ్‌తో అప్పటికప్పుడు అన్ని ఫీచర్లూ ఉన్న పవర్‌ఫుల్‌ డెస్క్‌టాప్‌గా మార్చుకోవచ్చు. 12వ తరం ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌, డోల్బీ అట్‌మోస్‌ క్వాడ్‌ స్పీకర్‌ ఆడియో సిస్టమ్‌, 5 మెగాపిక్సెల్‌ ఏఐ వెబ్‌క్యామ్‌, ఫేస్‌ లాగిన్‌ కోసం హెచ్‌డీ ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా, ఆటోమేటిక్‌ బ్రైట్‌నెస్‌ కోసం కలర్‌ సెన్సార్‌, కలర్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌... లాంటివన్నీ దీనిలోని అదనపు హంగులు. 8.7మి.మీ.ల మందంతో ఎంతో నాజూగ్గా కన్పిస్తుంది. తెరని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు. అలాగే మొత్తం సిస్టమ్‌ని ల్యాప్‌టాప్‌గా, డెస్క్‌టాప్‌గా, ట్యాబ్లెట్‌గా, రీడర్‌గా.. ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ తొమ్మిదిన్నర గంటలు పనిచేస్తుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నప్పుడు బయటి శబ్దాలు వినపడకుండా చూసుకుంటుంది. ఫోల్డబుల్‌ గ్యాడ్జెట్స్‌ మార్కెట్‌లో కొత్త సంచలనంగా మారిన అసుస్‌ ల్యాప్‌టాప్‌ ధర మూడున్నర లక్షల దాకా ఉంది.

రంగులు మార్చే కార్లు

రంగులు మార్చే కారు!
ఊసరవెల్లి రంగులు మారుస్తుందని విన్నాం కానీ కారు మార్చడమేమిటీ అంటారా. సాంకేతిక నిపుణులు తలచుకోవాలే కానీ ఏదైనా చేయగలరు. సాధారణంగా కారు రంగు మార్చుకోవాలంటే షోరూమ్‌కి పంపించాలి. అందుకు ఖర్చూ అవుతుంది, సమయమూ పడుతుంది. అలా కాకుండా మీట నొక్కితే కారు రంగు మారిపోతే.. ఈ బీఎండబ్ల్యూ ఫ్లో కారు చూస్తే నిజంగా మీ కళ్లముందు మ్యాజిక్‌ జరిగినట్లే అనుభూతి చెందుతారు. 'ఎలక్ట్రానిక్‌ ఇంక్‌' సాంకేతికతతో దీన్ని తయారుచేసింది జర్మనీ సంస్థ. ఫోనులోని ఆప్‌తో ఒక్క క్లిక్‌ చేస్తే చాలు- కారు బయటివైపు రంగంతా మారిపోతుంది. కావాలనుకుంటే రకరకాల ప్యాటర్న్స్‌లో కూడా రంగులు కనపడతాయి. పార్కింగ్‌లో వెతుక్కోవాల్సిన పనీ ఉండదు. మనం ఆ పరిసరాల్లోకి వెళ్లగానే 'నేనిక్కడున్నా' అని ఫ్లాష్‌ వెలిగి మరీ చెబుతుందట. ఈ పనులన్నిటికీ ప్రత్యేకంగా ఇంధనం ఖర్చవకపోవడం విశేషం. 'మనం అన్ని పనులూ మనకు నచ్చినట్లు చేస్తాం. అటువంటప్పుడు కారు ఎప్పుడూ ఒకే రంగులో ఎందుకుండాలి. మన మూడ్‌కి తగినట్లు అది కూడా మారిపోతే బాగుంటుంది కదా. పైగా బయట ఎండగా ఉంటే తెల్లగా మార్చి వేడి తగలకుండా చూసుకోవచ్చు, అదే వాతావరణం చల్లగా ఉంటే- నల్లగా మార్చి లోపల వెచ్చగా ఉంచుకోవచ్చు' అంటున్నారు తయారీదారులు. ముందు ముందు ఆప్‌తో పనిలేకుండా డాష్‌బోర్డ్‌లోనే స్విచ్‌ పెట్టడమో లేక చేతి సైగతో రంగు మారేలా చూడడమో చేస్తామని కూడా చెబుతున్నారు.

వ్యర్థాలనుంచి తయారు చేసిన వస్త్రం

వ్యర్థం.. వస్త్రమైంది!
వాతావరణ మార్పుల పుణ్యమా అని ప్రపంచమంతా ఇప్పుడు వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగించడం మీద దృష్టి పెట్టింది. ఫిన్‌లాండ్‌కి చెందిన స్పినోవా టెక్నాలజీస్‌ అనే సంస్థ గోధుమ, బార్లీ, వరి లాంటి పంటల వ్యర్థాలతో- వివరంగా చెప్పాలంటే, వాటి గడ్డి నుంచి- దారం తీసి వస్త్రాన్ని తయారుచేస్తోంది. నాణ్యంగా ఉండటమే కాదు, ఇప్పుడు ప్రపంచంలో అందుబాటులో ఉన్న వస్త్రాలన్నిటిలోనూ 'మోస్ట్‌ సస్టెయినబుల్‌' వస్త్రంగా పేరు తెచ్చుకున్న దీని తయారీలో హానికరమైన రసాయనాలు వాడటం లేదు. పత్తి పండించి దాన్ని వస్త్రంగా నేసే క్రమంలో పట్టే నీటితో పోలిస్తే 99 శాతం నీరు ఆదా అవుతుంది. కర్బన వాయువుల విడుదల చాలా తక్కువ. ఎలాంటి మైక్రోప్లాస్టిక్స్‌ లేవు. పాడైపోయిన వస్త్రాన్ని రీసైకిల్‌ చేసి మళ్లీ నూలుగా తయారుచేయవచ్చు. ఒకవేళ పారేసినా త్వరగా భూమిలో కలిసిపోతుంది. ఒక్క వ్యవసాయ వ్యర్థాలే కాదు, కలప వ్యర్థాలూ, వస్త్రపరిశ్రమ వ్యర్థాలూ వేటినైనా ఉపయోగించి నూలుదారాలను తయారుచేసే సాంకేతికతను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. కలపగుజ్జుకి పేరొందిన సుజానో అనే సంస్థతో కలిసి స్పినోవా ఈ కొత్త వస్త్రాన్ని తయారుచేసే కర్మాగారాన్ని నెలకొల్పింది. దీన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి మార్కెట్లో పేరున్న ఫ్యాషన్‌ బ్రాండ్లకు సరఫరా చేస్తోంది. స్పినోవా అందజేస్తున్న ఈ కొత్త నూలుతో ఇప్పుడు ఫ్యాషన్‌ దుస్తుల బ్రాండ్లన్నీ ‘పర్యావరణ మిత్ర’ ఉత్పత్తుల దిశగా అడుగేస్తున్నాయి.

టింబర్‌లైన్‌ సోలార్‌ రూఫింగ్‌ సిస్టమ్‌

పైకప్పే.. పవర్‌!
సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్తు తయారుచేసుకోవడం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అందుకు అవసరమైన సౌరఫలకాలను బిగించడానికి శ్రమా ఖర్చూ ఎక్కువే అవుతాయి. ఆ తర్వాత వాటిని నిర్వహించడమూ పనే. ఒకోసారి బిగించే క్రమంలో పైకప్పుకి నష్టమూ జరగవచ్చు. ఆ ఇబ్బందులేమీ లేకుండా ఇల్లు కట్టేటప్పుడే పైకప్పుతో పాటే సౌరఫలకాల్నీ కలిపి కడితే... ఖర్చూ సమయమూ కలిసి వస్తాయి కదా అనుకుంది అమెరికాకి చెందిన జీఎఎఫ్‌ ఎనర్జీ అనే సంస్థ. 'ఎనర్జీ ఫ్రమ్‌ ఎవ్రీ రూఫ్‌' అన్న నినాదంతో ఈ సంస్థ తయారుచేసిన టింబర్‌లైన్‌ సోలార్‌ రూఫింగ్‌ సిస్టమ్‌ చాలా అడ్వాన్స్‌డ్‌ సాంకేతికతతో కూడుకున్నది. దీనికి సాధారణ సౌర ఫలకాలను వాడరు. మామూలు ఇంటి పైకప్పుకు వాడే పెంకులు, పలకలతో కలిసిపోయేలా సౌరఫలకాలను ప్రత్యేకంగా తయారుచేస్తారు. దాంతో ఎలాంటి ఇంటికైనా వేయదలచుకున్న పైకప్పుతో ఇవి కలిసిపోతాయి. వీటిమీద నీరూ దుమ్మూ ధూళీ నిలవవు కనుక శుభ్రం చేయాల్సిన పనీ ఉండదు. తయారైన కరెంటుని ఇంట్లో వినియోగించుకోవటానికి వైరింగ్‌ ఏర్పాటుచేయడం కూడా తేలిక. ఇండిపెండెంట్‌ ఇళ్లకు యజమాని కోరుకున్నట్లు ఇంటి అందం చెడకుండా, విద్యుత్తు విషయంలో స్వావలంబన సాధించేలా.. రూపొందించిన ఈ పద్ధతికి మంచి ఆదరణ లభిస్తోందట. ఒకేసారి అటు పైకప్పునీ ఇటు సోలార్‌ రూఫ్‌నీ కూడా వేయడంతో వినియోగదారులకు పనీ ఖర్చూ కలిసొస్తున్నాయి.

చిప్​

అంగుళం చిప్‌తో.. అల్ట్రా సౌండ్‌
అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ గురించి మనందరికీ తెలుసు. శరీరం లోపల అవయవాల పనితీరు గురించీ, గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యం గురించీ తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. అవసరాన్ని బట్టి దీన్ని చేసే పద్ధతులూ, పట్టే సమయమూ మారుతుంటాయి. శరీరం మీద ఎక్కడా కోత పెట్టనవసరం లేకుండా లోపలి భాగాలను కంప్యూటర్‌ తెరమీద స్పష్టంగా చూసి తగు చికిత్సలు చేయడానికి ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుంది. అయితే మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు దీనికన్నా ఎంతో సులభంగా, ఎన్నో రెట్లు మెరుగైన ఫలితాలను ఇచ్చే పద్ధతిని కనిపెట్టారు. కాస్త మందమైన స్టాంప్‌ సైజులో ఉండే ఈ ప్యాచ్‌ని శరీరం మీద ఎక్కడైనా అతికించేయొచ్చు. మామూలు అల్ట్రాసౌండ్‌లో ఉండే మొత్తం విధానాన్ని ఈ మీనియేచర్‌ ప్యాకేజ్‌ ఒక్కటే చేయగలగడం విశేషం. దీంట్లోనూ హైడ్రోజెల్‌, ప్రోబ్‌, చిప్‌- అన్నీ ఉంటాయి. స్టికర్‌ లాంటి దాంతో అవన్నీ చర్మాన్ని అంటిపెట్టుకుని ఉండేలా చూస్తారు. గుండె, రక్తనాళాలు, కండరాల సమస్యలు, కడుపు, ఊపిరితిత్తులు... ఏ భాగాన్నయినా సరే నిరంతరం ఫొటోలు తీసి దానిని అనుసంధానించిన కంప్యూటర్‌కి పంపుతుంది. ఎక్కువ సమయం పరీక్ష చేయాల్సి వస్తే ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. తమ పనులు తాము చేసుకుంటూనే 48 గంటలపాటు నిర్విరామంగా పరీక్షించుకోవచ్చు. ఈ పరికరం మెడికల్‌ ఇమేజింగ్‌ రంగానికి గొప్ప వరం అంటున్నారు శాస్త్రవేత్తలు.

కృత్రిమ చేయి

కృత్రిమ చేయూత..
ప్రమాదాల్లో చెయ్యో కాలో కోల్పోయినవారికి అమర్చే కృత్రిమ అవయవాలు కొంతవరకూ తోడ్పడగలవు కానీ సహజమైన అవయవంలా పనిచేయలేవు. ఆ లోటును తీరుస్తుంది న్యూయార్క్‌కి చెందిన ఎస్పర్‌ బయోనిక్స్‌ సంస్థ తయారుచేసిన ఈ ప్రోస్థటిక్‌ హ్యాండ్‌. కృత్రిమమేధ, క్లౌడ్‌ బేస్డ్‌ రోబోటిక్స్‌, ఎలక్ట్రోమయోగ్రఫీ ఆధారంగా పనిచేసే మెదడు-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌(బీసీఐ)ల సాయంతో అచ్చం సహజమైన చెయ్యిలాగా పనిచేస్తుంది. మనం చేత్తో బంతిని పట్టుకోవాలనుకుంటే మెదడు ఆ మేరకు ఇచ్చిన సూచనలను నాడులు చేతి అంచుల దాకా చేరవేస్తాయి కాబట్టి సహజమైన చెయ్యి స్పందించి బంతిని పట్టుకోవటానికి అనుగుణంగా కదులుతుంది. కానీ విరిగిన భాగానికి అతికించిన ఈ కృత్రిమ చేతికి మెదడు ఇచ్చే సంకేతాలు ఎలా తెలుస్తాయన్నదే- దీన్ని గొప్ప ఆవిష్కరణగా మార్చింది. విరిగిన చేయి చివరిదాకా వెళ్లిన సంకేతాలను చర్మం నుంచి గ్రహించేలా- ఈ కృత్రిమ చెయ్యి చర్మానికి అనుసంధానమయ్యే చోట సెన్సార్లను అమర్చారు. వాటి ఆధారంగా చెయ్యి మెదడు సూచనలను గ్రహిస్తుంది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న ప్రోస్థటిక్‌ చేతులకన్నా మూడు రెట్లు వేగంగా- దాదాపు సహజమైన చెయ్యి కదలికలతో సమానంగా ఇది పనిచేస్తుంది. తక్కువ బరువుతో సౌకర్యంగా ఉండే ఈ చేత్తో రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. కారు నడపవచ్చు, వంట చేయొచ్చు, ఫోను వాడొచ్చు. వాడిన కొద్దీ పట్టు మరింత పర్ఫెక్ట్‌గా వస్తుంది. అవసరం లేనప్పుడు తేలిగ్గా తీసి పక్కన పెట్టేయొచ్చు.

వజ్రం

కాలుష్యం.. వజ్రమైంది!
పారదర్శకంగా తళుకులీనే వజ్రాలు భూగర్భంలో గనుల్లో దొరుకుతాయి. అలాంటి వజ్రాలను ఇప్పుడు ప్రయోగశాలలో తయారుచేస్తున్నారని తెలిసే విస్తుపోయింది ప్రపంచం. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేసి ఏకంగా కాలుష్య భరితమైన కర్బనవాయువుని మెరిసే వజ్రపుతునకలుగా తయారుచేసి నివ్వెరపరుస్తున్నారు. కార్బన్‌డై ఆక్సైడ్‌ని సేకరించి వజ్రాలను తయారుచేయడం వల్ల ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు గాలిలో కాలుష్యమూ తగ్గుతుంది, ఇటు మెరిసే వజ్రాలూ వస్తాయి. అదీ ఏకంగా ఒక క్యారట్‌ వజ్రం తయారీకి 20 టన్నుల కార్బన్‌డై ఆక్సైడ్‌ తగ్గిపోతుందంటే- కర్బనవాయువుల నియంత్రణకు ఎంత సులువైన మార్గమిది! రెండు క్యారట్ల వజ్రం కొన్నారంటే రెండున్నరేళ్లపాటు మీరు గాలిలోకి వదిలిన కర్బనాన్ని మీరే తొలగించినట్లు- అని కంపెనీ బల్లగుద్ది చెబుతోంది. న్యూయార్క్‌కి చెందిన ఏథర్‌ అనే కంపెనీ ఈ వజ్రాలను తయారుచేసి విక్రయించడమూ మొదలెట్టింది. ప్రయోగశాలలో తయారుచేసే వజ్రాలకు వాడే విధానాన్నే ఇంకాస్త భిన్నంగా ఇక్కడా వాడుతున్నారు కానీ ముడిసరకుగా కార్బన్‌డై ఆక్సైడ్‌ని తీసుకుంటున్నారు. నగరాల్లో చెత్తను కాల్చేటప్పుడు వెలువడే వాయువుల నుంచి కార్బన్‌డై ఆక్సైడ్‌ను సేకరించి అమ్మే స్టార్టప్‌ల నుంచి దాన్ని కొనుక్కుని వాడుతున్నట్లు సంస్థ చెబుతోంది. తయారైన వజ్రాన్ని చూస్తే అది సహజమైనదా లేక కార్బన్‌డై ఆక్సైడ్‌తో తయారుచేసిందా అన్నది ఎవరూ చెప్పలేరట.

బాడీ స్కానర్​

బాడీని స్కాన్‌ చేస్తుంది..
సాధారణంగా మనం బరువు చూసుకునే పరికరంలా కన్పిస్తున్న ఈ చిన్న మిషన్‌కి అదనంగా ఉన్న హ్యాండిల్‌ని లాగి పట్టుకుని దానిపైన నిలబడితే చాలు.. మొత్తం శరీరానికి సంబంధించి ఎన్నో విషయాలను చెప్పేస్తుంది. మామూలుగా ఏ సమస్య ఉన్నా ఆస్పత్రికి వెళ్లగానే అక్కడి సిబ్బంది బరువూ బీపీ లాంటివన్నీ నమోదుచేసి ఆ తర్వాతే వైద్యుల దగ్గరికి పంపుతారు. అదే ఈ మిషన్‌ ఒక్కటి ఇంట్లో ఉంటే అన్ని పరీక్షలూ ఇంట్లో మనమే చేసుకోవచ్చు. అందుకే దీన్ని కనెక్టెడ్‌ హెల్త్‌ స్టేషన్‌ అంటున్నారు. శరీర బరువుతో పాటు కండరాల పటుత్వమూ నాడీ వ్యవస్థ తీరుతెన్నులూ తెలిసిపోతాయి. ఏ భాగంలో ఎంత కొవ్వు ఉందో, గుండె రక్తనాళాలు ఎలా పనిచేస్తున్నాయో, వ్యాస్కులర్‌ ఏజ్‌ ఎంతో తెలుసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే ఎలా తగ్గించుకోవచ్చో కూడా ఇది చెబుతుంది. ఈసీజీ తీసుకోవచ్చు. దాన్ని నేరుగా డాక్టరుకు పంపి సలహా తీసుకోవచ్చు. దీంట్లో ఉండే సెన్సార్లు పాదాల్లోని స్వేదగ్రంథుల్ని ప్రేరేపించి దానికి చర్మం ఎలా స్పందిస్తోందో చూసి నివేదిక ఇస్తాయి. ఎలక్ట్రోడెర్మల్‌ యాక్టివిటీ స్కోర్‌గా పరిగణించే ఆ నివేదికతో ఓవరాల్‌ హెల్త్‌ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇన్ని పనులు చేసిపెట్టే ఈ మిషన్‌ని ఎనిమిది మంది కుటుంబసభ్యులు ఉపయోగించుకోవచ్చట.

పంక్చరు కాని టైరు

ఈ టైరు.. పంక్చరవదు!
అర్జెంటుగా ఎక్కడికో ప్రయాణమయ్యారు. దారిలో టైరు పంక్చరయింది. చుట్టుపక్కల ఎక్కడా దాన్ని బాగుచేసే మనిషి లేడు. చేతిలో కారు ఉండీ ఫలితం లేనట్లేగా. ఇక ముందు ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదు. గాలి అక్కర్లేని, పంక్చర్‌ అవని టైర్ల తయారీకి ఎంతోకాలంగా జరుగుతున్న పరిశోధన ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చింది. అమెరికాకి చెందిన గుడ్‌ఇయర్‌ టైర్ల కంపెనీ తయారుచేసిన ఈ కొత్త టైర్లను టెస్లా కార్లతో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. 'ప్రస్తుతానికి ఇవి బాగానే పనిచేస్తున్నాయి కానీ కొద్దిగా శబ్దమూ వైబ్రేషనూ గమనించాం. అది కూడా లేకుండా మృదువుగా సాగిపోయేందుకు చేయాల్సిన మార్పుల్నీ చేస్తున్నాం..' అని చెబుతోంది సంస్థ. లేబొరేటరీలో కూడా రోజూ వేర్వేరు వేగాలతో, బరువులతో పెద్ద ఎత్తున వీటిని పరీక్షిస్తూనే ఉన్నారు. 'భవిష్యత్తు విద్యుత్తు వాహనాలదీ, డ్రైవర్‌ లేని అటానమస్‌ వాహనాలదీ. వాటిని తయారుచేసే కంపెనీలు విడిభాగాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి. వాహనాల నిర్వహణ ఖర్చు తగ్గాలంటే- రోడ్డు పరిస్థితిని గుర్తించే సెన్సార్లూ, పంక్చర్‌ కాని, రీసైక్లింగ్‌కి పనికొచ్చే టైర్లూ లాంటివన్నీ కావాలని అడుగుతున్నాయి. అందుకే త్వరలోనే వీటిని మార్కెట్లోకి తేవాలనుకుంటున్నాం' అంటోంది గుడ్‌ఇయర్‌. అసలు గాలి అక్కర్లేని టైర్‌ తయారీకి ఎప్పుడో శ్రీకారం చుట్టి, నిదానంగా నడిచే తేలికపాటి వాహనాలకు 'ట్వీల్స్‌'ని తయారుచేస్తున్న మిషెలిన్‌ సంస్థ కూడా ఈ దిశగా కృషి చేస్తోంది.

వాటర్‌లైట్‌

ఉప్పునీటి వెలుగులు..
కరెంటు లేనిదే క్షణం గడవని పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఉన్నా, ఇంకా ఆ కరెంటు సౌకర్యం లేని ప్రజలు 84 కోట్ల మంది ఉన్నారంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవారు కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారికి వరం అనదగ్గ పరికరం- ఉప్పునీటితో వెలిగే 'వాటర్‌లైట్‌'. వండర్‌మ్యాన్‌ థామ్సన్‌ కొలంబియా, ఇ-డినా సంస్థలు కలిసి దీన్ని తయారుచేశాయి. కేవలం అరలీటరు నీటితో 45 రోజులపాటు నిర్విరామంగా వెలుగుల్ని పంచుతుంది. మినీ పవర్‌ జనరేటర్‌లా పనిచేసే దీంతో మొబైల్‌ ఫోన్‌నీ చార్జింగ్‌ చేసుకోవచ్చు. సౌరశక్తితో తయారయ్యే లైట్లు వాతావరణం అనుకూలించనప్పుడు ఉపయోగపడవు. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా తయారుచేయాలన్న ఆశయంతో మొదలుపెట్టిన ప్రయోగాలు సఫలమై వాటర్‌లైట్‌ని అందుబాటులోకి తెచ్చాయి. దీనికి సమయం కూడా పట్టదు. నీరు నింపడం ఆలస్యం లైటు వెలుగుతుంది. నీటిలో ఉన్న ఎలక్ట్రోలైట్స్‌- పరికరంలో ఉన్న మెగ్నీషియం, కాపర్‌ ప్లేట్స్‌తో రియాక్ట్‌ అవడంతో విద్యుత్తు పుట్టి లైటు వెలుగుతుంది. ఇలా ఉప్పునీటితో విద్యుత్తు తయారుచేయొచ్చన్నది ఎప్పటినుంచో తెలిసిన విషయమే అయినా ఆ ప్రక్రియని దీర్ఘకాలం నిలబెట్టే సాంకేతికతను తయారుచేసి పేటెంట్‌ పొందింది ఇ-డినా సంస్థ. రోజుల తరబడి సముద్రం మీద ఉండే మత్య్సకారులకు ఇది గొప్ప వరమే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.