Google Inactive Account : గూగుల్ కంపెనీ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు నూతన విధానాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. చాట్‌జీపీటీ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి, మారుతున్న కాలానికి అనుగుణంగా పద్ధతులు, పాలసీలు, టెక్నాలజీ ఇతర అంశాల్లో తనను తాను నూతన పరుచుకుంటుంది. ఈ నెలలో అమెరికా కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన వార్షిక డెవలపర్ సమావేశంలో కొన్ని కొత్త ఉత్పత్తులను లాంఛ్ చేయడమే కాకుండా పలు కీలక ప్రకటనలు చేసింది.
అయితే గూగుల్.. మిలియన్ల కొద్ది ఉన్న తమ యూజర్ల కోసం తాజాగా మరికొన్ని ప్రకటనలు చేసింది. ఇనాక్టివ్ అకౌంట్స్ పాలసీల్లో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం.. రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వినియోగంలో లేని ఖాతాల (Google Inactive Account)ను డిలీట్ చేయనున్నట్లు తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల సమాచార భద్రతను పెంచడం, సైబర్ నేరాల ముప్పు నుంచి కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
గూగుల్ ఇలా ఎందుకు చేస్తోంది..?
గూగుల్ 2020లో ఇనాక్టివ్ అకౌంట్స్ కంటెంట్‌ని తొలగిస్తామని ప్రకటించింది. కానీ ఆ అకౌంట్స్‌ని పూర్తిగా డిలీట్ చేయలేదు. అయితే ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. గూగుల్ ఇలా ఎందుకు చేస్తుందంటే.. 2 స్టెప్ వెరిఫికేషన్ సెటప్ చేయడానికి ప్రస్తుతమున్న యాక్టివ్ అకౌంట్స్ కంటే ఇనాక్టివ్ అకౌంట్స్ పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తమ అంతర్గత విశ్లేషణల్లో వెల్లడైంది. దీని వల్ల ప్రమాదం వాటిల్లే స్పామ్, ఇతర హానికరమైన కంటెంట్ కోసం ఆ ఖాతాలను ఉపయోగించే అవకాశముందని ఆ పోస్టులో రాసుకొచ్చింది.
అకౌంట్‌తో పాటు ఇవి కూడా డిలీట్!
గూగుల్ ఖాతాతో పాటు అందులోని కంటెంట్‌ను పూర్తిగా తొలగించనుంది. అందులో గూగుల్ వర్క్ స్పేస్ అంటే జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ డ్రైవ్, గూగుల్ మీట్, గూగుల్ క్యాలెండర్, గూగుల్ ఫొటోస్‌తో పాటు యూట్యూబ్ ఉన్నాయి. మరి అన్ని అకౌంట్లకు ఇది వర్తిస్తుందా అంటే లేదు. పర్సనల్ గూగుల్ అకౌంట్లను మాత్రమే తొలగించనుంది. స్కూళ్లు, వ్యాపార సంస్థలకు చెందిన అకౌంట్లకు ఇది వర్తించదు. ఈ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబరు నుంచి ప్రారంభమవతుందని వెల్లడించింది.
మనకెలా తెలుస్తుంది..?
ఈ విషయం యూజర్లకు ఎలా తెలుస్తుందని చాలా మందికి సందేహం రావచ్చు. ఈ విషయంలో గూగుల్ క్లారిటీ ఇచ్చింది. ఈ తొలగింపు ప్రక్రియ దశల వారీగా జరుగుతుందని తెలిపింది. మొదటగా.. ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసి మళ్లీ వాడని వాటిని తీసేస్తామని వివరించింది. తరువాత మిగతా వాటిని తొలగిస్తామని చెప్పింది. అకౌంట్‌ను డిలీట్ చేసే ముందు ఆ ఖాతాకు దీనికి సంబంధించిన సమాచారం జీమెయిల్‌కు, రికవరీ మెయిల్‌కు పలుమార్లు సందేశాలు అందిస్తామని తెలిపింది.