కొత్త పీసీని కొన్నప్పుడు.. విండోస్‌ను రీఇన్‌స్టాల్ చేసినప్పుడు అందరూ ముందుగా చేసే పని యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయటం. అద్భుతమైన విండోస్ పోగ్రామ్‌లు చాలానే ఉన్నాయి. వీటిల్లో విండోస్ 10, విండోస్ 11కు తప్పనిసరి సాఫ్ట్‌వేర్లు ఏంటనేవి తెలుసుకొని ఉండటం మంచిది. ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్, క్లౌడ్ స్టోరేజీ కోసం గూగుల్ డ్రైవ్ వంటి వాటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీటితో పాటు మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడే మరికొన్ని యాప్స్ గురించి తెలుసుకుందాం.
ఆఫీస్ సూట్: లీబ్రాఫీస్
డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్ల వంటివి అనగానే ముందుగా గుర్తుచ్చేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్. దీన్ని డబ్బులు చెల్లించి కొనుక్కోవాల్సిందే. మరి ఉచితంగా ఆఫీస్ సూట్‌ను వాడుకోవాలంటే? లీబ్రాఫీస్ చక్కని మార్గం. ఇది పూర్తిగా ఉచితం. మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, యాక్సెస్ వంటి వాటికి మంచి ప్రత్యామ్నాయం. చూడటానికి ఎంఎస్ ఆఫీస్ కన్నా కాస్త భిన్నంగా ఉండొచ్చు గానీ త్వరగానే అలవడుతుంది. ఒకప్పుడు ఎంఎస్ ఆఫీస్‌కు ఓపెన్ ఆఫీస్ ప్రత్యామ్నాయంగా బాగా ఆదరణ పొందింది. ప్రస్తుతం దీన్ని పెద్దగా వాడటం లేదు. ఒకవేళ లీబ్రాఫీస్ వద్దనుకుంటే ఫ్రీఆఫీస్‌ను ప్రయత్నించొచ్చు. వర్డ్ ఆన్‌లైన్, గూగుల్ డాక్స్‌లనూ వాడుకోవచ్చు.
ఇమేజ్ ఎడిటర్: పెయింట్.నెట్
ఫొటోలను ఆకర్షణీయంగా కనిపించేలా చేయటానికి, సున్నితమైన అంశాలను మసకగా చేయటానికి, పాత ఫొటోలను కొత్తగా తీర్చిదిద్దటానికి ఇమేజ్ ఎడిటింగ్ ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం తప్పనిసరి. ఇలాంటి పనులకు ఫొటోషాప్‌నే ప్రామాణికంగా పరిగణిస్తుంటారు. కానీ ఉచిత టూల్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పెయింట్.నెట్ ఒకటి. మైక్రోసాఫ్ట్ పెయింట్ కన్నా ఇది మెరుగైంది. వాడుకోవటమూ తేలికే. ఫొటోలోని భాగాలను ఇట్టే బ్లర్ చేసుకోవచ్చు. ఆటో-లెవెల్ ఫీచర్‌తో ఫొటోలను మరింత ఆకర్షణీయంగా మలచుకోవచ్చు. టెక్స్ట్, ఆకారాలను జోడించుకోవచ్చు. ప్లగిన్స్‌తో ఇంకాస్త ఎక్కువ ఫీచర్లను వాడుకోవచ్చు. పెయింట్.నెట్ మరీ ప్రాథమిక స్థాయిలో ఉందనిపిస్తే జీఐఎంపీని ప్రయత్నించొచ్చు. ఇదింకాస్త అధునాతమైంది. ఇదీ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది.
స్క్రీన్‌షాట్స్: షేర్‌ఎక్స్
విండోస్ మీద స్క్రీన్‌షాట్ తీసుకోవటం చాలావాటికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం స్నిప్పింగ్ టూల్, స్నిప్ అండ్ స్కెచ్ యాప్స్ ఉన్నాయి గానీ వీటిల్లో ఫీచర్లు తక్కువ. అదే షేర్‌ఎక్స్‌లోనైతే బోలెడన్ని క్యాప్చర్ పద్ధతులు ఉంటాయి. దీనిలోని బిల్టిన్ ఎడిటర్ ఫీచర్ స్క్రీన్‌షాట్ తీసుకున్నాక దానంతటదే మెరుగులు దిద్దుతుంది. కలర్ గ్రాబర్, రూలర్ వంటి ఫీచర్లనూ వాడుకోవచ్చు. ఒకవేళ షేర్‌ఎక్స్ వద్దనుకుంటే పిక్‌పిక్ యాప్‌ను ప్రయత్నించొచ్చు. చూడటానికి మామూలుగా కనిపించినా ఫీచర్ల విషయంలో రాజీ పడదు.
మెసేజింగ్: రాంబాక్స్
వాట్సప్, ఫేస్‌బుక్, మెసెంజర్, స్కైప్, టెలిగ్రామ్, గ్రూప్‌మీ, డిస్‌కార్డ్.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో మెసేజింగ్ యాప్‌లు. ఎన్నెన్నో నోటిఫికేషన్లు. అన్నీ చూడాలంటే ఒకో యాప్ తెరచుకుంటూ పోవాల్సిందే. మరి అన్నీ ఒకేచోట ఉంటే? రాంబాక్స్ అలాంటి అవకాశమే కల్పిస్తుంది. విండోలో అన్నింటినీ ఒకే చోట గుదిగుచ్చి ట్యాబ్‌ల వారీగా చూపిస్తుంది.
సెక్యూరిటీ: మాల్వేర్‌బైట్స్ యాంటీ-మాల్వేర్
విండోస్ 10, విండోస్ 11లలో డిఫాల్ట్‌గానే విండోస్ డిఫెండర్ ఉంటుంది. ఇది యాంటీవైరస్‌గా బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనికి అదనంగా మరో సెక్యూరిటీ ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ఎంతైనా మంచిది. ఈ విషయంలో మాల్వేర్‌బైట్స్ మంచి ఎంపిక. యాంటీ వైరస్ ప్రోగ్రామ్ పట్టుకోలేని మాల్వేర్లను దీని ఉచిత వర్షన్‌తోనే స్కాన్ చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్లు కావాలనుకుంటే ప్రీమియం వర్షన్‌కు అప్‌డేట్ కావొచ్చు.
మీడియా ప్లేయర్: వీఎల్‌సీ
యూట్యూబ్ విస్తృతితో ఇప్పుడు పీసీల్లో వీడియోలను చూడటానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. కానీ డెస్క్‌టాప్‌లో మంచి వీడియో ప్లేయర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. పీసీలోని వీడియోలను చూడటానికిది తప్పనిసరి. చాలామంది కొత్త పీసీలో అప్పటికప్పుడు వీడియో ప్లేయర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటానికి ఇష్టపడకపోవచ్చు గానీ ఏదో ఒకరోజు దీని అవసరం రావొచ్చు. ఇందుకోసం వీఎల్‌సీ మీడియా ప్లేయర్ మంచి ఎంపిక. బోలెడన్ని ఫీచర్లు దీని సొంతం. ఎలాంటి వీడియో, ఆడియో ఫైల్‌నైనా ప్లే చేస్తుంది.
పాస్‌వర్డ్ మేనేజర్: బిట్‌వార్డెన్
ప్రతీ ఖాతాకు కఠినమైన పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవటం, వాటిని గుర్తుంచుకోవటం ఎవరికైనా అసాధ్యమే. ఇలాంటప్పుడే పాస్‌వర్డ్ మేనేజర్ అవసరం గుర్తుకొస్తుంది. ఇది సురక్షితం. పటిష్ట పాస్‌వర్డ్‌లను సృష్టిస్తుంది. ఒకే పాస్‌వర్డ్ కింద వాటిని లాక్ చేసేస్తుంది. ఈ ఒక్కదాన్ని గుర్తుంచుకుంటే చాలు. ఉచిత పాస్‌వర్డ్ మేనేజర్ కావాలంటే బిట్‌వార్డెన్ మంచి ఎంపిక. డెస్క్‌టాప్ యాప్‌తో పాటు బ్రౌజర్‌లో దీని ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మరింత సులభంగా పాస్‌వర్డ్‌లను రక్షించుకోవచ్చు, వాడుకోవచ్చు.