Diwali Special Dishes and Its Making Process in Telugu : దీపావళి పండగ అంటేనే.. దీపాల వెలుగు.. బాణాసంచా మోతలు, పిండి వంటలు ఘుమఘుమలు. ఈ పర్వదినాన ఎలాంటి రెసిపీలు చేసినప్పటికీ.. తప్పకుండా స్వీట్స్ ఉండి తీరాల్సిందే. కుటుంబ సభ్యులు ఇష్టంగా ఆరగించడంతోపాటు.. బంధుమిత్రులకు కూడా వీటిని పంచి పెడతారు. అయితే.. బయట కొనితెచ్చే స్వీట్స్ కన్నా.. ఇంట్లో తయారు చేసినవే.. ఫ్రెష్‌గా, సూపర్ టేస్టీగా ఉంటాయి. సో.. ఈ రెసిపీలను ఓ సారి ట్రై చేయండి.
మిల్క్ పౌడర్ బర్ఫీ:
కావాల్సిన పదార్థాలు:
- పాలపొడి - కప్పు,
- పాలు - పావు కప్పు,
- చక్కెర పొడి- 1/3 కప్పు,
- నెయ్యి- మూడు చెంచాలు,
- బాదం, జీడిపప్పు పలుకులు- రెండు చెంచాలు,
- కుంకుమ పువ్వు- చిటికెడు
దీపావళి రోజున ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే.. సిరిసంపదలు మీ సొంతం!
తయారీ విధానం:
- స్టౌ వెలిగించి నాన్‌స్టిక్ ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని వేడెక్కాక, అందులో చెంచా నెయ్యి, పాలు పోసుకోవాలి.
- అవి కాస్త వేడెక్కాక కొద్దికొద్దిగా పాలపొడిని వేస్తూ ఉండల్లేకుండా లేకుండా బాగా కలపాలి.
- తరువాత చక్కెర కూడా వేసి కలపాలి.
- మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు అందులో రెండు చెంచాల నెయ్యి వేసి, స్టౌ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు.. వెడల్పాటి ప్లేటుకు నెయ్యి రాసి దానిపై ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా పరుచుకొనేటట్టు గరిటెతో సర్దుకోవాలి.
- ఆపై కుంకుమపువ్వు, బాదం పలుకులు చల్లి, గది ఉష్ణోగ్రత దగ్గరే ఓ గంటపాటు పక్కన పెట్టుకోవాలి.
- చివరగా దాన్ని సమాన ముక్కలుగా కట్ చేసుకుంటే పాలపొడి బర్ఫీ రెడీ.
దీపావళి స్పెషల్ గ్రీటింగ్స్ - మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి!
కొబ్బరి లడ్డు:
కావాల్సిన పదార్థాలు:
- కొబ్బరి తురుము- రెండు కప్పులు,
- చక్కెర- కప్పు,
- పాలు- కప్పు,
- యాలకుల పొడి- చెంచా,
- బాదం పలుకులు- చెంచా,
- జీడి పప్పులు- ఆరు,
- ఎండుద్రాక్ష- కొన్ని
తయారీ విధానం:
- స్టౌ వెలిగించి.. నాన్‌స్టిక్ పాన్‌లో ముందుగా కొబ్బరి తురుము వేయించుకోవాలి.
- తర్వాత పాలు, పంచదార కూడా వేసి దగ్గరకొచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
- చివరగా ఈ మిశ్రమంలో యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- కాస్త చల్లారాక అంటే గోరువెచ్చగా ఉండగానే నేతిలో వేయించిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలని కలిపి లడ్డూలు చుట్టుకుంటే రుచికరమైన కొబ్బరి లడ్డూలు సిద్ధం.
దీపావళి టపాసులు - మీ పెంపుడు జంతువుల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
డైమండ్ చిప్స్:
కావాల్సిన పదార్థాలు:
- మైదా పిండి-పావుకిలో
- బియ్యపిండి-50 గ్రాములు
- వాము- టీస్పూన్
- ఉప్పు-రుచికి సరిపడా
- డాల్డా లేదా నెయ్యి-50 మి.లీ.
- నూనె-వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా ఒక గిన్నెలో పావుకిలో మైదా తీసుకోండి.
- ఈ పిండిలో 50 గ్రాములు బియ్యం పిండి, ఓ టీ స్పూన్ నలిపిన వాము, రుచికి సరిపడా సాల్ట్, 50 మిల్లీ లీటర్లు కరిగించిన డాల్డా లేదా నెయ్యి వేసి పిండిని పొడి పొడిగా కలుపుకోవాలి. (అంటే బ్రెడ్ పొడిలా)
- తర్వాత నీళ్లు కలుపుకుంటూ పిండిని గట్టి ముద్ద అయ్యేవరకు కలపాలి.
- కలిపిన పిండిని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత పిండిని మీడియం సైజులో ముద్దలుగా చేసుకోని.. పొడి పిండి చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి.
- తర్వాత ఓ చాకు తీసుకోని.. పిండిని డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి (మరీ పెద్దగా ఉండొద్దు.. చిన్నగా ఉండొద్దు)
- తర్వాత కట్ చేసిన వాటిని ఓ ప్లేట్లోకి వేసుకోండి.(గుర్తుంచుకోండి కట్ చేసిన డైమండ్లను కుప్పగా పెట్టొద్దు)
- తర్వాత కట్ చేసుకున్న డైమండ్స్‌ను నూనెలో వేసి వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లోనే వీటిని వేయించుకోవాలి.
- డైమండ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఓ చిల్లుల గిన్నెలోకి తీసుకుని.. గాలికి ఆరనివ్వాలి.
- ఎందుకంటే ఇవి వేడి మీద మెత్తగా ఉంటాయి. ఓ రెండు గంటల తర్వాత క్రిస్పీగా అవుతాయి.
- మరో విషయం వీటిని గోధుమపిండితో కూడా చేసుకోవచ్చు.
దీపావళిని ఐదు రోజుల పండగంటారు?-ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి!