ఎన్నికలు లేనిదే ప్రజాస్వామ్యం లేదు. అందుకే వాటిని స్వేచ్ఛగా, సక్రమంగా జరిపే గురుతర బాధ్యతను రాజ్యాంగం కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) కట్టబెట్టింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), జాతీయ షెడ్యూల్డ్ కులాలు, తెగల కమిషన్లలా ఎన్నికల సంఘమూ స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ. ఎన్నికల సంఘం ఏలినవారి కనుసన్నల్లో నడుస్తూ స్వతంత్రంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి పారదర్శకమైన పద్ధతి లేకపోవడంతో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ముప్పిరిగొంటున్నాయి.
శేషన్‌లా ఇంకెవరు?
స్వాతంత్య్రం వచ్చిన తరవాత దేశానికి ఒకే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఉండేవారు. సువిశాల దేశహితం కోసం పరిశ్రమించిన తొలితరం నేతల హయాము తరవాత రాజ్యాంగ విలువలను కుళ్లబొడిచే దుర్విధానాలు మొగ్గతొడిగాయి. అంతులేని అక్రమాలతో క్రమేణా ఎన్నికలు ప్రహసనప్రాయమయ్యాయి. నేతల పెడపోకడలను కట్టడి చేయాల్సిన ఈసీ- ప్రజాస్వామ్య విధ్వంసానికి మౌన ప్రేక్షకురాలు అయ్యింది. 1990 డిసెంబరు నుంచి 1996 డిసెంబరు వరకు సీఈసీ పదవిలో ఉన్న టీఎన్ శేషన్- ఎన్నికల నిర్వహణలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు.
ఈసీ స్వయంప్రతిపత్తి, సమగ్రతలను నిలబెట్టారు. ఓటుహక్కు విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పార్టీలు, నేతల అడ్డగోలు ధోరణులకు అడ్డుకట్ట వేశారు. ఆయన దూకుడును నియంత్రించేందుకు ఏకసభ్య ఎన్నికల సంఘాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం త్రిసభ్య సంఘంగా మార్చింది. ఆ తరవాతి నుంచి నియమితులైన ఎన్నికల కమిషనర్లు ఎవరైనా, వారంతా పూర్తి నిష్పాక్షికంగా వ్యవహరించారని చెప్పలేం. ఎన్నికల కమిషనర్ల ఎంపికకు కొలీజియం వంటి వ్యవస్థను నెలకొల్పాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను విచారిస్తూ శేషన్ గొప్పతనాన్ని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసెఫ్ తాజాగా గుర్తుచేసుకున్నారు.
రాజకీయ జోక్యానికి లొంగకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా శేషన్ నడచుకున్నారని, అటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ మళ్ళీ రావాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల అరుణ్ గోయెల్‌ను ఎన్నికల కమిషనర్‌గా మెరుపు వేగంతో నియమించడాన్ని జస్టిస్ జోసెఫ్ అధ్యక్షతలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ పదవి కోసం గోయెల్‌తో పాటు మొత్తం నలుగురి పేర్లతో కేంద్ర న్యాయశాఖ ఒక్కరోజులోనే జాబితా సిద్ధం చేసింది. నవంబరు 18న ఆ దస్త్రాన్ని ప్రధానమంత్రికి పంపగా, వాళ్లలో గోయెల్‌ను అదేరోజు ఎంపిక చేశారు.
ఆపై 24 గంటల్లోనే గోయెల్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్నికల కమిషనర్‌గా గోయెల్‌ను ఇంత హడావుడిగా నియమించడమేమిటని సుప్రీంకోర్టు నిగ్గదీసింది. ఆయన సామర్థ్యాన్ని తాము ప్రశ్నించడం లేదని, నియామక ప్రక్రియ గురించే తాము మాట్లాడుతున్నామని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ఉద్దేశించిన ప్రకారం ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
దేశ ప్రధానిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోగల సమర్థతను ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రదర్శించాలని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. సీనియారిటీ రీత్యా అరుణ్ గోయెల్ 2025లో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా పదోన్నతి పొందే అవకాశం ఉంది. రాజకీయ ప్రభావం నుంచి సీఈసీని, ఎన్నికల కమిషనర్లను తప్పించాలని; సీఈసీ స్వతంత్రంగా, సొంత వ్యక్తిత్వంతో వ్యవహరించాలే తప్ప అధికారంలో ఉన్నవారికి తలొగ్గే చందంగా ఉండరాదన్న సుప్రీం ధర్మాసనం ఉద్ఘాటన స్వాగతించదగినది.
ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక చట్టం తీసుకురాకపోవడం- రాజ్యాంగ నిర్మాతల అభీష్టాన్ని ధిక్కరించడమే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కమిషనర్ల ఎంపికకు స్వతంత్ర సంఘాన్ని ఏర్పరచాలని సుప్రీం ధర్మాసనం ప్రతిపాదించింది. అది రాజ్యాంగపరంగా చెల్లుబాటు కాదని సర్కారు వాదిస్తోంది. ప్రభుత్వం చేయాల్సిన పనిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని అది అభిప్రాయపడుతోంది.
ఎంపిక సంఘం అత్యావశ్యకం
ఎన్నికల సంఘం తటస్థత, విశ్వసనీయతలపై ప్రజావిశ్వాసం బలోపేతం కావాలంటే- ప్రత్యేక ఎంపిక సంఘం ద్వారా కమిషనర్లను నియమించాలని మాజీ సీఈసీ బీబీ టాండన్ సూచించారు. ఆ మేరకు ఆయన నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు లేఖ సైతం రాశారు. కమిషనర్‌గా నవీన్ చావ్లా నియామకం వివాదాస్పదం అయినప్పుడు నాటి భాజపా అగ్రనేతలు ఎల్‌కే ఆడ్వాణీ, అరుణ్ జైట్లీ- టాండన్ ప్రతిపాదనను గుర్తుచేశారు. ఎన్నికల కమిషనర్ల ఎంపికలో పారదర్శక విధానాలను అనుసరించాలని తార్కుండే కమిషన్ ఏనాడో సూచించింది.
దినేశ్ గోస్వామి కమిటీ సైతం కమిషనర్ల ఎంపికకు ఒక ప్రత్యేక సంఘం ఉండాలని ఉద్ఘాటించింది. సుప్రీంకోర్టు కొలీజియం పద్ధతిలో ఎన్నికల కమిషనర్ల నిర్ణాయక సంఘం రూపుదిద్దుకోవాలని పాలనా సంస్కరణలపై ఏర్పాటైన రెండో కమిషన్ అభిప్రాయపడింది. దేశ ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత లేదా ప్రతిపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యుడైన నాయకుడు సభ్యులైన సంఘం ద్వారానే ఎన్నికల కమిషనర్లను నియమించాలని మూడున్నర దశాబ్దాల క్రితమే రాజకీయ పక్షాలన్నీ గళమెత్తాయి.
ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన సంఘం ద్వారా కమిషనర్ల నియామకాలను చేపట్టాలని భారతీయ న్యాయసంఘమూ ఏడేళ్ల క్రితం సిఫార్సు చేసింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర వహించాల్సిన ఈసీ నిష్పాక్షికత ప్రశ్నార్థకం కావడం ఆందోళనకరం. ఆ పరిస్థితిని పరిహరించాలంటే- కమిషనర్ల ఎంపిక విధానాన్ని తక్షణం సంస్కరించాల్సిందే!
నవీన్ చావ్లాపై వ్యతిరేకత
యూపీఏ జమానాలో 2005లో ఎన్నికల కమిషనర్‌గా నవీన్ చావ్లా నియామకం తీవ్ర వివాదాస్పదమైంది. ఐఏఎస్ అధికారి అయిన చావ్లా- అత్యవసర పరిస్థితి సమయంలో సంజయ్ గాంధీకి సొంత మనిషిగా మెలిగినట్లు అపకీర్తి మూటగట్టుకున్నారు. నిజాయతీగా పనిచేయాల్సిన ఏ పదవికీ ఆయన అర్హుడు కాడని షా కమిషన్ సైతం స్పష్టం చేసింది. అయినా మన్మోహన్ సర్కారు ఆయనను ఎన్నికల సంఘంలో కొలువుతీర్చింది.
కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన చరిత్ర ఉన్న నవీన్ చావ్లాను ఈసీ నుంచి తొలగించాలని భాజపా నాడు గళమెత్తింది. ఆ మేరకు ఎన్‌డీఏ రాష్ట్రపతికి వినతి పత్రమూ సమర్పించింది. చావ్లా తొలగింపును కోరుతూ భాజపా అప్పట్లో సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించడమే కాదు, అలా పనిచేస్తున్నట్లు కనిపించాలని కమల దళం ఆనాడు స్పష్టీకరించింది. అలాంటిది నేడు భాజపా హయాములోనే ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు ఉదయిస్తుండటం విస్మయకరం!
-ఏఏవీ ప్రసాద్