ETV Bharat / opinion

5G In India: అయిదోతరం.. ఆందోళన తరంగం - భారత్​లో 5జీ సాంకేతికత

5జీ సాంకేతిక సేవల విషయంలో భారత్​లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ క్యాన్సర్‌ పరిశోధన సంస్థ.. 2011లో వెలువరించిన ఒక నివేదిక 5జీ సాంకేతికత పట్ల భయానికి బీజం వేసింది. మొబైల్‌ ఫోన్లు వాడే విద్యుదయస్కాంత ఫ్రీక్వెన్సీల (ఈఎంఎఫ్‌) వల్ల మానవులకు క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది.

5G network
5జీ నెట్​వర్క్
author img

By

Published : Jun 22, 2021, 9:32 AM IST

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే ప్రపంచంలో 61 దేశాల్లో 5జీ(5G In India) నెట్‌వర్కులు వాణిజ్య ప్రాతిపదికపై పని చేస్తున్నాయని అంతర్జాతీయ మొబైల్‌ సరఫరాదారుల సంఘం (జీఎస్‌ఏ) ప్రకటించింది. భారత్‌లో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు ఇటీవల 5జీ ప్రయోగాలు ప్రారంభించినా వాణిజ్య స్థాయి సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇంతలో మాజీ సినీ నటి, పర్యావరణ ఉద్యమకారిణి జుహీచావ్లా భారత్‌లో 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టకూడదంటూ బాంబే హైకోర్టులో దావా వేశారు. 5జీ సాంకేతికత వల్ల వెలువడే రేడియో ధార్మికత మానవులు, పశుపక్ష్యాదుల ఆరోగ్యానికి హానికరమని ఆమె వాదించారు.

అయితే, ఈ భావన ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదు. ఇలాంటి భయాలకు తోడు అనేక విడ్డూరపు వార్తలూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని- కొవిడ్‌ టీకాలలో 5జీ మైక్రోచిప్స్‌ ఉంటాయని, కొవిడ్‌ మహమ్మారి మూలాలను కప్పిపుచ్చడానికే 5జీ సాంకేతికతను ప్రపంచం మీదకు వదులుతున్నారని పేర్కొంటున్న వార్తలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇవన్నీ బోగస్‌ వార్తలని వేరే చెప్పక్కర్లేదు.

ఆ కిరణాలు వెలువడి..

అసలు సెల్‌ఫోన్లు జనం చేతుల్లోకి వచ్చినప్పటి నుంచే కొన్ని భయాలు రాజ్యమేలుతున్న మాట నిజం. సెల్‌ఫోన్ల వల్ల, సెల్‌ టవర్ల వల్ల రేడియో ధార్మిక కిరణాలు వెలువడి రకరకాల క్యాన్సర్లకు కారణవుతాయనేది చాలాకాలంగా వ్యక్తమవుతున్న ఆందోళన. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు 5జీ వల్ల వెలువడే రేడియేషన్‌ ప్రమాదకరమా కాదా అన్నది తేల్చే పరిశోధనకు ఆదేశించాలని జుహీచావ్లా హైకోర్టును కోరారు.

ఎలా పని చేస్తుంది?

వైర్‌లెస్‌ సాంకేతిక పరిజ్ఞానంలో అత్యంత ఆధునికమైనది- అయిదో తరం (5జీ) నెట్‌వర్క్‌ సాంకేతికత. 4జీ, 3జీలకన్నా ఎంతో వేగంగా, సమర్థంగా సందేశాలు, సమాచారాలను పంపడానికి 5జీలో అధిక శక్తిమంతమైన విద్యుదయస్కాంత ఫ్రీక్వెన్సీలను (ఈఎంఎఫ్‌) వాడతారు. వీటి సాయంతో 4జీ కన్నా 5జీలో అత్యంత వేగంతో విస్తృత సమాచారం చేరవేయవచ్చు. డ్రైవర్‌ లేని కార్లు, వర్చువల్‌ రియాలిటీ సాధనాలు, సీసీటీవీలకు 5జీ పరిజ్ఞానం ఎంతో కీలకమైనది. 5జీ ద్వారా మెరుపు వేగంతో అందే సందేశాలు టెలీమెడిసిన్‌, టెలీ శస్త్రచికిత్సలను సుసాధ్యం చేస్తాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)లో బాగా దగ్గర్లోని యంత్రాలు, పరికరాలను అనుసంధానించి పని చేయించడానికి 5జీ సాంకేతికత తోడ్పడుతుంది. 4జీ, 3జీ నెట్‌వర్కులు సంకేతాలను అన్ని దిక్కులకూ ప్రసారం చేస్తే, 5జీ దట్టమైన కాంతిపుంజంలా సంకేతాలను నేరుగా వేగంగా అనుసంధానిత పరికరాలకు పంపుతుంది. దీనికోసం గతంలోకన్నా ఎంతో ఎక్కువగా 5జీ సెల్‌ టవర్లను, భూతల ట్రాన్స్‌మిటర్లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యంపై ఆందోళన..

నగరాలు, పట్టణాలైతే 5జీ నెట్‌వర్కు టవర్లు, ట్రాన్స్‌మిటర్లతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. అవన్నీ కలిసి వెలువరించే రేడియేషన్‌ ఆరోగ్యానికి హానికరమని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇందులో నిజమెంతో నిగ్గుతేల్చడానికి గతంలో పరిశోధనలు ప్రధానంగా ఎలుకలపై జరిగాయే తప్ప మనుషులపై కాదని గుర్తించాలి. 5జీతో సహా అన్ని మొబైల్‌ నెట్‌వర్కుల ద్వారా వెలువడే రేడియేషన్‌ సూర్యకాంతితో ఏర్పడే రేడియేషన్‌ కన్నా తక్కువ శక్తిమంతమైనది. ఈ నెట్‌వర్కులతో పోలిస్తే ఎక్స్‌రే యంత్రాలు, స్కానర్లు ఎక్కువ శక్తిమంతమైన రేడియేషన్‌ను వెలువరిస్తాయి. నిజానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు, కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా లైన్ల్లతోపాటు కరెంటును ఉపయోగించే ఏ పరికరమైనా సరే విద్యుదయస్కాంత ఫ్రీక్వెన్సీలను (ఈఎంఎఫ్‌) వెలువరిస్తుంది. 5జీ టవర్లకన్నా ఇలాంటి పరికరాల సంఖ్యే ఎల్లప్పుడూ ఎంతో అధికంగా ఉంటుంది.

5జీ నెట్‌వర్కులు వాడే నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలపైకన్నా మొత్తం విద్యుదయస్కాంత ఫ్రీక్వెన్సీల ప్రభావం మీదే ఎక్కువ పరిశోధనలు జరిగాయి. ఈఎంఎఫ్‌ వల్ల మానవ కణజాలం కాస్త వేడెక్కుతుందని, వయసు మీరిన వారిలో ఇది కొంత ఎక్కువగా సంభవిస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. అయితే, ఇది తాత్కాలిక, కనీస పరిణామం మాత్రమే. ప్రజలు ప్రతిరోజూ ఎంతోకొంత ఈఎంఎఫ్‌ ప్రభావానికి లోనవుతూనే ఉంటారు.

అధ్యయనాల్లో మిశ్రమ ఫలితాలు

మొబైల్‌ ఫోన్ల వాడకం వల్ల గ్రహణ శక్తి, సావధానతపై పడే ప్రభావాన్ని 40కి పైగా అధ్యయనాలలో పరిశీలించారు. ఈఎంఎఫ్‌లకూ గ్రహణ శక్తికీ మధ్య ఎలాంటి సంబంధమూ లేదని ఈ పరిశోధనలో తేలింది. అయితే రోజుకు గంటన్నరకన్నా ఎక్కువసేవు మొబైల్‌ ఫోన్‌ వాడితే సావధాన శక్తి తగ్గుతుందని ఒక పరిశోధన సూచించింది. దీన్ని నివారించడానికి స్పీకర్లను, చేతితో మొబైల్‌ను పట్టుకోనక్కర్లేకుండా తోడ్పడే ఉపకరణాలను ఉపయోగించడం మంచిది. దీనివల్ల శరీరానికి, మొబైల్‌ సాధనాలకు మధ్య కొంతదూరం పాటించడం వీలవుతుంది.

ఆరోగ్యంపై ప్రభావం..

ఏతావతా 5జీ వల్ల మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏ పరిశోధనలోనూ తిరుగులేకుండా నిర్ధారణ కాలేదు. ఈఎంఎఫ్‌ ప్రభావం మీద మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అమెరికా జాతీయ టాక్సికాలజీ పరిశోధన కార్యక్రమం కింద రెండేళ్లపాటు ఎలుకల మీద రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ ప్రభావాన్ని పరిశీలించారు. చివరకు మగ ఎలుకల్లో క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించినా, ఆడ ఎలుకల్లో అది కనిపించలేదు. ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే, జంతువులపై ప్రయోగాల్లో ఉపయోగించే రేడియేషన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువసేపు సెల్‌ఫోన్లు ఉపయోగించే మనుషులు కూడా అంతటి రేడియేషన్‌కు గురయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ప్రయోగశాల ఫలితాలను యథాతథంగా మనుషులకు వర్తింపజేయలేం.

ఏదిఏమైనా, మొబైల్‌, డిజిటల్‌ నెట్‌వర్కుల వల్ల దీర్ఘకాలంలో పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి విస్తృత అధ్యయనాలు జరుగుతున్నాయి. వీటిలో ప్రముఖమైనది- కాస్మోస్‌. 2007 సంవత్సరం నుంచి ఆరు ఐరోపా దేశాల్లో జరుగుతున్న ఈ అధ్యయనంలో 2,90,000 మంది పాల్గొంటున్నారు. 20 నుంచి 30 ఏళ్లపాటు సెల్‌ఫోన్ల వాడకం వల్ల మానవ ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా కాస్మోస్‌ సాగుతోంది. ఈ దీర్ఘకాల ప్రయోగం కచ్చితమైన ఫలితాలను అందిస్తుందని ఆశించవచ్చు.

భయాలకు బీజం

అంతర్జాతీయ క్యాన్సర్‌ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌సీ) 2011లో వెలువరించిన ఒక నివేదిక 5జీ సాంకేతికత పట్ల భయానికి బీజం వేసింది. మొబైల్‌ ఫోన్లు వాడే విద్యుదయస్కాంత ఫ్రీక్వెన్సీలు (ఈఎంఎఫ్‌) మానవుల్లో 'బహుశా' క్యాన్సర్‌ కారకం కావచ్చునని ఆ నివేదిక అభిప్రాయపడింది. దాన్ని 14 దేశాలకు చెందిన 30 మంది శాస్త్రజ్ఞులు సమర్పించారు.

2017లో వెలువడిన మరో పరిశోధనా నివేదిక ఈఎంఎఫ్‌ వల్ల మెదడు క్యాన్సర్‌ రావచ్చునంటే, 2018లో వచ్చిన మరొక నివేదిక అలాంటిదేమీ నిర్ధరణ కాలేదని పేర్కొన్నది.

- ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.