కొవిడ్ మహమ్మారి నుంచి మానవాళి గ్రహించాల్సిన మరో పెద్ద పాఠం భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్) అత్యవసర సమస్యగా సమష్టిగా ఎదుర్కోవడం! భూతాపం ప్రస్తుతం మానవ మనుగడకు ప్రమాదకరంగా పరిణమించిందని శాస్త్రీయ ఆధారాలన్నీ తేల్చి చెబుతున్నాయి. 'గ్రీన్‌హౌస్' వాయువులను ఇక ముందు నియంత్రించగలిగినా కూడా, భూమ్మీద ఇప్పటికే జరిగిన నష్టంవల్ల సరాసరి ఉష్ణోగ్రతలు సుమారు రెండు డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయి. బొగ్గుపులుసు వాయువు, మీథేన్, ఇతర ఉద్గారాల విడుదలను ఆపకపోతే ఉష్ణోగ్రతల పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంటుంది.
రెండు డిగ్రీల సెల్సియస్ చాలా స్వల్పమే కదా అనిపించవచ్చు. కానీ రెండు డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదలతో చోటు చేసుకునే మార్పు- మంచు యుగానికి, ఎడారీకరణకు మధ్య తేడాగా మారవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కల్లోలం సృష్టిస్తున్నాయి. హిమనదాలను కరిగిస్తున్నాయి. సైబీరియా, గ్రీన్‌లాండ్ వంటి శీతల ప్రదేశాలలో మంచును కరిగిస్తున్నాయి. భారత్‌లో గంగా, ఉపఖండంలోని ఇండస్ వంటి హిమనదాలు ఎండిపోతుండటం, ఆర్కిటిక్ మహా సముద్రం కరుగుతుండటం, అంటార్కిటికాలో మంచు ఫలకం కరగడం, సముద్ర మట్టాలు పెరగడం, తీర, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడం, ద్వీపదేశాలు మునిగిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న పరిణామాలు.
పలు దేశాల్లో అటవీ కార్చిచ్చులు, భారత్ వంటి ఉష్ణ మండల దేశాల్లో ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయిలో ఉండటం, పెనుతుపానులు, టైఫూన్లు వంటి అసాధారణ, అనూహ్య వాతావరణ పోకడలు మనిషికి సవాలు విసురుతున్నాయి. ఎడారీకరణ, దోమలు, ఇతర వ్యాధికారక కీటకాల వ్యాప్తి, మహమ్మారులు విజృంభిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా గుర్తించని అనేక భయోత్పాతాలకు కారణమవుతున్నాయి.
ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి
మానవాళి మనుగడకు ప్రమాదకరమైన భూతాపానికి మూలం మానవుడి చర్యలే. అభివృద్ధి వర్సెస్ భూతాపం- అనే ఈ క్రూరమైన సందిగ్ధం వల్ల మనం 'గ్రీన్‌హౌస్' వాయువుల విడుదలను తగ్గించలేకపోతున్నాం. తలసరి ఇంధన వాడకం పెద్దయెత్తున ఉన్నది సంపన్న దేశాల్లో, వృద్ధికోసం తంటాలు పడుతున్న పేద దేశాలకు ఇంధనం వాడొద్దని, ఉత్పత్తిని నిలిపివేయాలని చెప్పడం హాస్యాస్పదం. ఇప్పుడు పునరుత్పాదక ఇంధనాన్ని పుష్కలంగా, చౌకగా- దీర్ఘకాలిక ప్రాతిపదికనైతే శిలాజ ఇంధనాల కంటే చౌకగా- చేయగలిగేలా సాంకేతిక విజ్ఞానం పరిణతి సాధించడం సంతోషకరమైన విషయం.
మాంసం ఉత్పత్తిలో కర్బన ఉద్గారాల్ని తగ్గించే సాంకేతికతా మనకుంది. వరి ఉత్పత్తిలో మెరుగైన పద్ధతులు, ప్రత్యామ్నాయ ఆహారాలు 'గ్రీన్‌హౌస్' వాయువుల్ని ఇంకా తగ్గిస్తాయి. 'కణాల కల్చర్' ద్వారా మాంసం ఉత్పత్తికి సింగపూర్ అనుమతులిచ్చింది. అటువంటి టెక్నాలజీలవల్ల ఇక వధించేందుకు జంతువుల్ని పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రపంచ మార్కెట్ల డిమాండుకు తగ్గ మాంసాన్ని రాబోయే 10-20 ఏళ్లలో కొత్త టెక్నాలజీతో తయారు చేయవచ్చు.
మనకు ఇప్పటికే సౌర విద్యుత్తు, బ్యాటరీ స్టోరేజీ టెక్నాలజీ, విద్యుత్ కార్లు, ఇంధన పొదుపు పరికరాలు, బయోమాస్‌ను ఇంధనంగా మార్చే సెల్యులోజిక్ ఎంజైములు, ఇతర అద్భుత సాంకేతికతలు చవకగా అందుబాటులో ఉన్నాయి. ఉత్పత్తిని, ఆర్థిక వృద్ధిని, ఉద్యోగాల్ని కోల్పోకుండానే వచ్చే 20ఏళ్లలో శిలాజ ఇంధనాల మీద ఆధారపడాల్సిన అవసరం నుంచి పూర్తిగా బయటపడే సామర్థ్యం ఈవేళ మానవాళికి ఉంది.
కొత్త ఇంధన వ్యవస్థల్ని నిర్మించి, నిర్వహించే క్రమంలో కోట్ల సంఖ్యలో నూతన ఉద్యోగాల్ని సృష్టించవచ్చు. ఇందుకు ప్రతి దేశంలో, ప్రపంచ స్థాయిలోనూ భారీగా ప్రయత్నం కావాలి. ప్రస్తుత శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్ గ్రిడ్లనుంచి పునరుత్పాదక ఇంధన గ్రిడ్‌లకు మరలడానికి సుమారు 15-20 లక్షల డాలర్లు అవసరమవుతాయి. ప్రస్తుత విద్యుత్ ప్లాంట్లను మూసివేస్తే, వాటి వ్యయాన్ని ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పరిహారం కట్టాల్సి ఉంటుంది.
పాత పెట్రోల్ బంక్ స్థానంలో విద్యుత్ కార్ల బ్యాటరీలను రీఛార్జి చేసే సౌర విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు రావాలి. ప్రస్తుత కేంద్రీకృత గ్రిడ్ స్థానంలో వికేంద్రీకరించిన పంపిణీ వ్యవస్థలు ఏర్పడాలి. పగలు సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని నిరంతర విద్యుత్ అవసరాల కోసం భారీస్థాయిలో నెలకొల్పాలి. ఈ పరివర్తన (ట్రాన్సిషన్) కోసం తక్కువ ఖర్చుతో సమర్థంగా పనిచేసే టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ పరివర్తన జరగాలంటే మనకు భారీ వనరులు కావాలి. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ తమ ఆర్థిక వ్యవస్థల ఉద్దీపనకు, ఆర్థిక కార్యకలాపాలు లేక కుదేలైన కార్మికులను, సంస్థలను ఆదుకునేందుకు సుమారు 15లక్షల డాలర్ల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించాయి. ఈ మొత్తాన్ని కేవలం ఏడాది కాలంలో సమకూర్చగలిగాయి.
శిలాజ ఇంధన గ్రిడ్ల నుంచి పునరుత్పాదక గ్రిడ్లకు మరలేందుకు మనకు కావలసిందల్లా 15 లక్షల డాలర్లు- అంటే కొవిడ్ ఉద్దీపనకు ఏడాది కాలంలో వినియోగించిన మొత్తాన్ని 10-15 ఏళ్ల కాలంలో వినియోగించడం. వృద్ధి, ఉపాధి, నాణ్యమైన జీవితంతో పర్యావరణహిత ఆర్థిక వ్యవస్థల్ని నిర్మించడానికి కావలసిన సాంకేతికత, వనరులు ప్రపంచానికి ఉన్నాయి. మనకు కావలసిందల్లా రాజకీయ సంకల్పం, ఆర్థిక, వ్యాపార సృజనాత్మకత, ప్రపంచ దేశాల మధ్య సహకారం!
బెంబేలెత్తిస్తున్న భూతాపం
ఒకవిధంగా మొత్తం మానవాళికి కొవిడ్ ఒక మేలుకొలుపు. అసమానతలు తగ్గించడానికి, అందరికీ అవకాశాల్ని అందించడానికి, అభివృద్ధిని పెంచడానికి, పేదరికాన్ని అంతం చేయడానికి- నాణ్యమైన, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ఒక ఆరోగ్య రక్షణ వ్యవస్థ, నైపుణ్యాలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, ఉద్యోగాల కల్పన, సమ్మిశ్రిత వృద్ధి ఎంత కీలకమన్నది అన్ని దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు ఇది గుర్తుచేసింది.
ఇది కేవలం ఒక ఆర్థికపరమైన అవసరం కాదు, స్థిరత్వానికి కావలసిన ఓ రాజకీయ అనివార్యత. సామరస్యత, సంతోషాలకు కావలసిన ఓ సామాజిక అనివార్యత. భవిష్యత్తులో తలెత్తే అవకాశమున్న మరింత ప్రమాదకర, విధ్వంసకారక మహమ్మారుల్ని నిరోధించడానికి మనం ప్రకృతి సమతౌల్యాన్ని పునరుద్ధరించాలి. వన్యప్రాణుల్ని ఆహారంగా వినియోగించడానికి స్వస్తి చెప్పాలి. అడవుల నరికివేతను ముఖ్యంగా ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాల్లో ఆపుచేయాలి. చివరిగా భూతాపాన్ని ఎదుర్కొని తిరిగి సాధారణ స్థితికి మళ్లించడానికి- తద్వారా మన పిల్లలు, మొత్తం మానవాళి భవిష్యత్తును పరిరక్షించడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని, వనరుల్ని సరైన రీతిలో ఉపయోగించాలి.
-రచయిత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ (ప్రజాస్వామ్య పీఠం(ఎఫ్డీఆర్), లోక్‌సత్తా వ్యవస్థాపకులు)
ఇదీ చదవండి:మహమ్మారి నేర్పిన పాఠాలెన్నో!