Gujarat Elections: గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలు రాబోయే లోక్‌సభ సమరంపై ప్రభావం చూపే అవకాశముందని భాజపా భావిస్తోంది. అందుకే వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. భాజపా తిరుగుబాటు నేత శంకర్‌సిన్హ్ వాఘేలా, దిలీప్ పరీక్‌లు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రులుగా కొనసాగిన 17 నెలల కాలం మినహా, 27 ఏళ్లుగా గుజరాత్‌లో కమలం పార్టీ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో దూకుడు పెంచడంతో భాజపా మరింతగా ఎన్నికలపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
భాజపా, ఆప్‌లతో పోలిస్తే రాహుల్ గాంధీ కాస్త ఆలస్యంగా గత నెల అయిదున అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రచార ప్రారంభ సమావేశంలో 50 వేల మంది బూత్‌స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగానే ఉందనే సంకేతాలు ఇచ్చినట్లయింది. డిసెంబరులో జరగబోయే గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో విజయ సాధనకు భాజపా, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నిమగ్నమై ఉండటంతో ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల బాధ్యత తీసుకోనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాల్లో 125 సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా హస్తం పార్టీ పనిచేస్తోంది. అయితే, ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరి పేరునూ కాంగ్రెస్ ప్రకటించలేదు. గుజరాత్‌లో రెండు ప్రధాన పక్షాల మధ్యనే పోటీ ఉంటుందని, ఇందులో ఆప్‌కు స్థానం లేదని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి శక్తిసింగ్ గోహిల్ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో మూడో పక్షం ఎప్పుడూ విజయవంతం కాలేదని ఆయన చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ వ్యాఖ్యలను ఖండిస్తోంది.
ఆప్ దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో భాజపా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రానికి వెళ్ళిన ప్రతిసారీ నేతలతో సమీక్షలు జరుపుతున్నారు. ఇటీవల రెవిన్యూ మంత్రి రాజేంద్ర త్రివేది, రహదారులు-భవనాల శాఖ మంత్రి పూర్ణేశ్ మోదీలను మంత్రివర్గం నుంచి తప్పించారు. ఆ విషయం చివరిదాకా ముఖ్యమంత్రి భూపేంద్రకు సైతం తెలియదు!
గుజరాత్‌లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని 54 అసెంబ్లీ స్థానాల్లో 30 సీట్లను గెలుచుకొంది. తద్వారా ఆ పార్టీ మొత్తంగా 77 స్థానాలను సొంతం చేసుకోగలిగింది. భాజపా 99 స్థానాలకే పరిమితమైంది. 2001లో మోదీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరవాత గుజరాత్‌లో భాజపాకు వచ్చిన అత్యల్ప స్థానాలు అవే. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో 2012లో 35 స్థానాలను గెలుచుకున్న భాజపా బలిమి 2017లో 23కు పడిపోయింది.
దక్షిణ గుజరాత్‌లోని 35 అసెంబ్లీ స్థానాల్లో 2012లో భాజపా 28 సీట్లను గెలుచుకోగా, 2017లో మూడింటిని కోల్పోయింది. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ఆరు స్థానాల నుంచి పదికి పెంచుకొంది. గత ఎన్నికలు పాటిదార్ల అసంతృప్తి మధ్య జరగడంతో కాంగ్రెస్ కొంత మేర లాభపడింది. ప్రస్తుతం పాటిదార్ల ఉద్యమం లేకపోయినా- ధరల ప్రభావం, వ్యవసాయదారుల్లోని అసంతృప్తి వంటివి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాన్ని పట్టణ ప్రాంత ప్రజాదరణతో అధిగమించాలని భాజపా భావిస్తోంది.
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉచిత వాగ్దానాల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ఉచిత అవయవ మార్పిడి సహా రూ.10 లక్షల విలువైన చికిత్సలు అందిస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. ప్రతి అమ్మాయి బ్యాంకు ఖాతాలో ప్రతినెలా మూడు వేల రూపాయలు జమ చేస్తూ, యుక్తవయసుకు వచ్చేనాటికి రూ.30 లక్షలు సమకూరుస్తామని చెప్పింది. రాబోయే రోజుల్లో మరికొన్ని హమీలనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వాగ్దానాలు ఏ మేరకు మేలు చేస్తాయన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగరేయాలంటే మరింతగా శ్రమించాల్సిందే.
- ఆర్.కె.మిశ్రా
(సామాజిక, రాజకీయ విశ్లేషకులు)