Malala Murmu tribe: ఏ రంగంలోనైనా పురుషులకు దీటుగా మహిళలు సైతం విజయ శిఖరాలు అధిరోహించగలరని నిరూపించిన ఇద్దరు వనితారత్నాలు- ద్రౌపదీ ముర్ము, మలాలా యూసఫ్‌జాయ్. వీరిలో ద్రౌపది భారత రాష్ట్రపతిగా, మలాలా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా భారత ఉపఖండానికి గర్వకారణమయ్యారు. ముర్ము, మలాలా ఇద్దరూ గిరిజన తెగలకు చెందినవారే! అయితే వారిద్దరి తెగల మధ్యా హస్తిమశకాంతరం కనిపిస్తుంది. పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలోని పష్తూ (పఠాన్) తెగకు చెందిన మలాలాపై దశాబ్దం క్రితం పష్తూన్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. తమ నిబంధనలను అనుసరించి మలాలా పాఠశాల చదువును ఆపకపోవడమే కాదు, తోటి ఆడపిల్లలూ చదువుకోవాలని ఉద్బోధించడం వారికి కంటగింపుగా మారింది. వారి కాల్పుల తరవాతా బాలికల విద్య కోసం మలాలా ఉద్యమిస్తూనే ఉన్నారు. నిర్భీతి, పట్టుదల, అంకితభావాలే మలాలాకు నోబెల్ శాంతి బహుమతిని అందించాయి.
Murmu tribe history: ద్రౌపదీ ముర్ము ఉత్థానం మలాలా కథకు పూర్తి భిన్నం. సంతాల్ గిరిజన తెగకు చెందిన ముర్ము పాఠశాల ఉపాధ్యాయురాలి నుంచి దేశ అత్యున్నత అధికార పీఠం దాకా ఎదగడం భారత్‌లో గిరిజన తెగల వికాసానికి విశిష్ట ప్రతీక. భారత్‌కు ప్రతిభా పాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతి. ముర్ము ప్రప్రథమ గిరిజన రాష్ట్రపతి. ముర్ము తెగ అయిన సంతాలులు ప్రధానంగా పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, అస్సాం, ఝార్ఖండ్‌లలో నివసిస్తున్నారు. భారత జనాభాలో 8.6శాతం మేర ఉన్న గిరిజనుల్లో సంతాలులే అతి పెద్ద తెగ. భారతీయ జనతా పార్టీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి సంతాలులపై దేశమంతటా ఆసక్తి పెరిగింది. వారి జీవన శైలి, అసమాన ధైర్యసాహసాలు, త్యాగాల గురించి విరివిగా వ్యాసాలు, కథనాలు వెలువడ్డాయి. సంతాలుల పోరాట పటిమ పఠాన్‌లకు దీటైనది. సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పఠాన్ తెగకు చెందిన నాయకుడే. ఆయన పుట్టిన ప్రాంతమే మలాలా జన్మభూమి. సరిహద్దు గాంధీ బ్రిటిష్ వలస పాలకులతో తలపడ్డారు. మహిళా హక్కుల కోసం తీవ్రవాదులతో మలాలా పోరాడారు. సంతాల్ తెగ నుంచి పలువురు వీరులు బ్రిటిష్ వలస పాలకులపై తిరగబడ్డారు. టిల్కా మాంఝీ భారత్‌లో బ్రిటిష్ ఆధిపత్యంపై తొలిసారి గిరిజన సాయుధ పోరాటాన్ని చేపట్టారు. ఆంగ్లేయులపై బిర్సా ముండా పోరూ ఎనలేనిది.
Malala Tribe history: మలాలా, ముర్ములు పష్తూ, సంతాల్ తెగల మధ్య ఉన్న తీవ్ర వ్యత్యాసానికి ప్రతీకలు. సంతాల్ తెగ వారు మార్పును, ఆధునికతను ఆలింగనం చేసుకున్నారు. పష్తూ తెగ మార్పును ప్రతిఘటిస్తోంది. పాత కాలపు పద్ధతులను మార్చుకొనేది లేదంటోంది. పితృస్వామ్య నిరంకుశత్వం మూర్తీభవించిన పష్తూ సమాజంలో నిర్మాణాత్మక మార్పు కోసం మలాలా పోరాడుతుంటే, జాతి నిర్మాణంలో గిరిజనులను మమేకం చేసుకున్న భారతీయ సమాజానికి ముర్ము ప్రతినిధిగా నిలుస్తున్నారు.
నిజానికి సంతాలులకన్నా పష్తూ తెగ ప్రజలే ఎక్కువ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను అనుభవించారు. వనరుల లభ్యతా వారికి అధికమే. సంతాలులు ఆది నుంచీ అరకొర వనరులతో నెట్టుకొచ్చిన బలహీన వర్గం. ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనకబాటుతనాన్ని దీక్షాదక్షతలతో అధిగమించి సంతాలులు ఉన్నత స్థానాలకు ఎదిగారు. రాజకీయ, ఆర్థిక బలం ఉన్నా పఠాన్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. తుపాకీతోనే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయనే దురూహ వారిని నానాటికీ బలహీనపరచింది. పష్తూన్లపై జర్బే అజ్బ్, రద్దుల్ ఫసాద్ వంటి సైనిక చర్యలను పాకిస్థాన్ చేపట్టడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. పఠాన్లను ఒకరిపైకి ఒకరిని ఉసిగొలిపి పాక్ పబ్బం గడుపుకొంది. 1980ల్లో సోవియట్లపై పోరుకు పఠాన్లను పావుల్లా ఉపయోగించింది. భారత్‌పై ఉగ్రదాడులకూ వారిని ప్రయోగించింది. దానివల్లా పఠాన్లకు నష్టమే మిగిలింది.
సంతాలులేమో విద్యాబుద్ధులు నేర్చి క్రీడలు, కళలు, కవిత్వం, సాహిత్యం, రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. వివిధ రంగాల్లో సాధికారత సాధించారు. ప్రస్తుత ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ సంతాల్ తెగకు చెందిన నాయకుడే. పూర్ణిమా హెంబ్రామ్ వంటి క్రీడాకారులు, దివ్యా హన్స్ దా వంటి సినీ దర్శకులు ఆ తెగకు చెందినవారే. ఎవరెస్టును అధిరోహించిన తొలి సంతాల్ మహిళగా వినీతా సొరెన్ రికార్డులకెక్కారు. వారందరినీ మించి దేశంలో అత్యున్నత పదవిని అధిష్ఠించిన సంతాల్ మహిళగా ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె సంతాల్‌లకు గర్వకారణంగా నిలవడంతోపాటు, యావత్ భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నారు.
- బిలాల్ భట్