మన చుట్టూ ఆవరించిన వాతావరణంలో విషతుల్యత నానాటికీ పెరుగుతోంది. ప్రాణాలను నిలపాల్సిన గాలి అదృశ్య హంతకిగా మారిపోతోంది. ప్రపంచ జనాభాలో 99 శాతం మంది కలుషిత వాయువులను శ్వాసిస్తున్నారు. అందులోని హానికారక రేణువులు.. అన్ని రక్షణ వలయాలను ఛేదించుకొని గర్భస్థ పిండాల్లోకీ చొచ్చుకెళుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తోంది.
కలుషిత గాలిలోని హానికారక రేణువులు మావిలోకి ప్రవేశించగలవని 2018లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది చాలా ముఖ్యమైన అవయవం. గర్భం చుట్టూ ఒక రక్షణాత్మక వలయాన్ని ఇది ఏర్పరుస్తుంది. తాజాగా బెల్జియంలోని హాసెల్ట్ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌లోని అబెర్‌డీన్ వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన రెండు అధ్యయనాలు ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెచ్చాయి.
కాలుష్యానికి తగ్గట్టే.. రేణువులు
కాన్పు అనంతరం 60మంది తల్లుల నుంచి సేకరించిన మావి, రక్త నమూనాలను హాసెల్ట్ వర్సిటీ పరిశోధకులు విశ్లేషించారు. అందులో మసి రేణువులను (బ్లాక్ కార్బన్) గుర్తించారు. ఇవి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల ప్రజ్వలన, కార్చిచ్చు రేగడం వల్ల ఉత్పన్నమవుతుంటాయి. దీర్ఘకాలం ఈ రేణువుల ప్రభావానికి లోనైతే గుండె, శ్వాసకోశ వ్యాధులు, అకాల మరణాలు తప్పవని ఇప్పటికే రుజువైంది.
ఆ తల్లుల నివాస ప్రాంతాల్లో వాయు కాలుష్య స్థాయిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందుకోసం ఉపగ్రహ డేటాను సేకరించారు. ఆ మాతృమూర్తులు సరాసరిన ఎంత మేర విషతుల్య గాలికి గురయ్యారన్నది పరిశీలించారు. వారి నివాస ప్రాంతాల్లోని వాయు కాలుష్యానికి తగ్గట్టే వారి మావి, బొడ్డురక్త నమూనాల్లో కనిపించిన మసి రేణువుల స్థాయి ఉందని వెల్లడైంది.
అవయవాల్లోనూ..
- రెండో అధ్యయనాన్ని స్కాట్లాండ్‌లో నిర్వహించారు. అందులో భాగంగా గర్భస్థ పిండాల కాలేయం, ఊపిరితిత్తుల, మెదడు కణజాలాలను శ్వేత వర్ణ లేజర్లతో శోధించగా వేల సంఖ్యలో మసి రేణువులు కనిపించాయి.
- ఈ రెండు అధ్యయనాల్లో పాల్గొన్న మహిళలకు పొగతాగే అలవాటు లేదు.
కీలక దశలో..
తల్లిగర్భం నుంచి బయటకు వచ్చి తొలిసారి శ్వాస తీసుకోవడానికి ముందే పసికందులు వాయు కాలుష్యం బారినపడుతున్నట్లు ఈ రెండు పరిశోధనలు స్పష్టంచేస్తున్నాయి. ఇతర అవయవాలతోపాటు అప్పుడే రూపుదిద్దుకుంటున్న మెదడులోకీ ఇవి ప్రవేశించడం ఆందోళనకర అంశం. భవిష్యత్‌లో రాబోయే అనేక వ్యాధులకు బీజాలుపడే కీలక దశలో అవి శిశువుల్లో చేరుతున్నాయి. పిండస్థ అవయవాలు, కణాల్లోని నియంత్రణ వ్యవస్థలతో ఇవి ప్రత్యక్షంగా చర్యలు జరిపే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- ఈ కాలుష్యకారకాల వల్ల నెలలు నిండకుండానే కాన్పు కావడం, మృత శిశువులు జన్మించడం, తక్కువ బరువుతో శిశువులు పుట్టడం, మెదడు వృద్ధిలో లోపాలు వంటివి తలెత్తవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. వీటివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను ఈ శిశువు జీవితాంతం అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు.
- పేగుల్లోని ప్రయోజనకర బ్యాక్టీరియాపైనా వాయు కాలుష్య ప్రభావం పడుతుందని దక్షిణ కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలు పేర్కొన్నాయి. ఈ మార్పుల వల్ల సిస్టమిక్ ఇన్‌ఫ్లమేషన్, గ్యాస్ట్రోఎంటిరైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మానసిక ఆరోగ్య సమస్యలు రావొచ్చని తెలిపాయి.
ఇలా చేయాలి..
- గర్బిణులు వాహన రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నడకను మానుకోవాలి.
- ఇళ్లలో మంచి ఎయిర్ ఫిల్టరేషన్ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి.
- సాధ్యమైనంత ఎక్కువసేపు కిటికీలు తెరిచి ఉంచాలి.
- శిశువులకు సరిపడా స్తన్యమివ్వాలి. పేగుల్లోని బ్యాక్టీరియాను ఆరోగ్యకర స్థాయిలో ఉంచడంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయి.
అధికారిక లెక్కల ప్రకారం వాయుకాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా బలవుతున్నవారు 67 లక్షల మంది. వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చన్నది నిపుణుల వాదన.
ఇవీ చదవండి: హోటల్‌పై ఉగ్రవాదుల దాడి.. 9 మంది మృతి.. 47 మందికి గాయాలు
'ప్రధాని పదవికి పోటీ చేస్తున్నా'.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్