- ఎన్డీఏలోకి సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ.
- బీజేపీలోకి ఎస్పీ మాజీ ఎమ్మెల్యే దారా సింగ్.
BJP UP news : ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో రెండు రోజుల్లో జరిగిన కీలక పరిణామాలివి. సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓంప్రకాశ్ రాజ్‌భర్, ఎస్పీ మాజీ నేత దారా సింగ్ చౌహాన్.. ఇద్దరూ ఓబీసీ నేతలే. జాతీయ స్థాయి కూటమి/పార్టీలో ఇలాంటి చేరికలు సర్వసాధారణమే అయినా.. రాజ్‌భర్, చౌహాన్ రాక మాత్రం ఎంతో ప్రత్యేకం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష కూటమిని దీటుగా ఎదుర్కొని.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజేతగా నిలిచేందుకు భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వ్యూహంగా చెబుతున్నారు.
కులగణన డిమాండ్‌కు కౌంటర్!
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు 'ఉమ్మడి' వ్యూహంతో ముందుకు సాగుతోంది ప్రధాన విపక్షం కాంగ్రెస్. ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలమైంది. ఈ కూటమి ప్రధాన అస్త్రాల్లో 'ఓబీసీ రిజర్వేషన్ పెంపు' ఒకటి. తక్షణమే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి, ఆ లెక్కల ఆధారంగా వెనుకబడి వర్గాలకు రిజర్వేషన్ పెంచాలన్నది విపక్ష కూటమి ముఖ్య డిమాండ్. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తుండగా.. ఓబీసీ సంక్షేమం కమలనాథులకు పట్టదని విపక్ష నేతలు ప్రచారం సాగిస్తున్నారు.
ఇదీ చదవండి: విపక్ష కూటమిలోకి 17 పార్టీలు.. ఎవరి బలమెంత? ఇదీ అసలు లెక్క!
నిజానికి.. 2014 నుంచి ఓబీసీలు ఎక్కువగా బీజేపీ వైపే మొగ్గుచూపుతూ వస్తున్నారు. రిజర్వేషన్ పెంపు డిమాండ్‌తో ఈ పరిస్థితిని మార్చేందుకు విపక్ష కూటమి చేస్తున్న ప్రయత్నాలతో కమలదళం అప్రమత్తమైంది. హిందీ రాష్ట్రాల్లో అతి కీలకమైన ఓబీసీ, దళిత ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఆయా సామాజిక వర్గాలకు 'ప్రాతినిధ్యం' వహించే చిన్నచిన్న పార్టీలతో జట్టుకడుతోంది. ఇంతకుముందు విపక్షాలతో ఉన్న ఓబీసీ, దళిత వర్గాల పార్టీలు కొన్ని.. గత కొద్ది నెలలుగా ఎన్డీఏలో చేరడం ఇందులో భాగమే.
యూపీలో క్లీన్ స్వీప్ టార్గెట్!
543 స్థానాలున్న లోక్‌సభలో మెజార్టీ సాధించాలంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో సత్తా చాటడం తప్పనిసరి. అందుకే యూపీపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది కమలదళం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లు గెలుచుకోగా.. మిత్రపక్షం అప్నాదళ్ తరఫున ఇద్దరు ఎంపీలుగా గెలిచారు. 2024లో మాత్రం 80 లోక్‌సభ స్థానాల్ని ఎన్డీఏ గెలుచుకుని తీరాలనే సంకల్పంతో పని చేస్తోంది బీజేపీ. ఆ లక్ష్య సాధన కోసం చిన్న పార్టీలపై ఆధారపడుతోంది.
- ఓబీసీ నేత సంజయ్ నిషాద్ నేతృత్వంలోని నిషద్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరింది. జాలర్ల సామాజిక వర్గంలో నిషాద్కు మంచి పట్టుంది.
- ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న అనుప్రియా పటేల్ సారథ్యంలోని అప్నాదళ్(సోనేలాల్) 2014 నుంచి జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉంది. ఈ పార్టీకి వెనుకబడిన వర్గమైన కుర్మీల్లో ఆదరణ ఉంది.
పూర్వాంచల్‌లో అలా మళ్లీ జరగరాదని..
దాదాపు 28 లోక్‌సభ స్థానాలున్న తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజ్‌భర్ సామాజిక వర్గం ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. ఈ వర్గానికి చెందిన ఓంప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ-ఎస్బీఎస్పీ 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామి. నాటి ఎన్నికల్లో 8 సీట్లలో పోటీ చేసి.. 5 స్థానాలు గెలుచుకుంది. ఓంప్రకాశ్.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అయితే.. రెండేళ్లకే బీజేపీ-ఎస్బీఎస్పీ బంధం తెగిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా 39 మంది అభ్యర్థుల్ని నిలిపారు రాజ్‌భర్. తూర్పు యూపీలోని ఘోసి నియోజకవర్గంలో ఎస్బీఎస్పీ అభ్యర్థి కమలం గుర్తుపై పోటీ చేయాలని బీజేపీ ప్రతిపాదించడమే పొత్తు చెడేందుకు కారణం.
ఇదీ చదవండి: 2024 ఎన్నికలే బీజేపీ టార్గెట్.. పాత స్నేహితుల కోసం ఆరాటం.. మీటింగ్‌కు రావాలని లేఖలు!
2022 ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో జట్టుకట్టింది రాజ్‌భర్ పార్టీ. 17 సీట్లలో పోటీ చేసి 6 స్థానాలు గెలుచుకుంది. అయితే.. ఎస్బీఎస్పీతో పాటు అప్నాదళ్ చీలిక వర్గం కారణంగా పూర్వాంచల్‌లో బీజేపీకి నష్టం జరిగిందని కమలనాథులు అర్థం చేసుకున్నారు. మరోసారి అలా జరగకుండా చూసేందుకు ఓంప్రకాశ్ రాజ్‌భర్‌ను తమవైపునకు తిప్పుకున్నారు. దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన రాజ్‌భర్.. ఎన్డీఏలో చేరికను ఖరారు చేస్తూ ఆదివారం అధికారిక ప్రకటన చేశారు.
"విపక్షాల్లో అహం ఉంది. మేమే గొప్ప అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చిన్న పార్టీలతో జట్టు కట్టడం ద్వారా అధికారం ఎలా సంపాదించవచ్చో విపక్షాలు బీజేపీని చూసి నేర్చుకోవాలి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎస్బీఎస్పీ పోటీ చేస్తుంది. దిల్లీలో ఈనెల 18న జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటాం.
సమాజ్‌వాదీ పార్టీ కూటములు ఎక్కువ కాలం నిలవవు. 2017లో కాంగ్రెస్‌తో పొత్తు, 2019లో బీఎస్పీతో కూటమి ఏమయ్యాయో చూశాం. ఎస్పీ నుంచి మరింత మంది నేతలు ఎన్డీఏలోకి వస్తారు."
--ఓంప్రకాశ్ రాజ్‌భర్.
24 గంటల్లోనే మరొకరు..
రాజ్‌భర్ జోస్యాన్ని నిజం చేస్తూ.. కమలదళంలో చేరారు ఎస్పీ మాజీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్. సోమవారం లఖ్‌నవూలో ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్; యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి సమక్షంలో కాషాయకండువా కప్పుకున్నారు.
దారా సింగ్ చౌహాన్.. పూర్వాంచల్‌కు చెందిన ఓబీసీ నేత. బహుజన్ సమాజ్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, ఒకసారి లోక్‌సభ ఎంపీగా చేశారు. 2015లో బీజేపీలో చేరారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మధుబన్ స్థానం నుంచి గెలిచారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. అయితే.. సరైన పనితీరు కనబర్చని కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాదన్న అనుమానంతో 2022 జనవరి 12న మంత్రి పదవికి, బీజేపీకి రాజీనామా చేశారు. ఎస్పీలో చేరారు. 2022 ఎన్నికల్లో మధుబన్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభ్యత్వానికి శనివారమే రాజీనామా చేసిన దారా సింగ్ చౌహాన్.. సోమవారం బీజేపీలో చేరారు.
దారా సింగ్‌ది.. నోనియా సామాజిక వర్గం. వారణాసి, గోరఖ్‌పుర్, ఘోసి, ప్రతాప్‌గఢ్, ఆజంగఢ్, మౌ సహా తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అర డజనుకుపైగా లోక్‌సభ స్థానాల్లో నోనియా వర్గం ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. దారా సింగ్ చేరిక.. ఆ వర్గం ఓటర్లు బీజేపీ వైపు మళ్లేందుకు కారణం కావచ్చని అంచనా.
"2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి అవుతారు. భూమిపై ఉన్న ఏ శక్తీ.. దీన్ని అడ్డుకోలేదు. పూర్వాంచల్ మాత్రమే కాదు.. మొత్తం యూపీలో బీజేపీ భారీ విజయం అందుకుంటుంది. పూర్వాంచల్‌లో ఒక్క సీటును కూడా విపక్షం గెలవలేదు" అని అన్నారు దారా సింగ్.
ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న నిషాద్ పార్టీ, అప్నాదళ్.. రెండూ తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో పట్టున్న పార్టీలే. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓంప్రకాశ్ రాజ్‌భర్ కూటమిలో చేరడం, మరో కీలక నేత దారా సింగ్ చౌహాన్ పార్టీలోకి తిరిగిరావడం.. పూర్వాంచల్‌లో బీజేపీ విజయావకాశాల్ని మరింత మెరుగుపరుస్తాయన్నది కమలనాథుల విశ్వాసం.
అటు పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇదే తరహా వ్యూహం అమలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని సమాచారం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ ఓట్లు చీలిపోయేందుకు సమాజ్ వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్‌దళ్ పొత్తు ఓ కారణమని కమలదళం భావిస్తోంది. అదే తరహాలో మరోసారి నష్టం జరగకుండా చూసేందుకు ఆర్ఎల్డీ నేత జయంత్ సింగ్‌ను ఎన్‌డీఏవైపు ఆకర్షించేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బిహార్‌లోనూ అలాంటి ఫార్ములానే!
బీసీల్లో కీలకమైన యాదవ ఓటర్లు.. యూపీలో ఎస్పీ పక్షాన, బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్‌కు అండగా నిలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఇతర వెనుకబడిన వర్గాలు, దళితులకు చేరువకావడం ద్వారా ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని చూస్తోంది బీజేపీ. ఇందుకోసం బిహార్‌లోనూ చిన్న పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తోంది. కొంతకాలం క్రితం బిహార్‌లోని అధికార ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్-వామపక్ష కూటమిలో ఉన్న కొందరు కీలక ఓబీసీ, దళిత నేతలు.. ఇటీవల బయటకు వచ్చేశారు. దళిత వర్గానికి చెందిన మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఇప్పటికే ఎన్డీఏకు జైకొట్టారు. కుష్వాహా సామాజిక వర్గంలో పట్టున్న ఉపేంద్ర కుష్వాహ.. కూటమిలో చేరడంపై బీజేపీ నేతలతో వరుస చర్చలు జరుపుతున్నారు. కూటమిలో చేరికపై అధికారిక ప్రకటన చేయకపోయినా.. మంగళవారం జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలిపారు కుష్వాహా.
బిహార్‌లోని మరో కీలకమైన దళిత సామాజికవర్గమైన పాసవాన్లకు చెందిన లోక్‌జనశక్తి పార్టీ(ఆర్)ను కూటమిలో చేర్చుకోవడంలోనూ కమలదళం సఫలమైంది. సోమవారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈమేరకు చర్చించారు చిరాగ్ పాసవాన్. అమిత్ షాతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని ట్వీట్ చేశారు. మరోవైపు.. మంగళవారం జరిగే ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల భేటీకి ఎల్జేపీ(ఆర్) హాజరవుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాసేపటికే.. ఎన్డీఏలో చేరాలని చిరాగ్ పాసవాన్ నిర్ణయించుకున్నారని, ఆయన్ను కూటమిలో ఆహ్వానిస్తున్నానని తెలిపారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.
ఇలా ఓబీసీలు, దళితులకు సంబంధించిన చిన్న పార్టీలతో జట్టు కడితే.. ప్రత్యర్థి ఆర్జేడీ-జేడీయూ పోల్చితే.. ఎన్డీఏ అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుని వెళ్లే కూటమిలా కనిపిస్తోందన్నది బీజేపీ నేతల వాదన. 2015 శాసనసభ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్-నీతీశ్ కుమార్ ఇలాంటి కూటమితోనే బీజేపీపై పైచేయి సాధించగా.. ఈసారి తమకూ అలాంటి ఫలితమే వస్తుందన్నది వారి ఆశ.
ఇదే తరహాలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన పార్టీల్ని ఎన్డీఏలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. జులై 18న దిల్లీలో జరిగే సమావేశం ద్వారా.. జాతీయ ప్రజాస్వామ్య కూటమి సరికొత్త 'ఇంద్రధనుస్సు' స్వరూపంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. మరోవైపు.. ఓబీసీల విషయంలో కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు రానున్న కాలంలో దూకుడు పెంచే అవకాశముందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఓబీసీ అయిన సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. కులగణన, వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంపై తమ డిమాండ్లను తీవ్రతరం చేయొచ్చని అంటున్నారు.