అమెరికాకు చెందిన 'ఓపెన్‌ఏఐ' అనే సంస్థ సృష్టించిన 'చాట్ జీపీటీ' కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్‌బాట్. 2021 నవంబరు 30న దీన్ని విడుదల చేసిన అయిదు వారాల్లోనే 10 లక్షల మంది వినియోగదారులను సంపాదించింది. ఇంతమంది వినియోగదారులను ఆకర్షించడానికి ఫేస్‌బుక్(మెటా)కు 10 నెలలు, నెట్‌ఫ్లిక్స్‌కు మూడేళ్లు పట్టిందంటే దీని ప్రాచుర్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వివిధ కంపెనీలు ఖాతాదారుల ప్రశ్నలకు జవాబివ్వడానికి నియోగిస్తున్న చాట్‌బాట్‌లు తమ కంపెనీ ఉత్పత్తులు, సేవల గురించి మాత్రమే జవాబులు ఇవ్వగలవు. అదే 'చాట్ జీపీటీ' సమస్త అంశాలపై మనుషులతో మాటామంతీ జరపగలదు. వికీపీడియా, దేశదేశాల పత్రికలు, ఆన్‌లైన్ గ్రంథాల్లో అందుబాటులో ఉన్న లక్షల పుటల సమాచారాన్ని సంగ్రహించిన చాట్ జీపీటీ- మన ప్రశ్నలకు సమాధానాలను అపార విజ్ఞాన భాండాగారం నుంచి క్షణాల్లో సేకరించి రాతపూర్వకంగా అందిస్తుంది. కృత్రిమ మేధ(ఏఐ) వెబ్ సమాచారాన్ని కేవలం కాపీ కొట్టడానికి మాత్రమే అది పరిమితం కాదు. మానవ మేధలా తనకు అందుబాటులోని సమాచార భాండాగారాల మధ్య సంబంధాన్ని గుర్తించి, ఆ సమాచారంలోని సారూప్యతలను, భేదాలను సమన్వయపరచి జవాబులిస్తుంది. అందుకే, ఇది మనుషులనే మించిపోతుందేమోననే భయాలు మొదలయ్యాయి. అయితే, ప్రస్తుతానికి ఇది కొత్త అంశాలను కనుగొనే సామర్థ్యాన్ని కనబరచడం లేదు. తెలిసిన దానినుంచే సమాధానాలను అందిస్తోంది తప్ప తెలియని అంశాల గురించి ఏమీ చెప్పలేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీతోపాటు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా 'ఓపెన్ ఏఐ' కంపెనీలో పెట్టుబడి పెట్టిన తరవాత నిష్క్రమించారు. లాభాపేక్ష లేని సంస్థగా మొదలైన ఓపెన్ ఏఐ వ్యాపార సంస్థగా మారడాన్ని నిరసిస్తూ మస్క్ తప్పుకొన్నారు. తన యాజమాన్యంలోని ట్విటర్ సమాచార నిధిని చాట్ జీపీటీకి దక్కకుండా నిలిపివేశారు. తన సెర్చి ఇంజిన్‌కు పోటీగా తయారైన చాట్ జీపీటీని చూసి గూగుల్ కూడా త్వరలోనే తనదైన ఏఐ చాట్‌బాట్‌ను అందించనుంది.
మనుషులను మించిపోయే జ్ఞానం
చాట్ జీపీటీ సామర్థ్యాన్ని పెంచడానికి ఓపెన్ ఏఐ నిరంతరం కృషి చేస్తోంది. మన ప్రశ్నలకు అది ఇస్తున్న సమాధానాలకు అప్ ఓట్ (బాగుంది) అని కాని, డౌన్ ఓట్ (బాగాలేదు) అని కాని రేటింగ్ ఇవ్వాలని వినియోగదారులను కోరుతోంది. గురువు వేసే మార్కులను బట్టి తన పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరచుకునే బుద్ధిమంతుడైన విద్యార్థిలా చాట్ జీపీటీ తయారవుతోంది. సాధారణ మానవులకు ఉండే అనవసర వ్యాపకాలు ఈ కృత్రిమ మేధకు ఉండవు. అది అనుక్షణం విజ్ఞాన సముపార్జనే ఊపిరిగా మనుగడ సాగిస్తుంది కాబట్టి భవిష్యత్తులో మానవులను మించిపోయినా ఆశ్చర్యం లేదు. మానవుడు నిత్య సృజనశీలిగా ఉండాలని చాట్ జీపీటీ సవాలు విసరుతోంది. రేపోమాపో ఆస్పత్రులు, వైద్యుల నుంచి సంగ్రహించే సమాచారం ఆధారంగా రోగ నిర్ధారణ చేసి, తగిన చికిత్సలు, మందులు సిఫార్సు చేయడం దానికి అసాధ్యమేమీ కాకపోవచ్చు. అందుకే తక్కువ స్థాయి నైపుణ్యం సరిపోయే ఉద్యోగాలతోపాటు ఉన్నత నైపుణ్యాలు కావలసిన ఉద్యోగాలు, వృత్తులు కూడా కృత్రిమ మేధ వల్ల గల్లంతవుతాయన్న భయాలు పెరుగుతున్నాయి. కానీ, మానవ సిబ్బందికి కృత్రిమ మేధ కో-పైలట్‌గా, చేదోడువాదోడుగా ఉంటూ వారి సామర్థ్యాన్ని, ఉత్పాదకతను ఇనుమడింపజేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో వివరించారు.
ప్రభుత్వాలపై గురుతర బాధ్యత
ఆహారోత్పత్తిని పెంచే సునిశిత సేద్యానికి (ప్రెసిషన్ ఫార్మింగ్) కృత్రిమ మేధ ఆయువు పట్టు కాగలదు. పునరుత్పాదక ఇంధన వనరులతో వాతావరణ మార్పులను నిరోధించడానికి తగిన నమూనాలను అందించగలదు. ఏఐని ప్రజాహితానికి ఉపయోగించడానికి పటిష్ఠమైన నియంత్రణలు, ప్రమాణాలను విధించడం ప్రభుత్వాల కర్తవ్యం. లేకపోతే కృత్రిమ మేధ సమాజంలో పాత అసమానతలకు తోడు కొత్త అసమానతలను, కొత్త ప్రమాదాలను సృష్టిస్తుంది. ఇప్పటికే నేరస్థులు, నేర మనస్తత్వం కలిగినవారు, ఉగ్రవాదులు ఏఐని దుర్వినియోగపరుస్తున్నారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు ఏఐ ఆధారిత ముఖగుర్తింపు సాంకేతికతతో పౌరులపై నిఘావేసి రాజకీయ నిరసనలు తెలిపేవారిని వేధిస్తున్నాయి. ఈ పరిణామాలను గ్రహించి ఐక్యరాజ్యసమితి ఏఐకి నైతిక ప్రమాణాలను సిఫార్సు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రాతిపదిక పత్రాన్ని 2021 నవంబరులో 193 సభ్య దేశాలు ఆమోదించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏఐ హక్కుల బిల్లును ప్రతిపాదిస్తున్నారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) ఏఐ పర్యవేక్షణకు పరిపూర్ణ చట్టాన్ని రూపొందిస్తోంది. ఇవి మాత్రమే చాలవు. 2013-21 మధ్య కృత్రిమ మేధ అభివృద్ధికి 80 శాతం ప్రైవేటు పెట్టుబడులను అమెరికా, చైనాలలోనే పెట్టారు. గూగుల్ వంటి సంస్థల వద్ద అపార వ్యక్తిగత సమాచారం పోగుపడి ఉంది. ఏతావతా ఏఐ మార్కెట్‌ను అతి కొద్ది దేశాలు, కంపెనీలు శాసించబోతున్నాయి. దీన్ని నివారించడానికి ప్రపంచ ప్రభుత్వాలు భారీగా పెట్టుబడులు పెట్టి, పరిశోధనలు చేపట్టి ఏఐని ప్రజాహితం కోసం వినియోగించాలి. ప్రైవేటు సంస్థలూ అలాగే చేసేలా నియంత్రణలు విధించాలి.
అన్నింట్లో వినియోగం
అమెరికాలో న్యాయశాస్త్ర, వైద్యశాస్త్ర, ఎంబీఏ పరీక్షల్లో చాట్ జీపీటీ బీ గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది. అది ఏ గ్రేడ్‌ను అందుకోవడానికి ఎంతో కాలం పట్టదు. విద్యావేత్తలు, పరిశోధకులు వ్యాసాలు రాయడానికి చాట్ జీపీటీని ముడి సరకుగా, సహాయకుడిగా వినియోగిస్తున్నారు. వాణిజ్య ప్రకటనలను రాయడానికి చాట్ జీపీటీనీ, సంబంధిత చిత్రాలను గీయడానికి దాని అనుబంధ సాధనం డాల్-ఇని ఉపయోగించడం మొదలైంది. సంగీత రచనకు, చివరకు కంప్యూటర్ కోడింగ్ రాయడానికి సైతం చాట్ జీపీటీ తోడ్పడుతోంది. అమెరికాలో రవాణా పోలీసులు ఇచ్చే చలాన్లను కోర్టులో సవాలు చేయడానికి చాట్ జీపీటీ ఆధారిత ఏఐ వకీలును ఫిబ్రవరి 22న ఉపయోగించనున్నట్లు 'డూనాట్ పే' అనే అంకుర సంస్థ తెలిపింది. తమ ఏఐ స్మార్ట్‌ఫోన్ ద్వారా పనిచేస్తుందని, కోర్టులో ఎదుటివారి వాదనలు విని దానికి జవాబులను ప్రతివాదికి హెడ్‌ఫోన్ ద్వారా తెలుపుతుందని 'డూనాట్ పే' సంస్థ వెల్లడించింది. ఏఐ వకీలు విఫలమైతే ప్రతివాదికి కోర్టు విధించే జరిమానాను తామే చెల్లిస్తామని ప్రకటించింది. అమెరికాలో విద్యార్థులు చాట్ జీపీటీని పరీక్షల్లో కాపీ కొట్టడానికి ఉపయోగించినందు వల్ల విద్యాలయాల్లో దాని వినియోగాన్ని జామ్ చేశారు.